ఇచ్ఛామతి

మసకేసిన చందురుడు

నవోయ షిగా(1883-1971) చేపట్టిన కథా ప్రక్రియ పేరు “Shi- shosetsu”( I novel.)
ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యూరోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు “షి షోసెట్సు” ను.
ఈ జాపనీయ సాహితీ సంప్రదాయలో గొప్ప రచనలు చేసిన వాళ్ళల్లో నవోయ షిగా ను ఎక్కువ విశేషంగా చెప్పుకుంటారు. వందపై చిలుకు చిన్న కథలు, మూడు నవలిక లు, ఒక పెద్ద నవల, చాలానే వ్యాసాలు వ్రాసిన ఈయన్ను “కథల దేవుడ”ని, Shi shosetsu ప్రక్రియను ప్రతిభావంతంగా వాడుకున్న వాడని, ‘‘A Dark Night’s Passing‘’ అనే ఈయన నవలను ”Divine novel”అనీ అంటారు జపాన్ లో. ఆయన వ్రాసిన కథే ఈ ‘A Grey Moon’.
తెలుగు లో మసకేసిన చందురుడు అన్నాను.

టోక్యో స్టేషన్ లో పైకప్పు లేని ఒక ప్లాట్ ఫార్మ్ మీద నేను నిల్చోనున్న ఆవేళప్పుడు, గాలి కదలటం లేదు కానీ, చలిగా ఉంది. నా ఒంటినున్న తేలికపాటి ఓవర్ కోటు తగుమాత్రమైన వెచ్చదనమే ఇస్తున్నది.  నా ఫ్రెండ్స్ యిద్దరూ, ముందొచ్చిన యెనో వెళ్ళే  ట్రెయిన్ ఎక్కి వెళ్ళిపోవడంతో నేనొక్కణ్ణే  షినగవ ట్రెయిన్ కోసం ఎదురుచూస్తున్నాను.

