ఇచ్ఛామతి

దర్శనం

‘రెబెకా ఆ అమ్మాయి వేసుకున్న టీ షర్ట్ చూడూ, మనమెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేం కదా.  అంబేద్కర్ ను కూడా టీ షర్ట్ల మీద అచ్చేసుకుంటున్నారా యిప్పుడు . ఇట్స్ స్ప్లెండిడ్ టు సీ..!’ 

‘ అవునే, ఓహ్ గ్రేట్! అమేజింగ్ ఉషా!ఇంతవరకూ యిలా చూడ్లా..’

‘ రెబెకా నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా నీ సోషియాలజకల్ థీయరీ సాంస్కృటైజేషన్ , వెస్ట్రనైజేషన్ అని. టీ షర్ట్  కల్చరేమో వెస్ట్రనైజేషన్. దాని మీద కాన్సెప్ట్ యేమో దళితైజేషన్. బాగుంది కదా.’

‘తల్లీ, ఆ కాన్సెప్ట్ నేను కాయిన్ చేసింది కాదు. ఫేమస్ సోషియాలజిస్ట్ ఎం.ఎన్.శ్రీనివాస్ చేసాడు. ఇక నువ్వు చెప్పిన దళితైజేషన్ యీ దేశంలో ఎప్పటికి జరుగుతుందో తెలియదు. ఆ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి దళిత్ అయి వుంటుంది. ఒక దళిత్ తన ఆరాధ్యుడ్ని అనుసరించడం దళితైజేషన్ అవదు. దళితులు కాని అప్పర్ కాస్ట్ విరివిగా ఆచరిస్తే అప్పుడు దాన్ని దళితైజేషన్ అనొచ్చేమో. ఇదైతే కేవలం ఆత్మగౌరవ ప్రదర్శనే..’

‘బ్యాంకు ఆఫీసర్ వైనా, నీకు సోషియాలజీ చాలా యిష్టం కదవే..’

‘ఆ..ఎం.ఏ సోషియాలజీ ఒక సంవత్సరం వెలగబెట్టినందుకు, యేదో కొంచెం తెలుసు అంతే…’

న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ లో  చెకిన్ లైన్లో నిల్చుని  వున్నశ్రీరాం కు యీ సంభాషణ వినిపిస్తోంది.

‘సోషియాలజీ,’ ‘రెబెకా’ అనే రెండు పదాలు ఎప్పటివో జ్ఞాపకాల్ని నిద్రలేపాయి. ఆమె ముఖం కన్పించడం లేదు గానీ, పాతిక సంవత్సరాల కిందట అంబేద్కర్ గురించి మాట్లాడిన రెబెకా మేరీ, యిప్పుడు వరుసలో ముందు అధునాతనంగా, అందంగా నిల్చున్న ఈమెనేనా!!. ఎలా వుండేదా రెబెకా?!.  ఊహించడానికి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది శ్రీరాం కు.

లీలగా ముప్పై య్యేళ్ల క్రితపు రెబెకా ను గుర్తు చేసుకుంటున్నాడు… మరీ అంత పొడుగు కాని చామన ఛాయ. నల్లని చురుకైన కళ్లూ, చురుకైన కదలికలూ అంతే గుర్తు. యాభై ఏళ్లు దాటిన, హుందాగా వున్న యీమెను, ఆమెతో సరిపోల్చుకోవడానికి కన్పిస్తున్న ఒకే ఒక ఆధారం , సోషియాలజీతో పాటు , ఆమె మాట్లాడుతున్న అంబేద్కర్ అనే మాట!

2

ఎప్పటిదో ఒక పన్నెండేళ్ల పసిబతుకు హాస్టల్ కొట్టంలోకి విసిరేసుకున్నప్పుడు, నెత్తిమీద ట్రంకుపెట్టి, చేతిలో సంచితో  బరువు మోస్తున్న వాడికి ఎదురొచ్చి బాధ్యతగా సాయం పట్టిన కొందరు అన్నల నల్లని శరీరాలు తెలతెల్లగా తోమిన సిల్వర్ పళ్లాల వంటి  వాళ్ల మనసులు యిప్పటికీ గుర్తే శ్రీరాం కు!

