జర్నలిజం,సైకాలజీలలో మాస్టర్స్ చేసిన సుజాత వేల్పూరి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందినవారు. స్త్రీల మానసిక ప్రవృత్తులలోని సున్నిత విషయాలను సునిశితంగా కథలుగా మలిచారు. పల్నాడు ప్రాంతపు జీవిత కథల ఆధారంగా రాసిన కథలలో ‘పల్నాడు కథలు’ (2021) తన ఇతర కథలతో ‘కొన్ని జీవితాలు- కొన్ని సందర్భాలు (2022) కథా సంపుటాలు వచ్చాయి. స్నేహితురాలు ఉమా నూతక్కితో కలిసి రాసిన ‘రెక్క చాటు ఆకాశం’ మొదటి నవల ఇటీవలే విడుదల అయింది. సుజాత వేల్పూరి గారితో ప్రముఖ సాహితీవేత్త పి.శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన ఇంటర్వ్యూ ఇచ్చామతి పాఠకుల కోసం.
……
1.’పల్నాడు కథలు’ అని ఒక ప్రాంతం పేరు పెట్టి కథలు రాయటానికి కారణం ఏంటి?
జ.పల్నాడు కథల్లో నేను చిత్రించినదంతా పల్నాడు మనుషుల జీవిత కథలే. అందులో ఎక్కువ భాగం అక్కడి స్త్రీల గురించి రాసిన కథలే. ఇంతకుముందు ఆ పల్నాడు భాషని, పల్నాడు జిల్లా ఏర్పడక ముందు గుంటూరు జిల్లా మాండలికంగా కొన్ని కథలలో, సాహిత్యంలో వాడారు. కానీ పల్నాడు ప్రాంతానికి ఒక అస్తిత్వం కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన మనుషుల గురించి కానీ తెలుగు సాహిత్యంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం. అందువల్ల అక్కడి కథలు రాయాలనుకున్నపుడు అవి పల్నాడు కథలుగానే రావాలనుకున్నాను. పల్నాడు జీవితాలను మొదట గా డాక్యుమెంట్ చేసింది బహుశా నేనే కావచ్చు.
2. సైకాలజిస్టుగా, కౌన్సెలర్ గా మీ అనుభవాలు కథలుగా రూపుదిద్దుకున్నాయా?
జ.కౌన్సెలింగ్ లో రక రకాల జీవితాలు ఎదురవుతాయి. నేను women protection cellలో కౌన్సిలర్‌గా పని చేశాను. బోలెడన్ని వేదనా భరిత జీవితాలు రోజూ ఎదురయ్యేవి. ఆ తర్వాత అమెరికాలో ఉన్నపుడు స్కూల్ డిస్ట్రిక్ట్ లో హైస్కూల్ స్టూడెంట్ కౌన్సెలర్స్ తో కలిసి పని చేశాను. ఆ తరువాత నేను సైకాలజిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత టీనేజ్ పిల్లల కోసం పని చేయడం చాలా అవసరం గా భావించి ఒక జూనియర్ కాలేజీ గ్రూప్ కోసం పని చేశాను. అప్పుడు మరి కొన్ని అనుభవాలు. కౌమార దశ లో పిల్లల మానసిక స్థితి, చదువు ఒత్తిడి, వగైరాలు. అయితే ఈ అనుభవాలన్నిటినీ కథలు గా మలచాలనీ, పుస్తకంగా తీసుకురావాలనీ అనుకోలేదు. ఎప్పుడైనా స్నేహితులు అడిగినపుడు రాస్తే బాగుండనుకుంటాను గానీ కానీ తగినంత సమయం దొరకడం లేదు. భవిష్యత్తు లో కొన్ని అయినా రాస్తానేమో బహుశా! ఇప్పుడే చెప్పలేను.
3. అమెరికా నేపథ్యంలో మీరు రాసిన కథల్లో స్త్రీల ఆత్మగౌరవాన్ని చూపించారు. అక్కడ కూడా స్త్రీల మీద వివక్ష లాంటివి ఉంటాయంటారా?
జ. స్త్రీల మీద వివక్ష అనేది యూనివర్సల్. ఎక్కడయినా వుంటుంది. స్త్రీ అనేది ఎప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్ గానే ఉంది కదా సొసైటీలో. అయితే అమెరికా నేపథ్యంలో నేను రాసిన కథలన్నీ కూడా మన ఇండియన్ స్త్రీల కథలే కాబట్టి వాళ్ళ కుటుంబం భారతీయ కుటుంబమే!వాళ్ళు పాటించే విలువలు, వాళ్ళ ఇంట్లో నడిచే సంప్రదాయాలు ఇవన్నీ కూడా భారతీయ కుటుంబ వ్యవస్త బేస్ గానే ఉంటాయి. ఏళ్ల తరబడి అమెరికాలో ఉన్న కుటుంబాలలో కూడా భారతీయ కుటుంబ విలువలే ఉంటాయి. ఎక్కడైనా సరే నా కథలలో స్రీ పాత్రలన్నీ కూడా ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తాయి. పల్నాడు కథలు కావచ్చు, మిగతా కథలు కావచ్చు, ఆత్మగౌరవం ( సెల్ఫ్ రెస్పెక్ట్) అనేది స్త్రీ పాత్రలలో ప్రధానంగా కనపడుతుంది.
