మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడు
ఒక్కోసారి మరీ ఒంటరైపోతున్నాం
కొన్నిసార్లు నలుగురితో మాట్లాడిన తరువాత
చుట్టూ పెరిగిన గోడల నడుమ
కుప్పకూలిపోతాం తోక తెగిన
ఒంటరి బల్లిలా
ఎవరన్నారు
ఒక్కడిగా ఉన్నప్పుడే ఒంటరితనం
ఒంటి మీద పేరుకుపోతుందని?
ఒక్కడిగా ఉన్నప్పుడు అంతులేని ఏకాంతం
ఎంతో సందడిగా ఉండవచ్చు…
ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక సమూహంలా
జనారణ్యంలా ఊగిపోవచ్చు
కానీ.. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నకొద్దీ
మనుషులు చేజారుతున్న ఒంటరితనం
ఒకరో ఇద్దరో తోడుగా
ఒక ప్రయాణం ఊహించడమే కష్టమైపోయింది
ఒక్కరే చేయలేని ప్రయాణాలుంటాయి
పది మంది కలిసి చేరుకోవాల్సిన గమ్యాలుంటాయి
గోడలు దాటుకుని వీధుల్లో కాల్వల్లా
ప్రవహించాల్సిన సందర్భాలుంటాయి
కానీ… మనుషుల్లోకి వెళ్తున్నకొద్దీ
మళ్ళీ మళ్ళీ ఈనెల్లా చీలుకుపోవడమేంటి?
కనీసం ఒంటరిగా కూడా మిగలకపోవడమేంటి?
నిన్నటి గాయం లేకుండా
రేపటి వ్యూహం లేకుండా
రెండు చేతులతో నిండుగా మరో మనిషిని
కావలించుకుని ఎన్నాళ్ళయింది?
ఫోన్ మాట్లాడి కట్ చేసింతర్వాత
మరీ మరీ ఒంటరితనం ఒక్కోసారి
ఒంటరితనానికీ ఏకాంతానికీ మధ్య
ఏమిటీ అగాధం ప్రతిసారీ?
మంచి కవిత.