వాళ్లూ వాళ్లలాంటి వాళ్ల సాంగత్యం కలిపేసుకుంది మరో నాలుగేళ్ళు.  నాలుగు నిట్రాతుల పొడుగాడి గుడిసెలో హాస్టల్  బతుకు గడిచేది. ఒక నిట్రాతికి  ఒక ఫోటో వేలాడుతుండేది. నీలిరంగు కోటేసుకున్న, ఎదమీద పుస్తకం పట్టుకున్న ఫోటోలో వున్నింది ఎవరో మరి యే అన్నా చెప్పలేదు . శ్రీరామలూ అడగలేదు. 

ప్రతిపొద్దూ రంగు మాత్రమే మారే అన్నం ముందు  ‘సహనాం భవతు సహనౌ భునక్తు’ గా వినిపించేవి ప్రార్థనలు. ప్రతి రాత్రీ నల్లులకూ దోమలకూ ఎరగా మారే శరీరాన్ని’ నడిపించు నా నావా నడిసంద్రమున దేవా’ అనేవి స్తోత్రములు. హాస్టల్  వార్డన్  పరిచయం చేసిన బైబిల్ క్విజ్ వల్ల ,మెద్రాసు నుంచి పోస్టులో వచ్చి పుస్తకాల్లో చేరేవి కొత్తపాత నిబంధనల గ్రంధాలు. అప్పుడప్పుడూ పక్కవాళ్లతో కలసి వాటిని చదువుకున్న వాక్యాలు ‘హల్లెలూయ’  అనేవి. ‘ఆమెన్ ‘ అనేవి.

ఏ అపరాత్రో  దైవగ్రంధం తలచాటు సాక్షిగా పీడకలలు నిద్రలేపితే , కప్పిన ముసుగు తీస్తే , చూరుకు వేలాడుతున్న మసక వెలుతురులో  ఎదురుగా నిట్రాతికి వూగుతున్న నీలంకోటు మనిషి  ‘భయపడొద్దు నేనున్నా’ అన్నట్లుండేవాడు.  అప్పుడు కూడా ఎవరితడని తెలుసుకోవాలనిపించలేదు. క్లాసులు మారీ , కొట్టం నుంచి’ పై క్లాసు’వాళ్లుండే బిల్డింగ్ లోకి మారినప్పుడు కూడా ఆ గోడలకు ఎవరీకీ పట్టనట్టు వేలాడుతున్న నీలం కోటు మనిషెవరని,   నిలువెత్తుగా  కనబడుతున్నా తెలుసుకునే ప్రయత్నమేం చేయలేదు. పదోతరగతి లోపు సోషల్ స్టడీస్ పుస్తకాలు చదివి ఎంత మంచి మార్కులు  తెచ్చుకున్నా, 

రాజ్యాంగం రాసినాయన ఫలానా అని గుర్తించిందీ లేదు.  రాముడూ కృష్ణుడూ తెలుస్తారు.  చదివిన చందమామ కథల ఆధారంగా మాయలూ మంత్రాలూ దేవతలూ దయ్యాలూ గురించి తెలుస్తుంది. 

 బుధ్ధుడూ అశోకుడూ గాంధీ నెహ్రూల దాకా తెలుస్తారు గానీ నీలంకోటు మనిషి గురించి అంత సహజంగా తెలియలేదు. ప్రత్యేకించి చెప్పినవాళ్లూ లేరు! 

 ‘హాస్టల్లో నానాకంవాళ్లతో వున్యాడు వీడు, వీణికి దోషం పోయేట్లా ఒకసారి తిరుపతికి పోదామప్పా’ శ్రీరాం వాళ్ల అవ్వ అంటే, ‘తిరుపతి కి పొదామంటే పోదాంగానీ, హాస్టల్లో వున్నందుకు దోషమని కాదు. అట్లా హాస్టల్లో వుండి సందువుకుంటేనే నలుగురుతో ఎట్లుండాలో తెలుస్తుంది. నోట్లో నాలుక లేనోడీడు నాలుగు మాటలు మాట్లాడేదన్నా వస్తుంది.మనంమాత్రం శూద్రులంకామా . ముసల్దానివి నువ్వూ నీ చాదస్తమూ.  ఇబ్బుడు తిరుపతి పోతావు ఎన్ని కులాలొల్లతోనో కలిసి దర్శనం చేసుకుంటావు గదా అబ్బుడు దోషం రాదా.’ అని భలే సమాధానం చెప్పాడు వాళ్ల నాయనా.

