Prabhathalovesmovies… ఆ పేరులోనే కనిపిస్తోంది తన ప్రేమంతా. యెస్… ప్రభాత సినిమా ప్రేమికులు. యెటువంటి ప్రేమ అది… సినిమానే శ్వాసగా… స్వప్నంగా… కలవరిస్తూ… పలవరిస్తూ… తొలినాడు చిట్టి చిట్టి మాటల్తో చుట్టూ వారితో పంచుకునే చిన్నారి ప్రభాత సినిమా యిష్టం… యవ్వనంలో వాక్యాల ప్రవాహమయి యీ రోజు చలనచిత్ర అభిమానుల మనసుల్లో నమ్మదగ్గ అభిప్రాయంగా పేరు తెచ్చుకుంది. తన విశ్లేషణకి అసంఖ్యాకమైన పాఠకులు లవ్ యూ ప్రభాత అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లోచూపున్న యీ సినీ రివ్యూవర్ మొదటి యింటర్వ్యూ యిది.
కుప్పిలి పద్మ: థాంక్ యు యింటర్వ్యూకి వొప్పుకున్నందుకు.
ప్రభాత : మై ప్లజర్ … థాంక్యూ.
1.మీ నేపథ్యాన్ని పంచుకుంటారా?
నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎం.ఎ చేశాను. టీచర్ అవుదామని బి.ఎడ్ కూడా చేశాను. కాని టీచర్ ఉద్యోగం నాకు ఎందుకో అంత సెట్ కాలేదు. పుడమి పబ్లికేషన్స్ లో ఎడ్యుకేషన్ కంటెంట్ రైటర్ గా నాలుగేళ్ళు పని చేశాను. అది మూసేశాక సినిమానే నా ఫుల్ టైమ్ జాబ్ అయిపోయింది. ప్రస్తుతం రివ్యూలు రాయడంతో పాటు సినిమాలను రాజ్యాంగ విలువల దృక్పథంతో పరిశీలించే ‘యక్షి’ సంస్థ వాళ్ళ ఫెలోషిప్ ఒకటి తీసుకుని పని చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో సినిమాను ప్రదర్శించి అందులో ఏ అంశం వారికి నచ్చిందో తెలుసుకునే ప్రయత్నం, ఆ అంశంలో ఇమిడి ఉన్న విలువల గురించి వారితో చర్చించే ప్రయత్నం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు కోర్ట్, ఫూలే సినిమాలను ప్రదర్శించాము. వారి స్పందన చాలా ఆశాజనకంగా అనిపించింది.
2. సినిమాల మీద మీకు ఆసక్తి యెప్పుడు, యెలా కలిగింది?
సినిమా పట్ల నా ఆసక్తి గొప్పగా ఏమీ మొదలు కాలేదు. నేను థియేటర్ కి వెళ్ళి చూసిన (లేదా చూడలేకపోయిన) మొదటి సినిమా రామ్ గోపాల వర్మ ‘సత్య’. మొదటి 5 నిమిషాల్లోనే మూడు నాలుగు హత్యలు జరగడంతో భయపడిపోయి అమ్మను గట్టిగా కావలించుకున్నానట. అప్పుడు మా అమ్మ ఫ్రెండ్ ఖదీర్ కూడా మాతో ఉన్నాడు. సినిమా చూడకుండానే ఇంటికి వచ్చేశాం. నా వయస్సు అప్పుడు ఆరేళ్లు. ఆ తర్వాత ‘సత్య’ను టీవీలో చూశాననుకోండి. ఇప్పుడైతే నాకు చాలా ఇష్టమైన సినిమాలలో అది ఒకటి. విలన్ లను, ముఖ్యంగా మనోజ్ బాజ్ పాయ్ ను చాలా మామూలు మనిషిలా చూపించిన పద్ధతి నాకు చాలా నచ్చుతుంది. మొదట్లో నేను హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాడ్ని కాదు. అమ్మ ఏవేవో భాషల సినిమాలకు (తను ఫిల్మ్ సొసైటీ మెంబర్) వెళదాం వస్తావా అంటే గొడవ చేసేవాడ్ని, తెలుగు సినిమాలకు ఎందుకు తీసుకెళ్ళవు అని. అయితే క్రమంగా లగాన్, మున్నాబాయ్ ఎం.బి.బి.ఎస్, మంగల్ పాండే లాంటి సినిమాలు చూసి హిందీ సినిమాలంటే ఇష్టం పెంచుకున్నా. వీటికి మా నాన్న కూడా మాతో రావడం నాకు గుర్తుంది. నాకు హిందీ బాగా రాకపోతే మా అమ్మే తెలుగులో డైలాగులు అనువాదం చేసి చెప్పేది. క్రమేణా వివిధ భాషలలో వివిధ రకాల సినిమాలను చూస్తూ నా సొంత అభిరుచిని నేను ఏర్పరచుకున్నాను.
