అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది
నీ ఆహ్వానం లేకుండా
ఏ సంతోషమూ తలుపు తట్టదు
ముంగిట్లో వాలిన ఇప్పటి బాధకూ
ముందెప్పుడో నువ్వే వీసా ఇచ్చేసి వుంటావు
ప్రతి గాయమూ ప్రి-అప్రూవ్డే.
ఈ రహస్యం నీకూ తెలుసు:
చందమామ చీకటికే పుడతాడు
నక్షత్రమూ నీడా కవలపిల్లలు
దేవుడూ ఒంటరి కాదు
దేవుడి పాత్రను హైలైట్ చేయడానికి
ఓడిపోయే మనుషులు వుంటారు
ఒక సుఖం నీ ఛాయిస్ ఐనప్పుడు
లోపలెక్కడో
ఒక వాల్కనో కి పునాది పడుతుంది
కుండీలో మొక్కను నాటుతున్నప్పుడే
ఆకులు రాలే దిగులూ నాటబడుతుంది
ఒక ఉదయాన్ని డెలివరీ చేయడంతోనే
ఆకాశం పనైపోదు
రాత్రుల నిశ్శబ్దాన్ని పాటలు కడుతుంది
ఒక ప్రేమ కళ్ళు తెరుచుకుంటున్నప్పుడే
దిగులొకటి ప్రాణం పోసుకుంటుంది
అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది
తాళం తెరుచుకోవడంలో
చేతులు మెలిపడడం అంతర్భాగమే
శ్రావణానికి రాసిన ప్రేమలేఖ
రాలిన పువ్వులు మిగిల్చే దుఃఖానిక్కూడా అందుతుంది.
ధన్యవాదాలు మేడం.