ఇచ్ఛామతి

చరిత్రకెకాల్సినది ఇంకా చాలా ఉన్నది

నేను యాదాద్రి`భువనగిరి జిల్లా రఘునాథపురంలో పద్మశాలి కుటుంబంలో పుట్టిన. మా నాయిన బట్టలు నేయించే ఆసామి. కాకపోతే మా అమ్మే ఎక్కువ యాక్టివ్‌గా ఉండి పనిలో పాలుపంచుకునేది. ఇప్పటికీ మా అమ్మ ‘శాల పని అంటే చాలా పని’, ఆ వృత్తినుంచి బయటపడితేనే బాగుపడతారని చెబుతుంది. ప్రాథమిక విద్య ఊర్లోనే జరిగినా చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చినాము. ఇక్కడే చదువంతా సాగింది. ఉస్మానియాలో జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌తో పాటు పిహెచ్‌డి కూడా చేశాను. 

‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని 2003లో ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్‌, నేను ఇద్దరం కలిసి ఏర్పాటు చేసినాము. విస్మృతికి గురైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల గురించి పరిశోధన చేసి కొత్త విషయాలు ప్రచురణల ద్వారా వెలుగులోకి తేవాలని ఆ సంస్థను స్థాపించాము. ‘కవిలె’ కట్టలు అని తాళపత్రాల సముచ్ఛయాన్నంటారు. అట్లా మరుగునపడ్డ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చినట్లయితే వాటిపై మరింత లోతుగా పరిశోధన జరగడానికి అవకాశముంటుందనే ఉద్దేశ్యంతో ఆ సంస్థను ఏర్పాటు చేశాము. ప్రాథమిక వనరులు అందుబాటులో ఉన్నట్లయితే వాటిపై విశ్వవిద్యాలయాల్లోనూ, ఔత్సాహికులూ ఆసక్తితో అధ్యయనం చేస్తారనే ఆశతో ‘కవిలె’ను ఏర్పాటు చేశాము. 

ఈ సంస్థ తరపున ‘షబ్నవీస్‌’ తెలంగాణ పత్రికారంగ చరిత్ర, ‘దస్త్రమ్‌’ తెలగాణ కథాసూచి, వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ మొదలు సురవరం ప్రతాపరెడ్డి ‘కవిత్వం’, సురమౌళి ‘కథలు’, కె.గోపాలకృష్ణారావు వ్యాసాలు ‘బురుజు’, ధరణికోట శ్రీనివాసులు ‘కథలు’, భండారు అచ్చమాంబ ‘కథలు’, మాదిరెడ్డి సులోచన ‘కథలు’ తదితరాలు వెలువరించాము. ఇందులో చాలా వాటిపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.

వి.లక్ష్మణరెడ్డి మొదలు చాలా మంది తెలుగు పత్రికా రంగ చరిత్రను పరిశోధన చేసి వెలువరించారు. అయితే అందులో ఆంధ్రా/మద్రాసు ప్రాంతానికి చెందిన పత్రికా రంగ చరిత్రనే ఉండిరది. మొత్తం తెలుగు పత్రికా రంగ చరిత్ర అయినప్పటికీ వాటిలో తెలంగాణ ప్రాంత చరిత్ర దాదాపు శూన్యం. ఇలాంటి దశలో 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా కొంతమంది మిత్రులం ‘తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌’ ఏర్పాటు చేసినాము. తెలంగాణ చైతన్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ఎంఫిల్‌ విద్యార్థిగా ‘తెలంగాణలో పునర్వికాసం`తెలుగు పత్రికల పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేసేందుకు నమోదు చేసుకున్నాను. కొంత పనిచేసినప్పటికీ సరైన వనరులు దొరకలేదు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం పెద్ద వనరు. ఈ గ్రంథాలయ కార్యదర్శిగా ఉన్న అప్పటి ఎం.ఎల్‌.నరసింహారావుని కలిసి నా పరిశోధన గురించి చెప్పిన. ఆయన నిరుత్సాహ పరిచే విధంగా తెలంగాణలో నాలుగైదు పత్రికలున్నాయి (1956కి ముందు) వాటిపై ఏమి పరిశోధన చేస్తావు. వేరే అంశం ఎంచుకో అని చెప్పిండు. అయితే అప్పటికే నేను కొంత గ్రౌండ్‌ వర్క్‌ చేసి భాగ్యరెడ్డి వర్మ నడిపిన ‘భాగ్యనగర్‌’ పత్రిక గురించి చెప్పిన. అట్లా మరో అరడజను పత్రికల గురించి వివరించిన. ఇట్లా ఆయనకన్నా నాకే ఎక్కువ తెలుసు అనిపించింది. అట్లా పరిశోధన సరైన దారిలోనే నడుస్తుందనే ధైర్యం కలిగింది.    

