ఇచ్ఛామతి

పల్లిపాలెం

పల్లిపాలెం అంటే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్రీకుటీరం సాహిత్య ప్రపంచానికి చప్పున గుర్తుకొస్తుంది. పల్లిపాలెం అంటేనే ఆంధ్రీకుటీరంగా, ఆంధ్రీకుటీరం అంటేనే పల్లిపాలెంగా ప్రసిద్ధి చెందాయి. కళాప్రపూర్ణ మధునాపంతుల  సత్యనారాయణ శాస్త్రి  గారు ఆంధ్రీకుటీరం వ్యవస్థాపక అధ్యక్షులయితే  వర్తమాన  ఆధ్యక్షులు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి గారు. వారితో  ‘ఇచ్ఛామతి’  సంభాషణ.

జ. అవునండి మా వూరు పల్లిపాలెం. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం (కాకినాడ జిల్లా) కాజులూరు మండలం వుంది.   బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు ఫిర్కా  పల్లిపాలెం అనేవారు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామానికి రెవెన్యూ హెడ్ క్వార్టర్ అన్నమాట. అత్యధిక  రెవెన్యూ వసూలయ్యే ప్రాంతాల్లో ఈ కార్యాలయం ఉండేది. దాన్నే కచేరి సావిడి అని అంటారు. ఇప్పుడు పంచాయతీ కార్యాలయంలో విలీనం చేశారు. ఈ గ్రామంలో చింతపల్లి అచ్చిరెడ్డి, పెనుమల్లు మూలారెడ్డి, కాజులూరి కేదార రెడ్డి అనే సంపన్న భూస్వాములు ఉండేవారు.

జ. పల్లిపాలెం లో ఒక్క మత్స్యకార కుటుంబం కూడా లేదు.ఇది 1870,75 మధ్యకాలంలో ఇది ఇంజరం ఎస్టేట్లో ఉండేది. చుట్టుపక్కల గ్రామాలు దానిలో ఉండేవి. ఇంజరం 1823 నుంచి రాజమండ్రి జిల్లాలోనూ, 1859 గోదావరి జిల్లాలోనూ ఉండేది. 1925 నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చింది. మధునాపంతుల మల్లయ్య శాస్త్రి గారు శ్రీకాళహస్తి నివాసి. శైవులకు, వైష్ణవులకు చెలరేగిన గొడవలు తట్టుకోలేక దంగేరు గ్రామం 1820, 30 ప్రాంతాలలో వలస వచ్చారు. దంగేరు ద్రాక్షారానికి సమీప గ్రామం. అక్కడ రాయపాటి వారి సంస్థానంలో సలహాదారుడిగా ఉద్యోగం చేసేవారు. వారికి శేషాద్రి శాస్త్రి అనే కుమారుడు ఉండేవాడు. మల్లయ్య శాస్త్రి గారి మరణానంతరం తండ్రి ఉద్యోగం శేషాద్రి శాస్త్రి గారు నిర్వర్తించేవారు. శేషాద్రి గారికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సుబ్బయ్య, చిన్నవాడు సూరయ్య. సుబ్బయ్య గారు వ్యవహారవేత్త, సూరయ్య గారు గొప్ప సంస్కృతాంధ్ర పండితులుగా దంగేరు మరియు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పేరు పొందారు. పల్లెపాలెం మత్స్యకార గ్రామం కాదనుకున్నాం కదా! గ్రామంలో పల్లి, లచ్చి అని ఇద్దరు అప్పచెల్లెళ్ళు  ఉండేవారు. వారు కరుణామయులు ఒకానొక సమయంలో మల్లం కోటను పరిపాలించే ప్రభువు తల దాచుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆ అప్పచెల్లెళ్ళు ఆయనను రక్షించారు. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న మల్లం కోట ప్రభువు ఆపద సమయంలో కాపాడిన పల్లికి, లచ్చికి చెరొక  గ్రామాన్ని ధారాదత్తం చేశాడు. అలా పల్లి కి ఇచ్చిన  గ్రామం పల్లిపాలెం గానూ, లచ్చికిచ్చిన గ్రామం లచ్చిపాలెం గానూ పేరు పొందాయి. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి.