4. మీరు చాలా కథలు తెలుగులోకి అనువాదం చేశారని విన్నాను. మీ అనువాద కథల అనుభవాలు చెప్పండి?
జ. నేను విపులకు తర్వాత ఈ-మాటకి చాలా అనువాదాలు చేశాను. వాకిలి పత్రికకు ఒకటి రెండు అనువాదాలు చేశాను. ఇతర దేశాల మంచిసాహిత్యం చదివినప్పుడు, ఆ కథలని తెలుగులోకి తీసుకొస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ దేశాల కథలు.. చిలీ గానీ, ఘనా గానీ, క్యూబా ఇలాంటి దేశాలలో చాలా గొప్ప సాహిత్యం వుంది. చాలా లోతైన కథలు వాళ్ళవి. ఆ సాహిత్యంలో మనుషుల మనస్తత్వాల విశ్లేషణ, నాన్ జడ్జిమెంటల్ గా చిత్రణ ఉంటుంది. విపుల చివరి సంచికలో కూడా నేను అనువదించిన కథ ఒకటి వుంది. అలాగే భారతీయ కథలు కూడా కొన్ని అనువదించాను. నా వరకూ అనువాదం ఎలా ఉండాలంటే, ఆ ప్రక్రియ సరళంగా ఉండాలి. చదువుతున్నప్పుడు ఒరిజినల్ కథలాగే తోచాలి. కానీ నేటివిటి ( స్థానికత ) మాత్రం పోగొట్టుకోకూడదు. మనం ఒక మలయాళ కథని చదువుతున్నపుడు, ఆ కథ మన కళ్ళ ముందే జరుగుతుందనిపించాలి. మనం కేరళలో వున్నట్లనిపించాలి. మనుషులు ఎక్కడైనా ఒకలాగే వుంటారు. ప్రేమ, క్రోథం లాంటి సహజాతాలు ఏ దేశపు మనుషులకైనా ఒకటే. కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రవర్తన వుంటుంది. అందువల్ల నేను అనువదించిన కథలన్నీ ఇలాగే సరళంగా వుండేలా చూసుకుంటాను. దాదాపు పాతిక, ముప్పై కథల వరకు నేను అనువదించాను.
5. మీరు, ఉమా నూతక్కి కలిసి రాసిన నవల రెక్క చాటు ఆకాశం గురించి చెప్పండి. మీకు అసలా ఆలోచన అంటే ఇద్దరు రచయిత్రులు కలిసి నవల రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నాకు తెలిసి ఇద్దరు రచయిత్రులు కలిసి తెలుగులో రాసిన మొదటి నవల ఇదే అనుకుంటున్నాను.
జ. అవును. మీరన్న మాట కరెక్టే. తెలుగులో ఇద్దరు రచయిత్రులు కలిసి ఒక నవల రాయడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు ఎవరూ రాయలేదు. గొలుసు నవలలు కొంతమంది రాసారు గానీ, ఇద్దరు రచయిత్రులు కలిసి రాయలేదు.
ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో కథ ప్రచురితం అయినపుడు పాఠకులు రచయితకు ఫోన్ చేస్తూ వుంటారు. అలా చేసినప్పుడు ఒకరిద్దరు క్రమం తప్పకుండా ఫోన్ చేసే పాఠకురాలు ఒకావిడ మాటల సందర్భంలో ‘మీకు ఉమా నూతక్కి గారు తెలుసా?’ అని అడిగినప్పుడు ‘అవును, తను నా స్నేహితురాలే ” అన్నాను. “ఆవిడ కూడా మీలాగే రాస్తారండీ..ఆడవాళ్ళ సమస్యల గురించి మీరు రాసినప్పుడు నాకు ఉమా నూతక్కి గుర్తొస్తూ వుంటుంది. మీ ఇద్దరూ కలిసి ఒక కథో, నవలో రాయొచ్చు కదా’ అని అడిగింది.
ఆ తర్వాత ఉమా ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు ఉమా ‘నవల ఎందుకు రాయకూడదు, నిజంగా రాద్దాం’ అంది. దేని మీద రాయాలి అనుకున్నప్పుడు..వర్తమాన విషయాలు..తను ఒక టాపిక్ అనుకున్నప్పుడు.. నాతో పంచుకున్నప్పుడు..ఇది బాగానే వుందనుకొని..దాన్ని ఎలా రాద్దామని ఇద్దరం చర్చించుకొని ఒక పద్దతిలో రాద్దానుకున్నప్పుడు ఈ నవల రూపుదిద్దుకుంది.