పల్చటి మేఘాల ఆకాశం నుంచి, పొగబారినట్టున్న చంద్రుడు అగ్నిప్రమాదం వాత పడ్డ నిహోభాషీ శిథిలాల మీద మసకగా వెలుగుతున్నాడు. దశమి చంద్రుడనుకుంటా కొంచం కిందకి ఉన్నాడు, చేరువగా ఉన్నట్టు కనిపిస్తున్నాడదేంటో.
ఇంకా ఎనిమిదిన్నరే, అయినా అక్కడ పెద్దగా జనం లేరు. ఖాళీగా ఉండటంతో ఆ వెడల్పైన ప్లాట్ ఫార్మ్ ఇంకా వెడల్పుగా ఉంది.
దూరంనుంచి  రైలు హెడ్ లైట్స్ కనిపించాయి. కొంచెం సేపటికి  వేగంగా స్టేషన్ లోకి తోసుకొచ్చిందది. పెద్దగా జనం లేరు,  అటువైపు తలుపు పక్క వరసలో ఓ సీటు దొరికింది.  పనికి పోతూ వేసుకునే వదులు వదులు పాంట్ లో ఒక యాభై యేళ్ళ ఆడమనిషి నా కుడివైపు. నా ఎడం పక్క, ఫ్యాక్టరీ లో పని చేసే వాడిలా కనిపిస్తున్న పదహారు, పదిహేడేళ్ళ  కుర్రవాడు. వాడు నావైపు వీపు పెట్టి కూచోనున్నాడు. తలుపున్న వైపుకు తిరిగి, చేతులు పెట్టుకునే కొయ్యమీదకు కాళ్ళు చాపుకున్నాడు. నేను రైలు ఎక్కుతున్నప్పుడు వాణ్ణి చూశాను, వాడికి కళ్ళు మూతలు పడి ఉన్నాయి, కింది దవడ వేలాడుతూ నోరు తెరుచుకోనుంది,  నడుం నుంచి శరీరం పైభాగం అటూ, ఇటూ ఊగుతున్నది. ముందుకు వంగుతూ, మళ్ళీ  సర్దుకుని కూచుంటూ…ఆ ఊగడం చూట్టం కొంచం ఇబ్బందిగానే ఉంది.
ఆ పిల్లవాడిని అంటకూడదన్నట్టు కూర్చున్నట్టుగా కనిపించకుండా ఉండగలిగేంత ఎడం మాత్రం వాడికి నాకు మధ్య ఉంచి కూచున్నాను నేను.
యరకూచో, షిమబాషీ స్టేషన్ల దగ్గర రైలు నిండటం మొదలైంది. చాలా మంది ప్రయాణీకులు పొట్టకూటికోసం కూలిపన్లకు వెళ్ళి వస్తున్నవాళ్ళే. గుండ్రంగా, మిసమిస లాడే మొహంతో  ఉన్న ఓ పాతికేళ్ళతను వీపు మీంచి తన సంచీ దించి నాకూ, ఆ పిల్లాడికి మధ్య పెట్టి దాన్ని తన రెండు కాళ్ళ మధ్య ఉండేట్టు చూసుకుని వాటంగా నిల్చున్నాడు.
ఇతని వెనక నిల్చున్న ఓ నడివయసు మనిషి  జనాల తోపుడికి ముందుకు తూలాడు. తన ముందున్న  ఈతని వైపు వైపు చూస్తూ “ఇది ఇక్కడ పెడితే, మీకేం ఫర్వాలేదుగా” అంటూ జవాబు కోసం ఎదురుచూడకుండానే తన సంచీ తీయబోయాడు భుజాలమీంచి.
వెంటనే అటు తిరిగి, “ఆగండాగండి, ఇక్కడ రెండిటికి స్థలం లేదు”, తన సంచీకి వకాలతు తీసుకుంటున్నట్టు అన్నాడితను.
“Oh. Sorry.”అంటూ బ్యాగులు పెట్టుకునే అరలవైపు చూశాడాయన. కానీ అక్కడా అణువంత కూడా లేదు చోటు.
ఆ ఇరుకు లోనే గిరుక్కున మళ్ళీ ఇటు తిరిగి సంచి వీపు మీదకే సర్దుకున్నాడు.
మనసు మార్చుకున్నట్టున్నాడు  ఆ పాతికేళ్ళ వాడు, “కావాలంటే సంచీ పెట్టుకోండి సీట్ మీద” అన్నాడు అతనితో.
“ఫరవాలేదు, దోవలో అడ్డం అని  పెడదామనుకున్నాను గానీ నా సంచీ అంత బరువుగా లేదు”, అని అతని ఆదరానికి కృతజ్ఞత గా తల ఊపాడు ఇతను.
నాకు ఇది నచ్చింది, మనుషులు పూర్వం కంటే  మారినట్టున్నారనిపించింది.
‘హమామట్సు- చో‘,  ఆ తర్వాత ‘షినాగవా‘ దగ్గర కొంతమంది దిగారు కాని అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కారు జనాలు.
ఎవరెంతమంది కొత్తగా ఎక్కుతున్నా, ఈ పిల్లవాడు మాత్రం, ముందుకు ఒరుగుతూ, మళ్ళీ సరిగా సర్దుకుంటూ అట్లా ఊగుతూనే ఉన్నాడు.
“వాడి మొహం వైపొకసారి చూడండి”,  ఒక గుంపు గా ఎక్కిన ఐదుగురు ఆఫీస్ ఉద్యోగస్తుల్లో  ఒకరు అన్నారు . మిగతా వాళ్ళు ఫక్కున నవ్వారు. నాకు ఆ పిల్లాడి మొహం కనిపించటం లేదు కానీ ఆయన కి తమాషాగా కనిపించే లక్షణమేదో వాడి మొహంలో ఉండిందేమో. సంప్రహాసపు ఛాయ అలుముకుంటోంది రద్దీ గా ఉన్న ఆ కంపార్ట్మెంట్ .
ఇంతలో ఆ గుండ్రటి మొహం అతను తన వెనక ఉన్నవాడివైపు తిరిగి, చూపుడువేలు తో పొట్టమీద తాటించుకుంటూ “ఆ పిల్లవాడి సమస్య ఇదీ, పస్తులు” అన్నాడు చిన్నగా .
కొంచెం ఆశ్చర్యపోయి ఆ రెండోవాడు పిల్లవాడి వైపు చూశాడు మెల్లగా.
ఇందాక నవ్విన వాళ్ళు కూడా వీడికి ఏదో కష్టం అని అనుకుంటున్నట్టే కనిపించారు.
“ఏదైనా సుస్తీ యా?” ఒకరడిగారు.
“తాగినట్టిన్నాడు, అదే అయుండాలి”,  ఇంకొకరు. కానీ ఇంతలోనే మరొకరు “కాదు, అట్లా అనిపించటంలా.”
  విషయం ఏమిటనేది అర్ధం అయినట్టు, వాళ్ళంతా ఉన్నట్టుండి నిశ్శబ్దమై పోయారు.

