ఇచ్ఛామతి

చీకటి గదుల్లో ఒక్క కిటికీ అయినా తెరుచుకోవాలనే చేసే ప్రయత్నమే మా కథలు… ఉమా నూతక్కి

ఉమా నూతక్కి, వృత్తి రీత్యా lic of Indiaలో ఆపీసర్ గా పని చేస్తున్నారు. జర్నలిజంలో మాస్టర్స్,  ఎంబీఏ,  LLB చేశారు. ఇప్పటిదాకా 20 కథలు రాశారు. ఆమె కథలు ‘25వ గంట’ పేరుతో సంకలనంగా వచ్చాయి. కమ్యూనిస్టు మేనిఫెస్టో అనువాదం చేసారు. ‘Brotherless night’ పుస్తకాన్ని ‘మనుషులు మాయమయ్యే కాలం’ పేరుతో అనువాదం చేశారు. స్నేహితురాలు సుజాత తో కలిసి ‘రెక్కచాటు ఆకాశం’ పేరుతో ఒక నవల రాసారు. ‘మంకెన పూలు’ పేరుతో భూమిక పత్రికలో రెండేళ్లపాటు ఒక కాలమ్ రాశారు. 

ఉమా నూతక్కి గారితో పి. శ్రీనివాస్ గౌడ్ గారి ఇంటర్వ్యూ ఇచ్చామతి పాఠకుల కోసం.

…….. 

A. “రెక్కచాటు ఆకాశం” గురించి అడిగితే, నేను దాన్ని కేవలం ఒక నవల అని చెప్పలేను. ఇది ఒక గళం – ఒకే స్త్రీ గళం కాదు, అనేక గళాలు. ఆ గళాలు కలిసినప్పుడు అవి ఒక కేకగా, ఒక మంత్రంలా వినిపిస్తుంది . సమాజం స్త్రీకి కేటాయించిన గడపలు, ఆమెపై రుద్దిన ఆంక్షలు, అణచివేతలు – ఇవన్నింటినీ ఈ నవల ప్రస్తావిస్తుంది.. పేరు కూడా అలానే వచ్చింది – “రెక్కచాటు ఆకాశం”. రెక్కలు ఉన్నా, ఆకాశం అందని స్థితి. ఆ బంధనాల మధ్యే ఎగిరే ప్రయత్నం చేసే స్త్రీల గాథ ఇది.

ఇద్దరు రచయిత్రులు కలిసి నవల రాయాలనే ఆలోచన  ఒక ప్రాజెక్ట్‌గా మాకు రాలేదు. అది ఒక అనివార్యతగా వచ్చింది. మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలు చర్చించుకుంటున్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు.. రాయడం తప్ప ఈ దుఃఖానికి, ఈ అవేదనకి వేరే విముక్తి లేదు అనుకున్నప్పుడు కలిసి నవల రాయాలన్న ఆలోచన మా ఇద్దరికీ వచ్చింది.  నా వాక్యం చెప్పలేకపోయిన చోట సుజాత వాక్యం నిలబెట్టుకుంది; ఆమె మౌనంగా నిలబడిన చోట నా పదాలు శ్వాసించాయి. ఇద్దరి అనుభవాలు, దృష్టికోణాలు, అంతరంగ యుద్ధాలు – ఇవన్నీ కలిసినప్పుడు ఈ కథ మరింత విస్తరించింది. ఒకరికి ఒకరం అద్దంలా నిలబడి, ఒకరి లోపలి స్తబ్దతను మరొకరు పదాల్లోకి మార్చుకున్నాం.

తెలుగులో ఇద్దరు రచయిత్రులు కలిసి ఒక నవల రాయడం ఇదే మొదటి ప్రయత్నం. కానీ ఈ అరుదు కోసం మేము ప్రయత్నించలేదు. ఈ కథకే రెండు హృదయాలు, రెండు స్వరాలు అవసరమయ్యాయి. మేము అలా రాశాం. అందుకే “రెక్కచాటు ఆకాశం” కేవలం ఒక రచన కాదు – అది ఇద్దరి గాయాల రక్తముద్రలు మిళితమైన ఒక పుస్తకం.  

A. సాహిత్యం సమాజాన్ని ఒక్క రాత్రిలో మార్చేస్తుందనుకోవడం అమాయకత్వం. కానీ అది పాఠకులని, తద్వారా సమాజాన్ని కచ్చితంగా కదిలిస్తుంది. స్త్రీల ప్రాతినిధ్య కథలు రాయడం అంటే కేవలం స్త్రీల గాధలు వ్రాయడం కాదు – అది వారి మౌనానికి స్వరం ఇవ్వడం. సమాజం ఎప్పుడూ స్త్రీని ఒక పాత్రలో కట్టేసింది: తల్లి, భార్య, కూతురు, బంధువు. కానీ ఆమె “నేను” అనే అస్తిత్వం ఎక్కడ? మా కథలు ఆ ప్రశ్నను పాఠకుల ముందుకు  తీసుకు స్తాయి. ఆ ప్రశ్న విన్నాక వారు దాన్ని విస్మరించడం కష్టమే.

మార్పు ఒక్కసారిగా రాదు. కానీ విత్తనం పడుతుంది. ఒక స్త్రీ ఈ కథలు చదివిన తర్వాత తన జీవితాన్ని కొత్త కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది. “నేను ఇలాగే ఉండాలా? నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకోలేనా?” అనే ఆలోచన మొదలవుతుంది. అదే చైతన్యం. అదే మొదటి విప్లవం.