3. సినిమాల మీద రివ్యూలు రాయాలని యెప్పుడనిపించింది?
బహుశా కోవిడ్ దానికి కారణం కావొచ్చు. చాలామందిలా నేనూ అప్పుడే OTT లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడడానికి అలవాటు పడ్డాను. చూసిన వాటి మీద మూడు, నాలుగు పేరాలు రాసి ఫేస్బుక్ లో పెట్టేవాడ్ని. దానితో పాటు నాలుగైదు నిమిషాల వీడియోలు చేసి యూట్యూబ్ లో prabhathalovesmovies పేరుతో పోస్ట్ చేసేవాడ్ని. తర్వాతి కాలంలో వాటిని ఆపేశాననుకోండి. నేను సినిమాల మీద రాస్తున్నానని తెలిసి సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు తన వెబ్ సైట్ primepost కి రాయమని అడిగారు. అప్పటికి రివ్యూ ఎలా రాయాలో కూడా నాకు సరిగ్గా తెలియదు. క్రమంగా అలవాటైంది. కథల్లో, పాత్రల్లో ఉండే వైవిధ్యం వల్ల ప్రతి సినిమాలోను, వెబ్ సిరీస్ లోను ఏదో ఒక కొత్తదనం కనిపించి రాయడాన్ని బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత తర్వాత ఒట్టి రివ్యూలే కాక యాక్టర్ లు, డైరెక్టర్ ల profiles, theme based వ్యాసాలు కూడా రాయడం ఆరంభించాను. అలాగే సినిమాకు సంబంధించిన పుస్తకాల మీద అప్పుడప్పుడు రాస్తూ వచ్చాను. కోవిడ్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరినా సినిమా రివ్యూలు రాయడం మాత్రం ఆపలేదు. రేపు వేరే ఉద్యోగంలో చేరినా ఇది కొనసాగించగలననే ఆశిస్తున్నా.
4. మీ రివ్యూలను ప్రేక్షకులతో ఏ మాధ్యమం ద్వారా పంచుకుంటున్నారు?
మొదట ఫేస్బుక్ లో రాసేవాడ్ని. తర్వాత Primepost, Hans India, SouthFirst లాంటి వెబ్ సైట్స్ కి, పత్రికలకు రాయడం మొదలుపెట్టాక ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ లలో షేర్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు ఒక సొంత వెబ్ సైటు కూడా ఉంది. దాని పేరు rigoberthareviews.com.
5. మీరు సినిమాలు చూడటం మొదలుపెట్టినప్పటికి, యిప్పటికి సినిమాల్లో వచ్చిన మార్పులేంటి?