ఆ పిల్లాడు వేసుకున్న ముతక ఫ్యాక్టరీ యూనిఫామ్ భుజం మీద ఓ చినుగు. దానికి లోపల ఓ టవలు ముక్క అతుకేసి  కుట్టి ఉంది. వెనక్కు తిప్పి పెట్టుకున్న మిలిటరీ టోపీ అంచు కింద నుంచి మాసి బలహీనంగా ఉన్న వాడి మెడ దీనంగా కనిపిస్తున్నది. వాడి ఊగడం ఆగింది ఇప్పుడు. తలుపుకు కిటికీకి మధ్య ఉన్న కంపార్ట్మెంట్ చెక్కగోడకు చెంప రుద్దుకుంటున్నాడు. వాడి అలసిన ప్రాణం ఆ చెక్కముక్కనే ఒక మనిషిని చేసుకుని పసిపిల్లవాడిలా దానికి కరుచుకుంటున్నది.
“ఓయ్ ఎక్కడికీ నీవు వెళ్ళడం?” ఎదురుగా నిల్చుని ఉన్న ఒక భారీ పెద్దమనిషి వాడి భుజంమీద చెయ్యి వేసి అడిగాడు.
వాడు బదులు చెప్పలా, మళ్ళీ అడిగేటప్పటికి “యెనో వెళ్తున్నా” అన్నాడు, విపరీతమైన అలసట గొంతులో.
“అటువైపు కాదు, సరిగ్గా నీవు ఇప్పుడు ఇంకో చివరకు పోతున్నావు. ఈ రైలు షిబుయా కు వెళ్తుంది.”
ఒక్క ఉదుటున లేచి వాడు కిటికీ బయటకు చూశాడు. అదాటున లేవడంతో  రైలు వేగానికి వాడు కొంచం నాపైకి తూలాడు. హఠాత్తుగా అప్పుడు నేను చేసిన పని ఏంటో ఆ తర్వాత నాకే ఎంతకూ కొరుకుడు పడలేదు. వాడు నా మీద పడటం, వెంటనే నేను వాణ్ణి నా భుజంతో అవతలికి తోసేయటం. ఆ నా చర్యకూ, ఆ క్షణాన నా లోపల నిజంగా ఉన్న భావన కూ అస్సలు పొంతనే లేకపోవడం నన్ను నిర్ఘాంత పరిచింది. విపరీతంగా జాలేసింది. అంతకంటే ఎక్కువగా, నేను చేసిన పనికి సిగ్గేసింది, నా మీద వొచ్చి పడిన వాడి బరువు నిజానికి చాలా చాలా తక్కువ. అప్పట్లో నూటపది కిలోల పైన ఉన్న నా బరువుతో పోలిస్తే వాడి బరువు ఏ మూలకని.
“నువ్ టోక్యో లో మారాల్సింది , ఎక్కడెక్కావు అసలు?” అతి ప్రయత్నం మీద అడిగాను వాడి వెనకనుంచి.
“షిబుయా దగ్గర,” ఇటు తిరగకుండానే అన్నాడు.
“సరిపోయింది, ఒక ప్రదక్షిణం చేసొచ్చావు సరిగ్గా” అన్నారొకరు.
కిటికీకి మొహం ఒత్తి ఆనించి వాడు బయటి చీకటి చూశాడు. ఇక సరిపుచ్చుకున్నట్లు “ఏదైతే ఏంటిలే” అని వాడు గొణుక్కోవడం సరిగ్గా కూడా బయటకు వినిపించలేదు.
వాడితో వాడు అనుకున్న ఆ మాటలు నాకు ఆ తర్వాత చాలా రోజులు గుర్తుండి పోయాయి.
రైలు పెట్టెలో మిగతా  వాళ్ళు ఇంక వాడిని పట్టించుకోలేదు. వాళ్ళు వాడికి చెయ్యగలిగిందేం లేదనుకున్నట్టున్నారు. ఆ పరిస్థితుల్లో నేనూ అప్పుడు చేసేదేం లేదని నాకూ అనిపించింది.
నా దగ్గర తినడానికి ఏదైనా ఉణ్ణుంటే బహుశా వాడికి ఇచ్చే వాణ్ణేమో, నా తృప్తి కోసం. ఒకవేళ అది పగలైనా డబ్బులు వాడికి ఏ మాత్రం ఉపయోగపడేవో? అందులో రాత్రి ఈ  తొమ్మిది గంటలప్పుడు వాడికి కొనుక్కోవడానికి ఏమైనా దొరుకుతుందా అనేది అనుమానమే.

ఆ దిగులుతోనే  ‘షిబుయా‘ దగ్గర దిగాను.
ఈ సంఘటన  1945 అక్టోబర్ 16 న జరిగింది. 

……….

అనువాదకురాలు : పద్మజ సూరపరాజు, చెన్నై.

……………..

మూల కథ రచయిత: Naoya Shiga, 1883 – 1971, ‘చిన్న కథల దేవుడు’ అని పేరు గాంచిన జాపనీయ రచయిత. 

………….

A Gray Moon – Naoya Shiga
English translation – Lane Dunlop.

Spread the love

సూరపరాజు పద్మజ

సూరపరాజు పద్మజ గారు చెన్నై నివాసి. సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు.

3 వ్యాక్యలు

Leave a Reply to Kallakuri Sailaja స్పందనను రద్దుచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!