మేము వ్రాసిన కథలు తక్షణ పరిష్కారం ఇవ్వకపోవచ్చు. కానీ అవి పాఠకుడి మనసులో ఒక అసహనం, ఒక ప్రశ్న, ఒక తపనను నాటుతాయి. ఈ చీకటి గదుల్లో ఒక్క కిటికీ అయినా తెరుచుకోవాలి – మా కథలు ఆ కిటికీ తీయడానికి ప్రయత్నం చేస్తాయి.

A నిజమే నేను కొన్ని అనువాదాలు చేశాను. కానీ చాలా తక్కువ. ఒక రచన చదివిన ఉద్వేగంలో అనువాదం చేసినవే ఎక్కువ.  మాయా ఏంజిలో నాకు ఇష్టమైన రచయిత్రి. ఆమె కవిత్వం కొంత అనువాదం చేశాను. అలానే రెండు మంటో కథలు. ఒక నాలుగు మపాసా కథలు అనువాదం చేశాను. ఇవి సారంగలో ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించబడ్డాయి. మార్క్వెజ్ One hundred years of solitude అనువాదం చేశాను. ఖలీల్ జిబ్రన్ వి ఇంకొన్ని. ఇవి నాదగ్గరే వున్నాయి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో సరళంగా కావాలని శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారు అడిగితే చేశాను. brotherless night పుస్తకాన్ని మనుషులు మాయమయ్యే కాలం గా అనువాదం చేశాను. ఈమధ్యే విడుదల అయింది.

“కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో” అనేది తాత్వికంగా, ఆర్థికంగా గాఢమైన భాషలో రాసిన పుస్తకం. అందులోని “బుర్జువా”, “ప్రొలెటేరియట్” వంటి పదజాలం సాధారణ పాఠకుడికి కఠినంగా అనిపిస్తుంది. దీన్ని సరళమైన ఈకాలపు తెలుగులో అనువదించాలనే అభిప్రాయంతో చేశాను. సారం కోల్పోకుండా క్లిష్టతను తొలగించిన అనువాదం ప్రచారం, చైతన్యం, ఉద్యమాలకు బలమైన పునాదిగా నిలుస్తుంది.

“రెక్కచాటు ఆకాశం” నవల వస్తువు స్త్రీ అస్తిత్వాన్వేషణ (existential quest) – అంటే ఒక స్త్రీ తనను తాను కనుగొనడానికై చేసిన ప్రయాణం. ఇది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాత్రమే కాదు; లొంగిపోవాల్సిన పరిస్థితుల్లో నిలబడి, తన శక్తిని, స్వరాన్ని వెతుక్కునే ఒక స్త్రీ కథ.

ఇందిర అనే కథానాయిక బాల్యం నుంచీ పెరిగిన కుటుంబ, సామాజిక, సాంస్కృతిక ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ, వాస్తవంగా తన జీవితమేమిటో వెతుక్కుంటూ సాగుతుంది. ఈ నవలలో వస్తువు ఏకపక్షంగా ఆమె బాధలను మాత్రమే చూపడం కాదు – ఆమె తిరుగుబాటును, ఆమె లోపలే దాగి ఉన్న బలాన్ని, ఆమె ఎదుగుదల తాలూకు అంతరంగ ప్రయాణాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.

ఇది ఒక మహిళగా మాత్రమే కాక – ప్రతి అణగారిన మనిషి తనకు తానే అడిగే ప్రశ్న:

“నేను ఎవరు? నా జీవితానికి అర్థం ఉందా? నేను ఎందుకు ఓర్పుతో జీవిస్తున్నాను? నా స్వరానికి విలువ దక్కే రోజు వస్తుందా?”

ఇవి సాధారణ ప్రశ్నల్లా కనిపించవచ్చు కానీ, ఇందిర జీవితం వాటిని సూటిగా ఎదుర్కొనడం ద్వారా – పాఠకుడిని సైతం ఆలోచింపజేస్తుంది.

ఈ నవలలో వస్తువు మూడు ప్రధాన వలయాల్లో తిరుగుతుంది:

స్త్రీల జీవితం మీద పితృస్వామ్య వ్యవస్థ చూపే అణచివేత. ఆ అణచివేతను లొంగిపోయిన మనస్తత్వం నుంచి తిరస్కరించుకునే ధైర్యం. జీవితంలో అర్థాన్ని వెతుక్కోవడమే కాదు, దాన్ని సృష్టించుకోవాలనే తపన.

నవల మూడో భాగంలో, ఇందిర స్వేచ్ఛ కోసం చేసే నిస్సహాయ ప్రయత్నాలు, సోదరీభావం ద్వారా ఆమెకు లభించే మానసిక ఆశ్రయం, ఆమెకు ఒక చైతన్యం తెస్తాయి. అది వ్యక్తిగత పరిష్కారంగా కాక – సమాజానికి ఒక సవాల్‌లా నిలుస్తుంది.

ఇక్కడ వస్తువు కేవలం స్త్రీ స్వేచ్ఛగురించి మాత్రమే కాదు – స్త్రీకి తన గొంతును తిరిగి సంపాదించుకునే ప్రయాణం గురించి. ఆమె బలహీనతలతో కలిసి తన శక్తిని గుర్తించడంలా.

——

ఇంటర్వ్యూ:  పి. శ్రీనివాస్ గౌడ్

Spread the love

శ్రీనివాస్ గౌడ్

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!