పొద్దున్నే
టీపాయి మీద
సెల్ ఫోన్ లో పాట వింటున్నాను
కిటికీలోంచి
చల్లటిగాలి మెలికలు తిరిగిపోతూ వీస్తుంది.
ఎక్కడి నుంచో
ఓ చీమ ప్రత్యక్షమైంది.
గుంపు నుంచి వీడిపోయి
ఒంటరిగా తిరుగుతున్నట్టుంది.
నా చూపు
పాటలోంచి చీమవైపు మళ్లింది
పాటకోసమే ఆగినట్టుంది
ఇంతకూ చీమకు చెవులుంటాయా!
ఇంత చిన్న శరీరంలో
ఎంత పెద్ద ప్రపంచముందో!
చిట్టించి చూసే
చిన్నాతి చిన్న కళ్లల్లో
పారవశ్యం కాబోలు!
‘అబీ నా జావో చోడ్ కర్’ గీతం
పరిసరాలను భావాశబలితం చేసింది
పాట ముగిసింది
మనసు తడిసింది
చూస్తే చీమలేదు
పాటను మోసుకుంటూ
ఎటో వెళ్లిపోయింది.
అన్నట్టూ
చీమకూడా పాడుతుందా!
Different Ant!