ఇచ్ఛామతి

సాహిత్య యాత్ర

సోవియట్ రష్యా ఈ పేరు చిన్నతనం నుండి పాఠ్యాంశాలలో , లైబ్రరీ పుస్తకాల్లో, సోషల్ టీచర్ నోటి నుండి విని విని ఉండడం, ప్రపంచ యుద్ధ చరిత్రని చరిత్రగా చదవడం ఆ చరిత్రలో మార్క్స్, స్టాలిన్, లెనిన్, పుష్కిన్లను తెలుసుకోవడం మొదలైంది.
యుద్ధం ఎక్కడ జరిగినా విధ్వంసం మాత్రం ప్రపంచమంతా మోస్తుంది. అలా ప్రపంచ యుద్ధ గాయాల్ని చరిత్రలో లిఖించుకొని వామపక్ష భావజాలంతో సోషలిస్టు సామ్రాజ్యంగా అవతరించిన రష్యా నుండి వినిపించిన విప్లవ శంఖారావాలని అణువణువు నింపుకున్న భారతీయ చరిత్రలో నిర్నిద్రరాత్రులను జయించడానికి ఊపిరి నింపిన సాహిత్యం రష్యా సాహిత్యం అని చెప్పుకోవచ్చు. అలా యువతను ప్రగతి పదం వైపు నడిపించిన వామపక్ష భావజాలం కమ్యూనిస్టు వ్యవస్థకు పునాది వేసిన బలమైన ప్రకంపనులను చైతన్యాన్ని అందుకున్న నూరేళ్ల చరిత్రగా ప్రవహిస్తూంది.
ఇందులోని సాహిత్య పరిమళం తెలిసినా తెలియకపోయినా ఎందరికో 70ల కాలంలో యువతకు ప్రేరణని నింపింది సోవియట్, బోల్షివిక్ విప్లవ చరిత్రలే. అందుకు సాహిత్య ప్రేరణగా రష్యా రచయితలు అందించిన సాహిత్యం అణువణువునా మన సాహిత్యంలోనూ ప్రవహించింది. మేధను పెంచింది. అటువంటి మేధస్సు వున్న నలుగురు మిత్రుల కలయికగా మారి వామపక్ష భావజాలంలో ఎదిగిన ఆలోచనలు ఒక్కసారి ఆ ప్రాంతాలని చూసి రావాలన్న తపనను నింపింది అలా మొదలైన ప్రయాణమే ఈ “రష్యా నుంచి ప్రేమతో” పుస్తకావిష్కరణ సభలో కూర్చున్న తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి అందుకు కారణం ఒక్కొక్క వక్త మాటల్లో ఒక్కో సందేశం వినిపిస్తున్నట్లుగా ఉంది. చూడలేని సన్నివేశాలని, ఊహకందని చరిత్రని పొట్లం చుట్టి ఆ పుస్తకంలో పెట్టారనిపించింది.

పుస్తకం చదివేలా నన్ను ప్రేరేపించిన సభా విశేషాలు ముందుగా చెప్పుకుందాం. ఆ తరువాత పుస్తకంలోని విషయాలను గురించి తెలియజేస్తాను. సభ 26 ఏప్రిల్ 25 సాయంత్రం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సభ ప్రారంభమైంది. వేణుగోపాల్ రెడ్డి గారు, తాడి ప్రకాష్ గారు, చంద్రశేఖర అజాద్ గారు, స్వర్ణ కిలారి గారు ఖదీర్ బాబు గారు, గోరేటి వెంకన్న గారు ప్రసాదమూర్తి గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ చేశారు కుమార్ కూనప రాజు గారు. వేణుగోపాల్ అధ్యక్షతన సభ ఆద్యంతం చక్కగా నడిచింది. సభని మొదలుపెట్టిన వేణుగోపాల్ గారు తన ప్రసంగంలో ఈ రష్యా పుస్తకానికి రష్యా ప్రయాణానికి కారణమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కుమార్ కూనప రాజుగారు, అరణ్యకృష్ణ గారు,నాగేంద్ర కుమార్ గార్లతో కలిసి చేసిన ప్రయాణంలో వారు మరిచిపోలేని జ్ఞాపకాలని అక్కడికి

