ఇచ్ఛామతి

పిపీలికం

పొద్దున్నే 
టీపాయి మీద
సెల్ ఫోన్ లో పాట వింటున్నాను
కిటికీలోంచి
చల్లటిగాలి మెలికలు తిరిగిపోతూ వీస్తుంది.

ఎక్కడి నుంచో
ఓ చీమ ప్రత్యక్షమైంది.
గుంపు నుంచి వీడిపోయి
ఒంటరిగా తిరుగుతున్నట్టుంది.
నా చూపు
పాటలోంచి చీమవైపు మళ్లింది
పాటకోసమే ఆగినట్టుంది
ఇంతకూ చీమకు చెవులుంటాయా!

ఇంత చిన్న శరీరంలో
ఎంత పెద్ద ప్రపంచముందో!
చిట్టించి చూసే
చిన్నాతి చిన్న కళ్లల్లో
పారవశ్యం కాబోలు!

‘అబీ నా జావో చోడ్ కర్’ గీతం
పరిసరాలను భావాశబలితం చేసింది
పాట ముగిసింది
మనసు తడిసింది
చూస్తే చీమలేదు
పాటను మోసుకుంటూ
ఎటో వెళ్లిపోయింది.
అన్నట్టూ
చీమకూడా పాడుతుందా!
Spread the love

డా. ఎన్. గోపి

ఆచార్య ఎన్. గోపి తెలుగు పండితులు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశారు. నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు.

దాదాపు యాబై తొమ్మిది పుస్తకాలు దాకా ప్రచురించారు. వాటిలో 11 కవితా సంకలనాలు, విమర్శనా గ్రంథాలు, నిలువెత్తు తెలుగుసంతకం సినారె వ్యక్తిత్వం, నాలుగు యాత్రాగ్రంథాలు ఉన్నాయి. కవిత్వం, తంగేడుపూలు, మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, చుట్టకుదురు, ఎండపొడ, జలగీతం, – దీర్ఘకావ్యం. నానీలు, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, మళ్ళీ విత్తనంలోకి, వేమనవాదం, వ్యాసనవమి వేమన పద్యాలు - పారిస్ ప్రతి జ్ఞానదేవుడు గవాక్షం, సాలోచన-పీఠికలు. అనేక అనువాదాలు చేశారు. కృష్ణశాస్త్రి అవార్డు, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, సినారె కవితాపురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కవితాసంపుటి బహుమతి, దాశరథి సాహితీ పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం మొదలగు పురస్కారాలని అందుకున్నారు.

1 వ్యాక్య

Leave a Reply to Geeta Vellanki స్పందనను రద్దుచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!