ఆయనకేమీ కుల పట్టింపులు లేవని కాదు గానీ , టీచర్ గా వుంటూ చిన్న పాటి వైద్యం కూడా తెలుసినోడు కాబట్టి, వైద్యం కోసం అంటూముట్టూ పక్కన పెట్టినోడే. బుధ్ధుడి గురించి, గాంధీ గురించి చెప్పిన అతను , ఆ నీలం కోటు మనిషి గురించి మాత్రం యేనాడూ కొడుక్కి చెప్పలేదు. ఇదంతా ఎనబైయైదుల ముందు కథ. 

ఇంటర్లో, డిగ్రీ రోజుల్లో  శ్రీశ్రీ ని చదివినా , స్టూడెంట్ ఫెడరేషన్లు పరిచయమైనా అదంతా పెద్ద ప్రభావం వేయలేదు గానీ శ్రీరాం కు, సాహిత్యం బాగా వంటబట్టింది. చదివిన కథల్లో గానీ నవలల్లో గానీ నీలం కోటు మనిషి ప్రసక్తే  ఎక్కడా వచ్చినట్లు గుర్తులేదు. 

మరి ఎప్పుడు తెలిసాడు అనుకుంటూనే రెబికా మేరీ గుర్తొస్తుంది. నీలంకోటు మనిషిని  సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని శ్రీరాం కు రెబికా కల్పించింది. 

***

కొన్ని యాదృచ్ఛికతలు చాలా చిత్రంగా వుంటాయి. వాటి దర్శనంలో మార్మిక సంకేతాలుంటాయి. కొందరు వ్యక్తులు అలా కన్పించిన క్షణం అపురూపంగా గుర్తుండిపోతుంది.

అలా యూనివర్సిటీ లోకి అడుగు పెట్టిన శ్రీరాం కు మొదటి క్షణాల్లోనే కన్పించిన యిద్దరు ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత జీవితం లో గుర్తుండిపోతారని అప్పుడు వూహించలేదు. 

 యూనివర్సిటీ గేటు ముందు ధీమాగా నడచిపోతూ, సహజమైన ఆసక్తితో ( బస్సు దిగి వస్తున్న శ్రీరాం వైపు) ఒక దీర్ఘమైన చూపు చూసిందొక అమ్మాయి . ఆ క్షణంలో చాలా గమ్మత్తుగా అనిపించింది. ఆమె అలా కనుమరుగవుతుంటే, చేతిలో బ్యాగు  చనువుగా అందుకుంటూ, ఒక అన్న  ఎదురుగా.

 ‘ ఏ డిపార్ట్మెంట్ తమ్ముడూ’ అంటున్నాడు. 

‘నేను సుబ్బారెడ్డి ని స్టూడెంట్ ఫెడరేషన్.’  అని పరిచయం చేసుకున్నాడు.అక్కున చేర్చుకున్నాడు. డిపార్ట్మెంట్ లో అడ్మిషన్ తర్వాత హాస్టల్ రూంలో కూడా తనే చేర్పించాడు.

మర్నాడు ఉదయం క్లాసు రూం కు వెళ్తుంటే, ఎదురు రూం ముందు నిన్న కన్పించిన అమ్మాయి,  పోజుగా చూస్తోంది. ‘సో రోజూ కన్పిస్తుందన్నమాట’, అనుకున్నాడు. ఆ తర్వాత పక్కనున్న అమ్మాయి పిలుస్తుంటే తెలిసింది.  ఆమె  రెబెకా అని.