వెళ్లడానికి ప్రేరణ అయిన రష్యా సాహిత్యాన్ని, అక్కడి వాతావరణాన్ని, వారు చదువుకున్న నవలా కథా సాహిత్యాల్లో కనిపించిన ఇమేజినరీ అక్కడికి వెళ్లి చూసి కూడా అదే అనుభూతిని పొందారని, పోప్లార్ చెట్లు, ఆహ్వానం పలికిన తీరు, అక్కడి ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధ గాయాల్ని జ్ఞాపకాలుగా మలిచి వారు నిర్మించుకున్న నగరాన్ని చూసి అబ్బురపడ్డ క్షణాలను, మధురమైనవిగా జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందామని తెలిపారు. అక్కడ స్మశానాన్ని నిర్మాణాత్మకంగా కళాత్మకంగా నిర్మించిన తీరును చూసి ఆశ్చర్యపోయిన అనుభవాన్ని పంచుకున్నారు.
ఆ తరువాత తాడి ప్రకాష్ గారు మాట్లాడుతూ రష్యా సాహిత్యం ఒక వైన్ లాంటిదని చిన్న ఉదాహరణలు వివరిస్తూ అక్కడి ప్రాంతంలో యువత ఎక్కువగా తాగుడుకు బానిస అన్న చేదు నిజాన్ని ఎంతో హాస్యాస్పదంగా వివరించారు. ఈ రష్యా ప్రయాణం గురించి రాసిన పుస్తకం ఎప్పటికీ తిరుగులేని జ్ఞాపకంగా మిగులుతుందన్నారు యుద్ధ గాయాలను చరిత్రగా మోసుకొచ్చిందని చెప్పారు.
గోరేటి వెంకన్న గారు మాట్లాడుతూ ప్రజల గొంతుల్లో సోవియేట్ విప్లవ కథలు విన్నానని, వారు పాడిన పాటల్లోని పల్లె పదాలతో పాటు ఈ రష్యా సాహిత్యం కూడా ప్రేరణగా ఉండేదని చిన్ననాటి పుస్తక ప్రపంచాన్ని తలుచుకుని లెనిన్, మార్క్సిం గోర్కి అమ్మ నవలని, చెకోవ్, దోస్తాయేవ్ స్కి… సాహిత్యాన్ని గుర్తు చేశారు. ఈ పుస్తకంలో ఎంతో అందంగా రష్యాలోని పలుప్రాంతాలను అర్థమయ్యేలా మంచి ఫోటోలుపెట్టి పుస్తకాన్ని మలిచారని అభినందించారు.