కథ చెప్పే విషయంలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా ట్రెండ్ వచ్చాక. సాంకేతికత బాగా పెరిగిపోయింది. బాహుబలి, RRR, కల్కి లాంటివి ఏవి తీసుకున్నా ఈ మార్పు బాగా తెలుస్తుంది. పెద్ద పెద్ద గడ్డాలతో rugged గా కనిపించే మాస్ యాక్షన్ హీరోలే ఇప్పుడు కమర్షియల్ సినిమాను శాసిస్తున్నారు. వేరే రకం కథలు సినిమాగా రావడం లేదని కాదు, 35 చిన్న కథ కాదు, కోర్ట్ , 23 లాంటి సినిమాలు కూడా వచ్చి సక్సెస్ అవుతున్నాయి. హారర్ సినిమా/వెబ్ సిరీస్ కథల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కిర్రుమంటూ తెరుచుకునే తలుపుల్ని చూపెట్టి భయపెట్టే రోజులు పోయి సామాజిక అంశాలతో ముడిపడ్డ హారర్ కథలు సినిమాలుగా వస్తున్నాయి.
6. మీ దృష్టిలో ఇండియన్ సినిమా ప్రపంచ సినిమాతో పోలిస్తే యెలా ఉంది?
ఇండియన్ సినిమాను ప్రపంచ సినిమాతోనో, హాలీవుడ్ సినిమాతోనో పోల్చడం నాకు ఇష్టం లేదు. మనకూ మంచి కథకులు ఉన్నారు. కథ చెప్పడంలో మన ప్రత్యేకతలు మనకు ఉన్నాయి. గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో మనవాళ్ళూ తీశారు. టాలెంట్ కు కొదవ లేదు. డైరెక్టర్ లు కావొచ్చు, యాక్టర్ లు కావొచ్చు, వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వినూత్నత తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో కమర్షియల్ సినిమా అంటే భారీ యాక్షన్ సీన్లు మాత్రమే అనుకునే ధోరణిని మానుకోవాలి.
7. మీ ఫేవరెట్ డైరెక్టర్ యెవరు? యెందుకు?
ఒక్కరు కాదు, చాలామంది ఉన్నారు. ఉదాహరణకు కబీర్ ఖాన్. సామాన్యులు విజేతలుగా మారే కథల్ని ఆయన గుండెలకు హత్తుకునేలా తీస్తాడు. భజరంగి భాయిజాన్, 83, చందు ఛాంపియన్ మొదలైనవన్నీ అలాంటివే. నాకు ఫూలే, స్టోరీ టెల్లర్ తీసిన అనంత్ మహదేవన్ కూడా ఇష్టమే. సీనియర్ లలో సంజయ్ లీలా భంసాలికి నేను పెద్ద ఫ్యాన్ ను. ఆయన కథలు భిన్నంగా ఉండడమే కాక ఆయన సినిమాలలో స్త్రీ పాత్రలు చాలా strong గా ఉంటాయి. ఆయన తీసిన వాటిలో గంగుబాయి కతియవాడి అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం. తెలుగుకు సంబంధించినంతవరకు నాకు నచ్చిన కొత్త డైరెక్టర్ లలో నాగ్ అశ్విన్ ఒకరు. కేవలం మూడు సినిమాలతోనే చాలా మంచి పేరు తెచ్చుకోగలిగాడు. అమితాబ్ లాంటి పెద్ద స్టార్ ను సైతం handle చేశాడు. తమిళ డైరెక్టర్ లలో వెట్రిమారన్ నచ్చుతాడు. వర్గం, కులంకు సంబంధించి ఆయన తీసుకునే అంశాలు చాలా bold గా, కనువిప్పుగా ఉంటాయి. మలయాళంలో ఒక్క పేరు చెప్పడం కష్టం. ఆడుజీవితం తీసిన బ్లెస్సీ మొదలైన చాలామంది ఉన్నారు. అక్కడ కథకు ఇచ్చే ప్రాధాన్యత నాకు చాలా ఇష్టం. హీరో కోసం కథను రాసుకునే అలవాటు వాళ్లకు ఉన్నట్టు లేదు. అందువల్లేనేమో అక్కడ చాలామంది డైరెక్టర్ లు మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. హాలివుడ్ లో అయితే టైటానిక్, అవతార్ సినిమాలు తీసిన జేమ్స్ కామెరూన్ అంటే ఇష్టం.
