ఇచ్ఛామతి

ఆఖరి జ్ఞాపకాల్లో మొదటి నువ్వు

ఈ రోజు నిన్ను కలిసిన చివరి రోజు
నా జీవితానికి ఆఖరి జ్ఞాపకానివి

నువ్వు ఎంతకీ చెంతకి రావు
కౌగుళ్ళు శూన్యాలుగా మిగిలిపోతాయి

నిన్ను పిలవాలనుకుంటాను
నా నుంచి వెళ్లకుండా ఆపే ఒక్క మాట కోసం వెతుకుతాను

గొంతులో ఎందుకో
నీతో గడపాలనుకున్న ఊహలు తడిగా మెసులుతూ ఉంటాయి

ఎక్కడ మొదలయ్యామో అనే కాలాన్ని అన్వేషిస్తాను
ప్రేమించిన తొలి దినాలు ఎంత బాగుండేవి!
నీతో కలిసి కొనసాగాలనుకునే కోరికలు పచ్చిగా ఉండేవి
రాత్రంతా మేలుకున్న జాములన్నీ ఆలస్యంగా తెల్లవారేవి

అలా చుక్కల్ని చూస్తూ నీ నా బాల్యాన్ని తలుచుకుంటూ
మురిపెంగా నవ్వుకునే వాళ్ళం
ఇంత రాత్రిలో ఇద్దరమే మేల్కొని
సమయాలను తియ్యగా వెళ్ళబుచ్చుతూ ఉండేవాళ్ళం

కునుకు రాదు
కలవరింత ఉండదు
హాయిగా, ప్రశాంతంగా నీ ఎద మీద తలవాల్చిన దినాలలో
సుఖంగా నిద్రించేవాణ్ణి

భవిష్యత్తు, నిట్టూర్పులు, నిరాశలు, నిస్సహాయతలు
ఏడవలేక కళ్ళు తుడుచుకునే క్షణాలు ఏవీ నీ చెంత నన్ను మభ్యపెట్టేవి కాదు

ఇది చివరి వీడ్కోలే కావొచ్చు
నువ్వు రావనే నమ్మకం నా గుండెల్లో కుదురుకోవడానికి సమయం పట్టవచ్చు
ఆకాశపు చుక్కల వసంతంలాంటి నీ నవ్వులు, కౌగిలింతలు,
పెదవి గోరింటాకు ముద్దులు ఎవరు చెరిపేయగలరు..?

ప్రియా! నీ కౌగిళ్ళ పచ్చిదనం నా దేహాన్ని వీడిపోవటం లేదు
నన్ను బాలింతను చేసి
నువ్వు పసిగుడ్డులా పగిలిపోయావు
వాటి పెంకులను ఏరుకుంటున్నాను
మనసుకేం మరకలు లేవు
నువ్వు రావనే సత్యం ఇంకా ఉదయించలేదు
హృదయం బంకమన్నులా ఉంది
నీ పాద ముద్రల్ని ఒడిలో దాచుకుని.
Spread the love

Goondla Venkatanarayana

కవి, రచయిత. ఇయ్యాల ఊళ్ళో, కాపాలదారుల పాటలు, భూమిపతనం, ద్రావిడమహాసముద్రం, నల్లపిల్లన గ్రోవి, గరికపాటోడి కతలు, నల్లపిల్లనగ్రోవి పుస్తకాలు రాశారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!