అజాద్ గారు మాట్లాడుతూ కుమార్ గారికి ఉన్న రష్యన్ సాహిత్య పిపాసని ఆయన చేస్తున్న అనువాదాలని గుర్తు చేస్తూ పుస్తకాలని ఎంతో ప్రేమగా చదువుతారో అంతే ప్రేమతో మాతృభాషలోకి అనువాదాలని తీసుకువచ్చి రష్యన్ సాహిత్యాన్ని అందరికీ దగ్గర చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. ప్రసాద మూర్తి గారు తన చిన్ననాటి ఇంటి వాతావరణాన్ని పుస్తక విస్తృతిలో పుస్తకాలు అందునా రష్యన్ సాహిత్యం పోషించిన పాత్రని రష్యన్ కథనాలని, నవలా నాయకులను గుర్తు చేస్తూ నేటి పరిస్థితుల్లో అనువాద సాహిత్యాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నందుకు అభినందించారు. ఖదీర్ బాబు గారు మాట్లాడుతూ రష్యన్ సాహిత్యం పట్ల సాహితీ రచనలను అనువదించడం పట్ల కుమార్ గారి ఫ్యాషన్ను అభినందిస్తూ పుస్తకం చాలా గ్రాండ్ గా వచ్చిందని చిత్రాలన్నీ అక్కడ చరిత్రకు గుర్తుగా ముద్రించారని తెలిపారు. స్వర్ణ కిలారి గారు మాట్లాడుతూ పుస్తకాన్ని చదివినంత సేపు ఒక తాదాత్మకతను పొందానని, అక్కడి చిత్రాలను స్పర్శించినంత భావోద్వేగానికి గురి అయ్యానని, రష్యన్ సాహిత్యకారుల చరిత్ర జ్ఞాపకాలను మలిచిన ప్రయాణంగా చెప్తూ అక్కడ మ్యూజియంలో ఉన్న దక్షిణ భారతదేశపు వజ్రకరూర్ వజ్రాన్ని, తాజ్ మహల్ హోటల్ ని గుర్తు చేశారు పుస్తకం చాలా అందంగా వచ్చిందని మెచ్చుకున్నారు. సభ ఆద్యంతం రష్యాలోని అనుభవాలని రంగరించి అందరూ మాట్లాడితే రచయితగా కుమార్ కూనప రాజుగారు తన రచనలకు ప్రేరణ రష్యన్ సాహిత్యమే అని ఈ రష్యా ప్రయాణం మిత్రుల వల్ల అనుకోకుండా కలిగిన అనుభవం అని, కానీ అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన మనసులో వేసుకున్న సాహిత్య ముద్రలని వెలికి తీశానని, చిన్ననాటి ఇంటి దగ్గర ఒక పుస్తకాన్ని అందుకోవడంలో కుటుంబ సభ్యుల మధ్య పోటీని, చందమామ,బాలజ్యోతి వంటి కథల పుస్తకాలతో మొదలైన ప్రయాణం విశాలాంధ్ర వ్యాన్లు వెతికి చదివిన రచయితల్ని, రచనలు అన్నీ రష్యన్ సాహిత్య కారులదే అవడం, ఆ రచనలు చదువుతూ వారి సాహిత్యంలో ఉండే మానవ సంబంధాల పట్ల ఉండే నిబద్దత, చైతన్యం సాహిత్యకారుల దృక్పథాన్ని తెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రష్యా ప్రయాణం అమలుపరిచేలా చేసిందని. ప్రయాణ అనంతరం మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను అని చెప్పారు కుమార్ గారు.

రష్యన్ సాహిత్యం వీలైనంతవరకు అనువదించి పుస్తక రూపంలో అందరికీ అందుబాటులోకి తేవాలని ఆ మహా యజ్ఞంలో ఇప్పటివరకు 16 పుస్తకాలను అనువదించి ముద్రించినట్లు తెలిపారు.

అందులో ప్రముఖంగా -టాల్ స్టాయ్ రచనలు :

  • అన్నా కరీనా, యుద్ధము శాంతి, విషాద సంగీతం, ఆత్మ జ్యోతి, ఇవాన్ ఇలిచ్ మృతి, ఇద్దరి మిత్రులు, నవజీవనం, కోడిగుడ్డంత ధాన్యపు గింజ.
  • దోస్తాయేవ్ స్కీ:
    • పేద జనం, శ్వేతరాత్రులు, భార్య చాటు మనిషి, దోస్తాయేవ్ స్కీ కథలు, కర్మజోవ్ సోదరులు,ఇడియట్
  • చెకోవ్
    • చేకోవ్ కథలు 1&2,
  • మైఖేల్ షాలో ఖేన్
    – డాన్ నది
    మొదలైన పుస్తకాలని అనువదించి తెలుగులోకి తీసుకువచ్చానని ఇంకా తీసుకురావలసిన సాహిత్యం చాలా ఉందని అందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.

ఇందుకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అతిథులందరికీ పుస్తకాన్ని అలాగే ఆ పుస్తకాన్ని చదువుతూ ఆహ్లాదంగా తాగడానికి ఓ కాఫీ మగ్ ను బహుకరించారు. కుమార్ గారి చిన్ననాటి మిత్రులు వారి పుట్టినరోజుని పురస్కరించుకొని కుమార్ గారికి, వారి సతీమణి శారద గారికి చిరు సత్కారాన్ని అందించారు.

