ఒక్కోసారలా
ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడు
పిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుంది
గాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవో
రెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుంది
ఒక్కోసారలా
ఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన సోలిపోయినప్పుడు
అల అలా అలా వచ్చి పాదాలను పలకరిస్తుంది
ఇసుక కనుక్కోవాలని ఆరాట పడిన సాగరలోతు గుట్టును
చిక్కటి నవ్వుతో కలిసి బయటకు నెట్టేస్తుంది
ఒక్కోసారలా...
ఉత్తినే ఇంద్రధునువువైపు మనస్సు పారాడినప్పుడు
రంగుల్ని బంధించిన సీతాకోకచిలుక చెలికత్తెలా చుట్టుముడుతుంది
నడక దారిలో విడిచి వెళుతున్న ఒక్కో జీవన పార్వ్శాన్ని
ఏకమౌతున్న సప్తవర్ణాల సాక్ష్యంగా విశదపరుస్తుంది
ఒక్కోసారలా..
ఉత్తినే మనసుకేమీ పట్టనప్పుడు
ఉత్తినే మాటలేవీ తట్టనప్పుడు
ఉత్తినే జీవితపు ద్వారాలేవీ తెరుచుకోనప్పుడు
ప్రకృతి పాటల్ని పాడుకుంటాను
మరల మరల
నాలోని మనిషితనాన్ని మేల్కొలిపే గీతాలేవో
వినాలని ఆశ పడుతుంటాను
అప్పుడే
ఏదో ఒక భావమో
ఏదో ఒక బాధో లేని
మనిషితనం నాకక్కరలేదని
ఉత్తిగా స్పృహలోకి వస్తుంది...
*
సుధా మురళి
వ్యాక్యాన్ని జతచేయండి