ఈ దశలోనే ‘ఉదయం’ దిన పత్రికలో కలిసి పనిచేసిన గురుమిత్రులు కె.శ్రీనివాస్‌ తన పిహెచ్‌డి కోసం పనిచేస్తుండడంతో మేమిద్దరం కలిసి హైదరాబాద్‌లోని దాదాపు అన్ని గ్రంథాలయాలను అవలోడనం చేశాము. అప్పటికి బ్రతికున్న కోదాటి నారాయణరావు, ఎం.ఎస్‌.రాజలింగం, గుండవరపు హనుమంతరావు ఇట్లా అనేక మందిని ఇంటర్వ్యూ చేశాము. చేశాము అంటే శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉంటే నోట్సు రాసుకోవడమే. ఇట్లా తెలంగాణలో రికార్డుల్లోకెక్కని చరిత్ర ఎంతో ఉందని అర్థమయింది. దాంట్లో భాగంగానే అందుబాటులో ఉన్న సమాచారంతో ‘షబ్నవీస్‌’ పేరిట తెలంగాణ పత్రికా రంగ చరిత్రను శ్రీనివాస్‌ ముందుమాటతో వెలువరించాను. దాంట్లో తెలంగాణ పునర్వికాస వాహికలైన హితబోధిని, గోలకొండ, సుజాత, దేశబంధు, మీజాన్‌, ఆంధ్రాభ్యుదయము, నీలగిరి, తెనుగు పత్రిక లాంటి 100కు పైగా పత్రికలను లెక్కగట్టిన. ఆ పత్రికలు సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలకు చేసిన ఇతోధిక సేవను విడమర్చి చెప్పినాను. 

1995`96 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటూ వచ్చింది. తెలంగాణ వైతాళికులు, సాహిత్యం, ఉద్యమాలు అన్ని చర్చలోకి వచ్చాయి. ఈ దశలోనే తెలంగాణలో కథా సాహిత్యం 1970ల తర్వాతే ప్రారంభమయిందని చెప్పడమే గాకుండా, లబ్ధప్రతిష్టులైన విమర్శకులు సైతం దాన్ని ఆమోదించిండ్రు. అయితే నేను తెలంగాణ పత్రికా రంగ చరిత్ర మీద పరిశోధన చేస్తున్న సమయంలోనే ఆ యా పత్రికల్లో వచ్చిన కథల వివరాలు, వాటిలోని స్థూలమైన కథాంశం, రచయితలు, పత్రికలు, ప్రచురించిన సంవత్సరం ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా రాసుకున్నాను. ఇట్లా ప్రత్యేకంగా రాసుకున్న వివరాల ఆధారంగా తెలంగాణలో 1956కు ముందే 1500ల వరకు కథలు వివిధ పత్రికల్లో అచ్చయినాయని తేల్చి చెప్పిన. అంతేగాకుండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన గుడిపాటి వెంకటాచలం కథలు అక్కడి పత్రికలు ప్రచురించడానికి నిరాకరిస్తే ఇక్కడి సుజాత పత్రికలో వరుసగా అచ్చేశారనే అంశాన్ని కూడా కూలంకషంగా ‘దస్త్రం’లో చర్చించాను. దీన్ని చాలా మంది విమర్శకులు ప్రశంసించారు. జింబోగారు అక్షరాయుధ మన్నారు. కాళిపట్నం రామారావు గారు దాన్ని చూసి నీలాంటి వాడు మా ఉత్తరాంధ్రకు ఒకరుంటే చాలా మేలు కలిగేది అని ప్రశంసించారు. ఒక రకంగా చెప్పాలంటే ‘షబ్నవీస్‌’ పరిశోధన ఉప ఫలితం ‘దస్త్రం’ అని చెప్పవచ్చు. 