రెబెకా  యూనివర్సిటీ లో ఎంఏ సోషియాలజీ చదువుతుండేది. ఎంఏ హిస్టరీ క్లాస్ రూములు  పక్కనే వాళ్లవీ వుండేవి. ఎక్కువగా లైబ్రరీ లో కన్పించేది . ఆమెలో ఉపన్యాస కళ అధ్భుతంగా వుండేది. చర్చిలో ప్రసంగీకుల్ని వినీ వినీ మెలుకువలన్నీ పట్టేసిందేమో వక్తృత్వ పోటీల్లో అదరగొట్టేది. అదేమోగానీ వాళ్లిద్దరూ చాలా సార్లు ఒకే దగ్గర వుండేవాళ్లు. మాట్లాడుకునేదేం వుండదు. మొత్తానికి చూసుకునేవాళ్లు. లోపల లోపలే, ‘వచ్చావా , రాకుండా వుంటావా , నాకు కనబడకుండా ఎట్లుంటావులే’ అన్నట్లు కళ్లు పలకరించుకునేవి. అంతకుమించి ముందుకు వెళ్లేదుండదు. కలిగిన వుద్దేశ్యాలు  యేవీ పైకి వ్యక్తమయ్యేవి కావు. దాచలేని ఒక అప్రిసియేషన్ మాత్రం కన్నులు నిండి పొంగిపొర్లుతూ వుండేది.

ఒక వక్తృత్వ పోటీలో ‘ జాతీయోద్యమం – గాంధీ ‘ అనే టాపిక్ నడిచింది.  పార్టిసిపేట్ చేసిన వాళ్లంతా జాతీయోద్యమం అంటే గాంధీ, గాంధీ అంటే జాతీయోద్యమం అన్నట్టుగా ఆయనే సర్వస్వం అని స్పీచులు దంచారు. రెబెకా, మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి అడ్డంగా మాట్లాడింది. గాంధీ ఒకానొక నాయకుడు మాత్రమే అన్నట్లు మాట్లాడింది. ఆయన వల్ల నిజమైన పేద ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పింది. అసలు హరిజనులు అనే పదమే తప్పు అంటుంది. అంబేద్కర్నుభారత రాజకీయాల్లో ఎదగకుండా చేసాడనీ యివన్నిటికీ చారిత్రక ఆధారాలు వున్నాయని చెప్పింది. దాంతో పెద్ద గలాటా అయ్యింది. ఎంత ధైర్యం నీకు, గాంధీ నే అంటావా అని వక్తృత్వ పోటీ నిర్వహకులూ , చివరకు జడ్జిలుగా వచ్చిన అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా విరుచుకుపడ్డారు. 

రెబెకా యేం బెదరి పోకుండా, అందరికంటే ఎక్కువ నోరు చేసుకుని గట్టిగా బదులిచ్చింది. అసలు మీరు గాంధీ గురించి చదవనే లేదని బల్లగుద్ది ( నిజంగా బల్ల గుద్ది) చెప్పింది .

శ్రీరాం ఆశ్చర్యపోతూ విన్నాడు రెబెకా మాటలు . ఏం ధైర్యం. ఏమి ధైర్యం!!. ప్రొఫెసర్ ను కూడా ‘ మీరు చదవలేదు సార్, యిప్పుడు లైబ్రరీ కి పోదాం రండీ మీకు చూపిస్తా. మీరు గొప్ప చరిత్ర కారులుగా పరిగణించే వాళ్ల పుస్తకాల్లోనే యివన్నీ వున్నాయి.’ అంటూ తన మాటల్ని వెనక్కి తీసుకోకుండా నిలబడింది. ఇట్లైతే పోటీ నుంచి  తొలిగిస్తాం అన్నారు. 