“రష్యా నుంచి ప్రేమతో” పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకున్న నాకు 450 సంవత్సరాల క్రితం నిర్మించిన తొమ్మిది చర్చిల సముదాయంతో ఉన్న మ్యూజియం యొక్క “సెయింట్ బాసిల్ కెతడ్రల్” చర్చ్ బొమ్మని పుస్తకానికి కవర్ పేజీగా వేశారు. ఈ కెతడ్రల్ చర్చి మాస్కోకు, రష్యాకు ప్రతీతిగా వాడుతూ ఉంటారని తెలిసింది.
● పుస్తకంలోపల ఒక్కొక్క పేజీ అద్భుతమైన ఫోటోలతోటి నిర్మించబడి ఉంది ఆ ఫోటోలో కింద ప్రతి ఒక్క విశేషాన్ని వర్ణిస్తూ,ఆ బొమ్మల్ని చూపించి మనల్ని ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఓ ఇమేజినరీ ఫీల్ ని మనకి అందించారు.
● కుమార్ గారు రష్యా పర్యటన చేసింది 2018లో మే మొదటి వారంలో అప్పటికి అక్కడ ‘రాత్రి తక్కువగాను, పగలు ఎక్కువగా’ ఉండే సమయాల్ని చూడడంలోని సంభ్రమణ భావాలని పలికించారు.
కమ్యూనిస్టు దేశాన్ని చూస్తున్నామన్న సంతోషాన్ని కళ్ళలో నింపుకొని పుస్తకాల్లో చదివిన ప్రాంతాలని గుర్తు చేసుకుంటూ ఒక్కో ప్రాంతాన్నీ వెతుకుతూ బయలుదేరారు.

వీరికి మొదట తారసపడింది “మాస్కో మెట్రో స్టేషన్” దీన్ని చూడగానే జ్ఞాపకాల్లో మెరిసిన ఆలోచన ఒకప్పుడు ఇది ప్రజలకు ప్రాణ రక్షణగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్షల మంది ప్రజలకి తలదాచుకునేందుకు ఉపయోగపడిందన్న ఎరుక. అంత చరిత్రను నింపుకున్న ఆ మెట్రో స్టేషన్ ని ఓ అద్భుతంగా చిత్రాల్లో బంధించి

చూపించారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 18 సంవత్సరాల యువతి జోయా. ఆమె విగ్రహాన్ని అపురూపంగా సందర్శించుకొని ఆశ్చర్యపోయిన సందర్భాన్ని, ప్రపంచ చరిత్రలో ఆమె జ్ఞాపకాలని నెమర వేసుకొని మానవాళి తరఫున ఆమెకు క్షమాపణలు చెప్పుకోవడం ఎంతో భావోద్వేగంతో చెప్తారు.
అక్కడ రైల్వే స్టేషన్లు, మిరుముట్లు గొలిపే సాండ్ లేయర్స్ మధ్య 18వ శతాబ్దపు ప్రముఖ కవి,కథకుడు, నాటక కర్త అయిన “పుష్కిన్” నిలువెత్తు విగ్రహాన్ని మ్యూజియాన్ని దర్శించి ఈ కవి శిల్పాన్ని చూసిన ఆనందాన్ని, పంచుకుంటారు.
125 సంవత్సరాల గమ్ స్టోర్ కివిస్కియా
మెట్రో స్టేషన్ని, కమ్యూనిస్టు దేశం లో ఎర్ర జెండా రెపరెపలని కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. మే 9, 2018న రెండవ ప్రపంచ యుద్ధ విజయోత్సవ సంబరాలు జరుగుతున్న వేళ జర్మన్ పార్లమెంటు ఎర్రజెండాని ఫోటోలో బంధించడం బావుంది.