8. మీ ఫేవరెట్ నటి యెవరు? యెందుకని?
ఒకప్పుడు అయితే ఆలియా భట్ అని మాత్రమే చెప్పేవాడినేమో. ఇప్పుడు మాత్రం చాలామంది పేర్లు చెప్పాలి. మెరిల్ స్ట్రీప్ నుండి అనన్య పాండే దాకా. మధ్యలో నయనతార, పార్వతి తిరువొత్తు మొదలైన వాళ్ళు ఉన్నారు. అన్ని సినిమాలలో కాకపోయినా కొన్ని సినిమాలలో మాత్రమే నచ్చినవాళ్ళూ ఉన్నారు. వివిధ భాషల్లో రకరకాల నటీమణులు కొన్ని కొన్ని పాత్రలలో అత్యద్భుతమైన నటన కనబరచడం చూస్తున్నాను. వీళ్ళు ఎందుకు నచ్చారో కూడా చెపుతాను. ఆలియా గురించి చెప్పాల్సి వస్తే ఆమె చాలా వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పాత్రలు చేసింది. ఉదాహరణకు ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ, గంగుబాయి కతియవాడి. పార్వతి తిరువొత్తు స్క్రీన్ పైన, బయట కూడా చాలా దృఢమైన వ్యక్తిలా అనిపిస్తుంది. నయనతార విషయానికి వస్తే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. ఇటు గ్లామరస్ హీరోయిన్ గాను, అటు కథా బలం ఉన్న పాత్రలలోను నటించి మెప్పించగలుగుతోంది. మెరిల్ స్ట్రీప్ విషయం చెప్పక్కరలేదు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో గొప్ప పాత్రలతో పాటు నిర్భీతి ఆమె మరో గొప్ప గుణం. అనన్య పాండే గత కొద్ది సంవత్సరాలలో కొన్ని మంచి పాత్రలు వేసి నటిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటోంది.
9. మీ రివ్యూలకు ఎలాంటి స్పందన వస్తోంది? వాటిలో మీకు ప్రత్యేకంగా అనిపించినవి కొన్ని చెప్పగలరా!
స్పందన క్రమేణా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో పెట్టడం మొదలెట్టాక రీడర్స్ పెరిగారు. దానికి ఒక ముఖ్య కారణం ఫ్యాన్ పేజెస్. తమ అభిమాన నటుల సినిమాల మీద వచ్చిన రివ్యూలను, profiles ను వాళ్ళు బాగా షేర్ చేస్తారు. ఉదాహరణకు కార్తీక్ ఆర్యన్ మీద రాసినదాన్ని అతని ఫాన్స్ బాగా షేర్ చేసుకున్నారు. అలాగే నాగ చైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ రివ్యూని అక్కినేని ఫ్యామిలీ అభిమానులు బాగా షేర్ చేసుకున్నారు. మిగతా రీడర్స్ విషయానికి వస్తే – చదివిన వాళ్ళందరూ ఇష్టపడ్డారో లేదో తెలియదు కాబట్టి మరింత మెరుగు పరచుకునే అవకాశం నాకు అంతగా రాలేదు. నా వరకు నేను నాకు అనిపించిందేదో రాస్తూ వచ్చాను.
ఇటీవలి కాలంలో నాకు ప్రత్యేకంగా అనిపించినవి ‘మై మెల్బోర్న్’ ఆంథాలజీలో ‘నందిని’ భాగాన్ని తీసిన ఓనిర్, ‘ఫూలే’, ‘స్టోరీ టెల్లర్’ సినిమాలు తీసిన అనంత్ నారాయణ్ మహదేవన్ స్పందనలు. ఒకరు ఇన్ స్టాగ్రామ్ లో, ఒకరు ఫేస్బుక్ లో నా రివ్యూలను చిన్న ప్రశంసలతో షేర్ చేసుకున్నారు. అలాగే రాహుల్ రవీంద్రన్ నా ‘జిగ్రా’ రివ్యూను లైక్ చేయడం, అనన్య పాండే వాళ్ళమ్మ భావనా పాండే నా ‘కేసరి చాప్టర్ 2’ రివ్యూను లైక్ చేయడం లాంటి special moments కూడా ఉన్నాయి.
10. మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి కథలని అనువాదం చేస్తున్నారు కదా! ఆ ఆసక్తి యెలా కలిగింది? ఆ అనుభవాలు పంచుకుంటారా?
మొదట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి) గీత గారు అడిగారు అనువాదం చేయగలవా అని. ఒక కొత్త విద్యను నేర్చుకుంటున్నట్టు ఉంటుందని సరే అన్నాను. పి. సత్యవతి గారి ‘నేనొస్తున్నాను’ కథను Here I Am అనే పేరుతో అనువదించాను. ఇప్పటివరకు 10 కథలు, 40 చిన్న కవితలు చేశాను. కొన్ని కథలు సంకలనాలలో వచ్చాయి, కొన్ని ఇంకా అచ్చవలేదు. నా అనువాదాలు ఆయా రచయితలకు ఎంత నచ్చాయో గాని వాటి ద్వారా తెలుగు సాహిత్యం చదవడానికి నాకు మాత్రం అవకాశం లభించింది. అవన్నీ విభిన్న రచయితలు, విభిన్న కాలాలలో రాసిన కథలు కావడం వలన కథలలో వైవిధ్యమే కాక భాష, శైలిలో కూడా చాలా వైవిధ్యం కనిపించి ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గా ఉండేది.
ప్రతి కథ నుండి ఎంతో కొంత నేర్చుకున్నాననిపించేది. బి. అనురాధ గారి కథలు ‘ధీశాలి’, ‘ఏక చద్దర్ మెయిలీ సి’ అనువాదం చేస్తున్నపుడు జైలు జీవితం అనే ఒక కొత్త ప్రపంచం పరిచయం అయింది. సతీష్ చందర్ గారి ‘ముల్లు’ కథలో ఇతివృత్తం, భాష కూడా చాలా ప్రత్యేకమైనవిగా అనిపించాయి. జెండర్ నీ, కులాన్నీ కలిపి లోతుగా పరిశీలించిన ఈ కథను అనువదించేటపుడు ప్రేమను తల్లీ కూతుర్లు తిట్ల రూపంలో వ్యక్తం చేయడం చూసి మొదట చాలా ఆశ్చర్యపోయాను. ఆ పదాలను ఇంగ్లీష్ లోకి అనువదించడం మహా కష్టమైనా వాళ్ళ సంభాషణలను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ‘వియ్యుక్క’ సంకలనాల నుండి చేసిన రెండు కథల గురించి కూడా చెప్పాలి. విప్లవకారుల కఠినమైన జీవితం గురించి, ఎంతో ప్రమాదకరంగా జీవిస్తూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రజాసేవ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా చాసో గారి ‘నేనెందుకు పారేస్తాను నాన్నా’, నెల్లూరి కేశవస్వామి గారి ‘యుగాంతం’ కథలు, ఉణుదుర్తి సుధాకర్ గారి ‘కొంచెం సబ్బునురగ, ఒక కత్తిగాటు’ (Barber’s Tale), కుప్పిలి పద్మ గారి ‘తేయాకు తోటల్లో…’ కథలు అనువాదం చేశాను.. కుప్పిలి పద్మ గారి కథలో భాష ఎక్కువ చోట్ల కవితాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఆ భావాన్ని తీసుకురావడం కాస్త కష్టమే అయింది. మిగతా వాటి నుంచి కూడా నేను చాల విషయాల్ని తెలుసుకున్నాను.
***
Day 1 నుంచి ప్రభాత సినిమా సమీక్షలు ఫాలో అవుతున్నాను.
తను సత్యవతి గారి కథ నేనొస్తున్నాను ఇంగ్లిష్ అనువాదం Here I am చదివాను. చక్కని అనువాదం. తెలుగు ఇంగ్లిష్‌కి మంచి వారధి అవుతాడు తను.