‘ఈ ప్రైజ్ కోసం కాదు సార్ , నా వాదనా వినరా సార్, మీ భ్రమల్లో మీరుంటారా ‘ అని చెరచెరా వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయాక, 

‘ఈ ఎస్సీ దానికి బాగా బలిసింది. దీన్ని వూరికే వదలగూడదని ‘ అక్కడున్న వాళ్లందరూ అనుకున్నారు . ఆ ప్రొఫెసర్లైతే ‘మేం చూసుకుంటాం యీ పిల్లని, వదిలేయండ’న్నారు. నిజంగా శ్రీరాంకు దిమ్మ దిరిగి పోయింది. మొదటి సంవత్సరం ఆఖరులో వున్నారు. ఇంకా ఒక సంవత్సరం యిక్కడ గడపాలి . ఇంత మంది బలమైన శత్రువుల మధ్య రెబెకా పరిస్థితి యేమిటి అని భయం కూడా వేసింది . ఫైయిల్ చేయించొచ్చు. లేదా భౌతికంగా దాడి చేయించొచ్చు. అందులో ఒక ప్రొఫెసర్ రెడ్డి.  రెబెకా వాళ్ల డిపార్ట్మెంట్ హెడ్ మాత్రం క్రిస్టయన్. ఆయనెలా కాపాడగలడు యీ అమ్మాయిని అని చాలా దిగులు పడ్డాడు.

మరుసటిరోజు మామూలుగానే లైబ్రరీ లో కన్పించింది.

ఎదురెదురుగా, టేబుల్ కు అటూయిటూ వున్నారు. నవ్వింది. తనూ  నవ్వాలనుకున్నాడు గానీ, నవ్వాడో లేదో. ఆ  ముఖంలో ఆ భావన పలికిందో లేదో తెలియదు. మామూలుగా ఆడపిల్లల కళ్లలోకి చూసి మాట్లాడటం రాదు తనకు.  ఏమనుకుందో, అమ్మాయి పైకి లేచి పుస్తకాల ర్యాక్ లోకి వెళ్లి  అబ్బాయి వైపు చూసింది. రమ్మన్నట్టు పిలిచింది. లేదు అలా అనుకొని ఈ అబ్బాయి ఆ ర్యాకుల్లోకి వెళ్లాడో మరి.!

‘నిన్న మీరున్నారు కదా అక్కడ, నేను బాయ్ కాట్ చేసి వెళ్లాక యేం జరిగింది ‘ అని మెల్లగా అడిగింది. బాయ్కాట్ అన్నందుకు  నవ్వొచ్చింది శ్రీరాం కు. అతను యేదో  చెప్పబోయేంతలో..

‘ ఇక్కడొద్దు. క్యాంటీన్ కు వెళ్దామా ‘ అంది. 

సరే నని యిద్దరూ మాట్లాడుకుంటూ క్యాంటీన్ వైపు నడిచారు. వెళ్లేలోపు, తన ఆందోళన అంతా చెప్పేసాడు. అంతా విని.

‘వాళ్ల తలకాయ్. వాళ్లు నన్నేమీ చేయలేరు’ ధీమాగా అంది.

‘ అదేందమ్మా తల్లీ అట్లా అంటావ్. యింకా ఒక సంవత్సరం యిక్కడ వుండాలి కదా.. జాగ్రత్త వహించాలి’ అన్నాడు. 

‘ఎన్ని జాగ్రత్తలైనా మీ అప్పర్ కాస్ట్ వాళ్లకే నండీ. మా దళితులకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మా బతుకులు రోజూ ఛాలెంజింగేనండీ..’ అంది.

‘నేనేమీ అప్పర్ కాస్ట్ కాదు’ నిష్టూరంగా అన్నాడు.

‘కాకపోతే ఏముందబ్బా. మీరేమీ ఔట్ కాస్ట్ కాదుగదా ‘

ఆ క్షణంలో అతనికి ‘ఔట్ కాస్ట్’ అనే పదానికి అర్థం తెలీదు.

‘మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. అవన్నీ ఎక్కడ తెలుసుకున్నారు. మీకెవరు చెప్తారు. అసలు నిన్నంతా అంబేద్కర్, అంబేద్కర్ అంటూ చాలా సేపు మాట్లాడితివి కదా. నీకాయన ఎలా తెలుసు . అసలు గాంధీ తో ఆయన్నెందుకు కలిపి చూడాలి.’ అమాయకంగా అడిగాడు.

