పిట్టల్ని కొని తెచ్చారు
ప్రేమ పక్షులని అన్నారు
గింజలు చల్లాలనుకుంటే
వేళ్ళను కొరుకుతూ
తమ నిర్దాక్షిన్య బందీతనాన్ని
నిరసిస్తున్నాయవి
బద్దలు కొట్టుకొని వెళ్లగలమని
ధైర్యం చేస్తూ
ఇనుప చువ్వలను
చీల్చి ఎగిరిపోవాలన్నట్టు
తేపకోమారు ఎగపోస్తున్నాయవి
బందీ చేయబడింది
పక్షి కాదు
దాని ఎగిరేతత్వం
ఎగరలేని వాటికోసం
పంజరాలు నిర్మించబడవు
చెట్టును నాటలేని
అలసత్వం
స్వేచ్చా భంజిత
విహ్వల విహంగ రోదనలను
బలవంతంగా ఆస్వాదిస్తుంటుంది
అక్కడే కూర్చుని
బొమ్మవేసే పిల్లవాడి కళ్ళలో
పక్షి హృదయం
తేలాడుతోంది
పిల్లలు వేసే బొమ్మల్లో
పక్షికి పంజరం ఉండదు
కొండల నడుమ ఉదయించే
సూర్యుడు, సన్నని బాట
పెంకుటిల్లు, ఎగిరే పక్షి ఉంటాయి
ఏది దైవానికి తెలుసో అది
పిల్లలకూ తెలుసు
వాళ్ళు విప్పార్చిన పక్షి రెక్కలనే
గీస్తుంటారు
పక్షుల్లా బతకాలనుకున్న
మనుషులు కూడా పంజరంలో
ఉంచబడతారు
వారి దుఃఖం కవిత్వమై
ప్రవహిస్తుంటుంది
అదృశ్య శృంఖలాల నిశిజాడ్యంలో
మనుషులు
పంజరాలౌతున్నారు
పిల్లలూ పక్షులూ
దానికి అతీతంగా ఉన్నారు
వ్యాక్యాన్ని జతచేయండి