ఇండియన్ కరెన్సీ రూపాయికి రష్యన్ కరెన్సీ రూబుల్స్ కి పెద్ద తేడా లేకపోవడంతో ఖర్చులు కలిసొచ్చాయి అంటారు. బోల్హవోయ్ థియేటర్ 200 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఆధునిక హంగులతో ఎప్పటికప్పుడు అలంకరించబడిన పనితనాన్ని చూసిన సంభ్రమం. అక్కడ

ప్రదర్శించబడుతున్న నృత్య రీతులను తీరిగ్గా చూడలేకపోయాను అన్న బాధ కనిపిస్తాయి.
కారల్ మార్క్స్ విగ్రహం, స్టేట్ హిస్టరీ మ్యూజియం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే సైనిక అధ్యక్షుడు జనరల్ ఘకొవ్ విగ్రహం, ఇలా అనేకమంది పూర్వికుల శిల్పాలను చరిత్రగా మలిచి అక్కడ ప్రదర్శింప చేయడం కళ్ళకు మనసుకు ఎంతో తృప్తినిచ్చింది అని తమ యాత్ర సఫలం అయిందని సంతోషిస్తారు కుమార్ గారు.
అనేక కథలు రాసిన టాల్ స్టాయ్ మ్యూజియాన్ని దర్శించిన తరువాత కుమార్ గారు ఒక మాట అంటారు. వాళ్లు లేకపోయినా వాళ్లు సంచరించిన ప్రదేశాల్లో,
వాళ్ళు తిరుగాడిన లోకంలో సంచరించాను అన్న తృప్తిని కుమార్ గారి వాక్యాల్లో మనం చూడొచ్చు.

ఈ పుస్తకం అంతా ఓ ఎమోషనల్ థాట్ ని అప్లై చేస్తుంది మనసుకి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పుని ఆ యుద్ధ కాలాల్లో పోరాడిన వీరోచిత గాధలని ఆ ప్రజల మధ్య జ్ఞాపకాలుగా చిత్రించుకొని శిల్పాలుగా మలుచుకొని అక్కడి ప్రజలు ఆరాధించడాన్ని ఎంతో గొప్ప విషయం అటువంటి చిత్రాలన్నింటినీ చూపించారు ఈ పుస్తకంలో. కెమిలిన్ స్క్వేర్ వద్ద, మరియు సెయింట్ బాసిల్ కేథడ్రల్ దగ్గర అక్కడి ప్రజలు వీధుల్లో నిలబడి కవిత్వం చదువుతూ ఉండడం, దాన్ని వింటూ ప్రజలు నిలబడి పోవడాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూశాను అని చెప్తారు కుమార్ గారు.

ఇండియన్ తాజ్ మహల్ హోటల్ ని అక్కడ చూడడం గొప్పగా అనిపించిందంటారు.

పుస్తకంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఉంది అదే “నొవోడ్ విచ్” ఇది ఒక స్మశానం. ఇక్కడ అనేక ప్రముఖ సాహితీవేత్తలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో త్యాగం చేసిన వారు వీరందరి సమాధులు అక్కడ నిర్మించబడి ఉన్నాయి అని ఆ సమాధుల దగ్గర వారి ప్రతిరూపాలను శిల్పాలుగా చెక్కి వారి గురించిన వివరాలు ప్రతి సమాధి పైన కనిపిస్తుందని, అక్కడ ఒక్కొక్క సమాధిని దర్శించుకుంటున్న సమయంలో పొందిన ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేని ఆవేదనని పొందానని తమ అనుభవాన్ని పంచుకుంటారు కుమార్ గారు. ఆ సమాధుల్లో నికోలం గోగోల్ సమాధి ఇతను ఓ ప్రసిద్ధ రచయిత ఓవర్ కోట్, ప్రేతాత్మ అనే కథలు నాటకాలు రాసిన వాడు, అంటోనీ చెకోవ్ వంటి వారి జ్ఞాపకాలని తడుముకొని చూస్తారు. మైఖోవ్ స్కీ ఇతను కవి, ఆర్టిస్టు. అతను రాసిన లెనిన్ కావ్యం విశ్వవిఖ్యాతి చెందింది అని భావోద్వేగంతో గుర్తు చేసుకుంటారు. మాస్కో స్టేట్ యూనివర్సిటీ చూడ్డానికి అద్భుతమైన ప్రపంచ ఖ్యాతి కలిగిన యూనివర్సిటీ., ఆ యూనివర్సిటీ ని తలుచుకొని అందులో చదివిన రచయితలని రాజకీయ నాయకులని గుర్తు చేసుకుంటూ… యూనివర్సిటీ చిత్రాన్ని మనకు అందించారు. అక్కడి స్టాలిన్ శిల్పాన్ని చూసినప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని నిలువరించిన స్టాలిన్ గురించి చెప్తారు. అలాగే “జార్ డైమండ్ ఫండ్ మ్యూజియం”లో దక్షిణ భారతదేశపు పెద్ద వజ్రం జార్ ప్రభు రాజదండంలో ఉందని గైడ్ ద్వారా తెలుసుకొని బాధపడిన సందర్భాన్ని