‘ మీ క్లాసులో మీరు చాలా బ్రైట్ స్టూడెంట్ అని మీ క్లాసమ్మాయిలూ అంటుంటారు. మీకేమో అంబేద్కర్ అంటేనే తెలీదే.. మీరు కూడా ఆయన్ను చదువుకోలేదా… అదేనండీ మా దురదృష్టం. దళితుల గురించి ఎవరికీ యేమీ తెలీదు. మీరు హైస్కూల్ ఎక్కడ చదువుకున్నారు?’ అనడిగింది.

 తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలీలేదు. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒకమ్మాయితో  యిన్ని మాటలు పడుతున్నానే అని అతడి స్పిరిట్ జారిపోయింది.

‘మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వుండి చదువుకున్నారు కదా…’ అనుమానంగానే అడిగింది.

‘ అవును ‘ అన్నాడు. 

‘ మీ స్నేహితుడి పేరు ఒకటి చెప్పండి, యిప్పటి స్నేహితుడు కాదు. మీ హైస్కూల్ స్నేహితుడు ‘ అన్నది.

ఏందీ అమ్మాయి. బయటికి పిలుచుకొనొచ్చి సావ గొడుతా వుందే. ఈమె కు ఏ సాక్ష్యాలు చూపించాలి.  బైబిలు చదివాననీ , ఎస్సీలతోనే తిని పెరగాడనీ. పెద్దన్న అయితేనేమీ , శాంసన్ అయితేనేమీ, పింజరి హుస్సేన్ అయితేనేమీ తనకు ప్రాణమిత్రులనీ ఎలా చెప్పాలి , అనీ మథనపడ్డాడు.

‘ శాంసన్ ‘ అన్నాడు.

‘ ఓహొ నేను రెబెకా కాబట్టి, ఒక క్రిస్టియన్ నేమ్ చెప్పావు కదా. తెలివైన వాడివబ్బా..’ అని చావుదెబ్బ కొట్టింది.

‘తల్లీ నమస్తే నీకు…  క్యాంటీన్ వొద్దు. నీతో మాటలూ వొద్దు. నేను లైబ్రరీ కే పోతా.’ అని వెనక్కి వచ్చేసాడు.’ ఈ అమ్మాయి చాలా మెంటల్’, అనుకున్నాడు.

ఆ సాయంకాలం చదివాడు అంబేద్కర్ ను. లైబ్రరీ రాక్ ల్లో నుంచి స్వాతంత్రోద్యమం సంబంధించిన పుస్తకాలన్నీ రెండు రోజులు వరసగా చదివాడు. రెబెకా చెప్పింది అక్షరాలా నిజమే కదా అనిపించింది . ఎవరైనా వూరకే తెలియడం వేరూ పునాదులతో పాటు తెలియడం వేరూ. గాంధీ ఎంత కుట్ర చేసాడు . పూనా ప్యాక్ట్ పేరుతో, బ్రిటిష్ ప్రభుత్వం యిస్తామన్న కమ్యూనల్ అవార్డు అడ్డుకున్నాడు. దళితులకు కమ్యూనల్ ఓటు హక్కును లేకుండా చేసాడు. ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష పేరుతో అంబేద్కర్ ను నిస్సహాయున్ని చేసాడు. దళితులకు రెండు ఓటు హక్కులు వుండుంటే వాళ్ల పరిస్థితి యిప్పటి కంటే మెరుగ్గా వుండేది కదా. చరిత్ర లో దళితులకు అందిన అవకాశం, నోటి ముందు కూడు మట్టిపాలై పోయినట్లైంది కదా, అనిపించింది శ్రీరాంకు . 

అట్లా రెబెకా లాంటి బ్రిలియంట్ వల్ల అంబేద్కర్ తెలిసొచ్చాడు. ఆ తర్వాత రెబెకా యూనివర్సిటీలో ఎక్కువ రోజులు వుండలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే, అప్పుడెప్పుడో రాసిన బ్యాంకు పరీక్షలో పాసై, క్లర్క్ వుద్యోగం తెచ్చుకుని వెళ్లిపోయిందని వాళ్ల క్లాస్ అమ్మాయిల మాటల్లో తెలిసింది అతనికి. మళ్లీ రెబెకాను చూసింది లేదు.. అయితే  అంబేద్కర్ ను గుర్తు చేసుకున్నప్పుడల్లా అంతరాంతరాలలో అమూర్తంగా కదిలే చెప్పలేని అభిమానం  తన మీదేనా అంటే, అవుననే చెప్పొచ్చు.