7. సామాజికంగా స్త్రీల ప్రాతినిధ్య కథలు, నవల రాశారు కదా? ఇవి సమాజానికి ఎటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయనుకుంటున్నారు? ఈ కథలు చదివి స్త్రీలు చైతన్యమై, మారే అవకాశం వుందా?
జ. కథ అనేది ఒకళ్ళలో మార్పు తెస్తుంది అని మనం అనుకోకూడదు. సాహిత్య ప్రయోజనం మార్పు తీసుకురావడం కాదు. కొన్నిసార్లు మార్పు రావొచ్చు. ప్రతి కథ ప్రతొక్కరిలో ఏదొక మార్పు తీసుకురావాలని మనం అనుకోలేం. రెక్క చాటు ఆకాశం నవల ఒక కథ. ఆ నవల చదివిన తర్వాత చాలా మంది దానికి రిలేట్ చేసుకుంటారు. కొంతమంది బయటకు చెపుతారు. కొంతమంది చెప్పలేరు. స్త్రీల గురించి రాసినప్పుడు కూడా చాలామంది, పల్నాడు కథలలో మా అమ్మమ్మ గుర్తొచ్చిందనీ, మా అమ్మ గుర్తొచ్చిందనీ, నేనే ఆ పాత్రలో నన్ను నేను చూసుకున్నాననీ ఫోన్లు చేసి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళున్నారు. స్త్రీ పాత్రలు Protagonist లుగా కథ రాసినప్పుడు, ఎవరో ఒకళ్ళు దానికి తప్పకుండా కనెక్ట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి సమస్యలు మనకే కాదు, వేరే వాళ్ళకి కూడా వున్నాయి అని వాళ్ళు రిలేట్ చేసుకోవడం చాలాల్ ముఖ్యం. కథలు చదివి మనుషులు మారడం అనేది అన్ని సార్లూ వుండదు. కొన్ని కథలు చదివి మారతారేమో కూడా. నన్ను మార్చిన పుస్తకాలు కూడా వున్నాయి. నా మీద రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ నవల ప్రభావం చాలా వుంది. మన ఆలోచనల్ని మార్చే పుస్తకాలు వస్తాయి. మనల్ని మనం ఆ పుస్తకాల్లో చూసుకోవడం, రిలేట్ చేసుకోవడం కూడా సాహిత్య ప్రయోజనమే అని నేను అనుకుంటాను.
8. అనల్ప బలరాం గారు, మీరు కలిసి ‘డిసెంబరు పూలు’ వార్షిక కథా సంకలనాలు తెస్తున్నారు. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా కథా సంకలనాలు వస్తున్న నేపథ్యం వుంది. మరొక కథా సంకలనం తేవాలని ఎందుకు అనిపించింది?
జ. కథ ఎప్పుడూ పాతబడదు. రాస్తున్న కొద్దీ,చదువుతున్న కొద్దీ వస్తూనే వుంటాయి. కథ అనేది మానవ జీవితంలో ఒక భాగం. అందువల్ల ఎన్ని కథా సంకలనాలు వచ్చినా కూడా, ఇంకొకటి అవసరం లేదు అని మనం చెప్పలేము. డిసెంబరు పూలు కథా సంకలనం మొదటిదీ కాదు, చివరిదీ కాదు. దాని తర్వాత కూడా ఎన్నో వస్తాయి. దేని ప్రత్యేకత దానికే వుంటుంది. మేము ప్రతి డిసెంబరులో సెలెక్టివ్‌గా కొన్ని కథలు ఎన్నిక చేసి, ఒక కథా సంకలనం తీసుకు వద్దామని నేను, బలరాం గారు అనుకున్నాం. ప్రతి ఏడాది దాని పేరు ‘డిసెంబర్ పూలు’ గానే వుంటుంది.
దాంట్లో మేము నాణ్యతకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. నాణ్యత వున్న కథలు ఆరో, ఏడో వచ్చాయనుకోండి..ఆ కథలతోనే పుస్తకం వేస్తాం. కథా సంకలనాలు ఎప్పుడూ రావాల్సిందే. ఎంతమంది కథలు రాస్తే అన్ని కథా సంకలనాలు వస్తాయి. కథ అవసరం ఎన్నాళ్ళు వుంటుందో, కథా సంకలనాల అవసరం కూడా అన్నాళ్ళు వుంటుంది.
……..
ఇంటర్వ్యూ : పి.శ్రీనివాస్ గౌడ్.
వ్యాక్యాన్ని జతచేయండి