లైబ్రేరియన్‌గా నా మొదటి పోస్టింగ్‌ సంగారెడ్డి కళాశాలలో. అక్కడ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలు దాదాపు అన్నీ 1956కు ముందువే ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో చాలా రేర్‌ పుస్తకాలు చదివిన. ఈ ఒక్క ప్రదేశం తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా సరైన పుస్తకాలు లేవు. అయితే నేను చిన్నప్పటి నుంచి అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లేవాడిని. అక్కడ ఒక సెక్షన్‌ రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉండేది. మా ఇల్లు కూడా అక్కడికి దగ్గరే ‘చుడి బజార్‌’లో ఉండేది. దీంతో రోజూ రాత్రి పన్నెండు గంటలవరకు చదువుకొని (15`16 యేండ్ల వయసులో) ఇంటికి వెళ్లేవాడిని. అట్లా లైబ్రరీ, పుస్తకాల పట్ల ప్రేమ ఏర్పడిరది. వృత్తిలో చేరేనాటికే క్లాసిఫికేషన్‌, రెఫరెన్స్‌, రేర్‌ పుస్తకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడిరది.

చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళుతూ ఉండేవాడిని అని చెప్పాను కదా. అట్లా వెళ్లినప్పుడు మందుముల నరసింగరావు ‘యాభై సంవత్సరముల హైదరాబాద్‌’ అనే పుస్తకం నన్ను వెంటాడిరదని చెప్పొచ్చు. ఇది ఆయన ఆత్మకథ.  నరసింగరావు ఆంధ్ర మహాసభ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాడు. రయ్యత్‌ అనే ఉర్దూ పత్రికను నడిపించిండు. ఈయన తన ఆత్మకథలో ‘షోయెబుల్లాఖాన్‌’ గురించి రాసిండు. అప్పుడు (బహుశా ఇప్పటికీ) మొదటి ర్యాంక్‌ సాధించిన వారికి ‘షోయెబుల్లాఖాన్‌ మెమోరియల్‌ అవార్డు’ ఇచ్చేవారు. ఈ షోయెబుల్లాఖాన్‌ ఎవరు అని క్లాసులో అడిగితే ఎవరూ చెప్పలేక పోయిండ్రు. నేను మాత్రం అంతకుముందే చదివి వుండడంతో ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన. ఇట్లా పత్రికలు, జర్నలిస్టుల మీద ఆసక్తి పెరిగింది.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఒకటి అర్థమయింది. గతంలో ఆంధ్రమహాసభ ఉద్యమం బలంగా సాగుతూ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గుల రామకృష్ణారావు, చిదిరెమఠం వీరభద్ర శర్మ, భాగ్యరెడ్డి వర్మ ఇట్లా అనేక మంది తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తి చూపుతూ బహుముఖాలుగా పనిచేశారు. పత్రికల సంపాదకులుగా, రచయితలుగా, కథకులుగా, కవులుగా, ఉద్యమకారులుగా, పబ్లిక్‌ ఇంటలెక్చువల్స్‌గా విస్తృతంగా పనిచేశారు. వారి స్ఫూర్తితోనే మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాను. అయితే ఈ పని ఇట్లా ముందుకు సాగడానికి, ఆసక్తి ఇనుమడిరచడానికి కె.శ్రీనివాస్‌ని చూసి నేర్చుకున్నదే ఎక్కువ. ఒక విషయానికి మరో విషయానికి లంకె కుదిరే విధంగా అన్వయం, సమన్వయం చేయడం ఆయన నుంచే నేర్చుకున్న. 

ఇంకా బోలెడంత సాహిత్యం వెలుగులోకి రావాల్సి ఉన్నది. సాహిత్య చరిత్రలన్నీ ఆధిపత్య కులాల వాండ్లే రాయడంతో అందులో బహుజనులకు న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. ఆ లోటు తీర్చాల్సిన అవసరమున్నది. అందుకు యువతరం ముందుకు రావాలి. 

Author

Spread the love

కుప్పిలి పద్మ

1 వ్యాక్య

Leave a Reply to సబ్బని లక్ష్మీనారాయణ , కరీంనగర్ స్పందనను రద్దుచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!