***

ఫ్లైట్ లో వీళ్ల పక్కివరుసలో ఒక లైన్ ముందు వాళ్లిద్దరూ కూర్చున్నారు. రెబెకా, శ్రీరాం పక్కనున్న టీషర్ట్ అమ్మాయిని పదే పదే చూస్తున్నది. కళ్లలో సంబరం కన్పిస్తున్నది. ‘నా పక్కనున్న అమ్మాయి నువ్వు వూహించినట్లు దళిత్ కాదు రెబెకా’ అని గట్టిగా చెప్పాలనుంది అతనికి. ఆ సంబరం అతని కళ్లలో పొంగి ప్రవహిస్తోంది.  ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. మెల్లగా అందరూ లగేజీ తీసుకోవడానికి నిల్చున్నారు. వాళ్లిద్దరూ  లగేజీ మిషతో టీషర్ట్ అమ్మాయి పక్కనే నిల్చున్నారు. ఇక శ్రీరాం ధైర్యం చేసి , 

‘ మీరు యస్కే యూనివర్సిటీ ఎంఏ సోషియాలజీ డిస్కంటిన్యూ కదా..’ అనడిగాడు. 

‘ యస్, యస్ సో వాట్!’ అంది. కళ్లలో ఆత్మగౌరవం పొంగి పొర్లుతోంది.

‘నథింగ్ స్పెషల్ మై డియర్ అంబేద్కరైట్. చాలా సేపట్నుంచీ యీ టీషర్ట్ అమ్మాయిని చూస్తున్నారు కదా.

దిస్ ఈజ్ మై డాటర్ శృతి.’ అన్నాడు.  

 ‘నేను మీకెలా తెలుసు..’ అంటూనే, శృతికి షేక్ హ్యాండ్ యిచ్చింది.   

 టీషర్ట్ అమ్మాయి, బిత్తర చూపులు చూస్తూ, ఎవరు నాన్నా యీ ఆంటీ, అని కళ్లతోనే అడిగుతోంది. 

‘అదొక పెద్ద కథ శృతీ. నువ్వు పుట్టకముందే నడిచింది. ఈ కథకు కేంద్రం అంబేద్కర్.’   

అంటూంటే రెబెకా కు అంతా అర్థమైపోయింది.

                                                    ***

Spread the love

జి. వెంకటకృష్ణ

జి.వెంకటకృష్ణ, కవీ కథకుడు. గత రెండు దశాబ్దాలుగా రాయలసీమ నుంచి స్థిరంగా సాహిత్య అనుభవాన్ని పాఠకులకు పంచుతున్న సాహిత్య స్వరం.
లోగొంతుక (2000),దున్నేకొద్దీ దుఃఖం (2005), కొన్ని రంగులూ ఒక పద్యం (2010), చినుకు దీవి (2016),కంచె దాటే పాట లాంటి (2022)
కవిత్వసంపుటాలూ వెలువరించారు.
గరుడ స్తంభం ( 2005), చిలుకలు వాలిన చెట్టు ( 2010), దేవరగట్టు (2017) లాంటి కథా సంపుటాలనూ వెలువరించారు.
ఏ బేషజాలూ లేని నిరలంకార శైలిలో వర్తమాన( రాయలసీమ లోనైనా , సాధారణ తెలుగు సమాజంలో నైనా) సామాజిక గడ్డు స్థితిని మరీ ముఖ్యంగా వెర్రితలలేస్తున్న ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా కథా కవిత్వ సృజన తో నిలబడ్డ సాహిత్య కారుడితను.

1 వ్యాక్య

Leave a Reply to Kallakuri Sailaja స్పందనను రద్దుచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!