ఫోటోలలో బంధించి మరి చూపిస్తారు.
మంచి ఫోటో గ్రాఫర్ దొరికారానిపించింది. వీరి పుస్తకంలోని ఫొటోస్ చూస్తుంటే.

19వ శతాబ్దపు రష్యన్ సామాజిక నైతిక సంఘర్షణల నేపథ్యం మానవ సంబంధాలు మనస్తత్వాల విశ్లేషణతో కూడిన రచనలు చేసిన దోస్తోయేవ్ స్కీ చరిత్రను గుర్తు చేసుకుంటారు అక్కడి మాస్కో పబ్లిక్ లైబ్రరీ ముందు ప్రతిష్టించిన అతని శిల్పాన్ని చూసిన తరుణంలో. అతని జీవితంలో జరిగిన జైలు జీవితాన్ని సంఘటనలను గుర్తు చేసుకోవడం మనసుని కలచి వేస్తుంది. అంతేకాక సిగ్మాండ్ ఫ్రాయిడ్ తన మనస్తత్వశాస్త్రంలో రూపొందించడానికి దోస్తోయోవ్ స్కీ రచనలు ఉపయోగపడ్డాయని పేర్కొనడాన్ని గుర్తు చేస్తారు.

సినీ దర్శకుడు ఐజిన్ స్టీన్, రష్యన్ పెయింటర్ ఇల్యా రిపీన్, ఇలా జ్ఞాపకాలని చూసిన సంతోషమే కాదు లెనిన్ ముసోలియంలోని ఆయన పార్దివ దేహాన్ని సమయాభావం వలన చూడలేకపోయిన సందర్భాన్ని కూడా మనతో పంచుకుంటారు. లెనిన్ నివసించిన ఇంటిని పనిచేసుకునే ఆఫీసుని ఆ గదిలోకి వెళ్లడాన్ని ఎంతగానో ఆస్వాదించి అతని పార్థివదేహాన్ని చూడలేకపోయినతనానికి చింతిస్తారు.

ఇలా ఈ పుస్తకం నిండా రష్యన్ సాహిత్యకారుల జ్ఞాపకాలతోటి సాహిత్య ప్రయాణాలతోటి అలనాటి మనుషుల వ్యదలని, రెండవ ప్రపంచ యుద్ధము నాటి బీభత్సపు మారణకాండ లో నేలకొరిగిన ఎందరో త్యాగమూర్తుల గుర్తులను నేటి రష్యా తో పోలుస్తూ సాహిత్య ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ లిస్టులో చేర్చుకోవలసిన ప్రయాణంగా రష్యా నుంచి ప్రేమతో మనకు అందించారు కుమార్ కూనప రాజుగారు.

Spread the love

రూపరుక్మిణి. కె.

తెలుగు మరియు ఎకనామిక్స్ లల్లో మాస్టర్స్ చేశారు. సొంత ఊరు ఖమ్మం.,ప్రస్తుత నివాసం హైదరాబాద్.
మొదటి కవితా సంపుటి "అనీడ" 2021 లో, "మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని" రెండవ కవితా సంపుటి 2024 లో వచ్చాయి. కవిసంగమం వేదిక గా సాహిత్యం లోకి అడుగిడి అదే వేదికగా ట్రావెల్ బ్లాగ్ , "ఆమె స్వగతం" పేరున చిన్ని కథల్ని రాశారు. ప్రస్తుతం నెచ్చెలి, ఉదయిని పత్రికల్లో కాలమ్స్ రాస్తున్నారు. సమూహా రైటర్స్ ఫోరమ్ లో సభ్యురాలు. వృత్తి రీత్యా ఉపాధ్యాయని.

1 వ్యాక్య

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!