జ. నా నేపథ్యం సారస్వత నేపథ్యం. మా తాత మధునాపంతుల సత్యనారాయణ మూర్తి. రచయిత, ఆయుర్వేద వైద్యుడు. భిషగ్రత్న బిరుదాంకితుడు. మా ముత్తాత (తల్లితాత) పిఠాపురం ఆస్థాన కవి వెంకటరామ కృష్ణ కవులలో ఒకరైన ఓలేటి వెంకట రామశాస్త్రి గారు. మా పెద తండ్రి మధునాపంతుల  సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర పురాణకర్త. మా తండ్రి మధునాపంతుల సూరయ్య శాస్త్రి గారు దేవీ నవతి కృతికర్త (మూక పంచశతి అనువాదం) ఇటువంటి వాతావరణంలో 1952 జనవరి 13 మాతామహస్థానం పిఠాపురంలో పుట్టాను. మేము నలుగురు అన్నదమ్ములం, నలుగురు అప్పచెల్లెల్లు. భార్య విజయలక్ష్మి మేనమామ కూతురు. మా పెద్దమ్మాయి  మధూళిక.

డిగ్రీ చేసి, హోం మేకర్. మా రెండో అమ్మాయి రత్న కలికి తెలుగు ఎం ఏ చేసి ఆంధ్రి పత్రికల పై యం.ఫిల్ చేసి పట్టా పోంది ఇప్పుడు పీహెచ్డీ చేస్తోంది. నాకు ఇద్దరు మనవులు.  ఇద్దరు మనవరాళ్ళు.

జ. ఆంధ్రీకుటీరం 1938 జనవరి 13న ప్రారంభం అయింది. ప్రస్తుతం నేను నివసిస్తున్నది ఆ ఇంట్లోనే (ఆంధ్రీకుటీరంలోనే) ఆంధ్రీకుటీరం రూపశిల్పి మధునాపంతుల తన 17వ ఏట ఈ సంస్థ ప్రారంభించారు.

జ. ఆంధ్రీకుటీరం ప్రారంభించినప్పుడు మధునాపంతుల వారు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్నారు. వాటిలో మొదటి  లక్ష్యం గ్రంథాలయం  ఏర్పాటు. రెండో ముఖ్య లక్ష్యం  దళితులకు సంస్కృత విద్యా బోధన. మూడవది గ్రామంలో యువతని సాహిత్యం వైపు మళ్ళించడం. నాలుగవది వారానికి ఒకసారి ఏదో ఒక పుస్తకాన్ని లేదా రచయితను పరిచయం చేయడం. ఐదవది  అగ్రహారానికి చెందిన యువత ఊళ్లో జరిగే కోడి పందాలు, ఇతర జూదాలకు అలవాటు పడకుండా వారిని దారిలోకి తేవడానికి ఒక వేదికగా ఆంధ్రీ మాస పత్రికని  ప్రారంభించారు.

జ. చాలా వరకు సాధించిందనే చెప్పుకోవాలి. ఇల్లంతా సాహిత్య వాతావరణం ఏర్పడింది. ఆంధ్రి పేరుతో పత్రిక స్థాపించడం జరిగింది. దీంట్లో ఆనాడు ప్రసిద్ధులైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా వంటి ప్రసిద్ధుల రచనలు ప్రచురింపబడ్డాయి.    

జ. ఆంధ్రి మూడు సంవత్సరములు మాత్రమే నడిచింది. అంటే 36 సంచికలు మాత్రమే వచ్చాయి. ఈ 36 సంచికల్లోనూ సంపాదకుడుగా మధునాపంతుల శాస్త్రి  వారు ప్రతినెలా ఒక రచయితను పరిచయం చేసేవారు. ఆంధ్రి మూతపడినా శాస్త్రి గారి  రచనా వ్యాసంగం కొనసాగింది. ఆంధ్రి లో ప్రచురితమైన  వ్యాసాలు అనంతర కాలంలో ‘ఆంధ్ర రచయితలు’ గా వెలువడింది. ఈ సాహిత్య పరామర్శ గ్రంధాన్ని 1944వ సంవత్సరంలో 44 మంది కవుల చరిత్రతో ప్రచురించారు. 1950లో నూటొక్క మంది సాహితీమూర్తుల వైభవాన్ని ఆవిష్కరించే ఆంధ్ర రచయితల సమగ్ర గ్రంథం వచ్చింది. అనంతరం 40 సంవత్సరాలకు తృతీయ ముద్రణ గా 113 మంది సాహితీమూర్తుల వైభవాన్ని సహృదయ పాఠకులకు అందజేశాం.

జ. 1970లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా అడుగుపెట్టాను. ఆ కాలంలో పెదనాన్నగారు దగ్గరికి సుప్రసిద్ధులైన కవులు, రచయితలు వచ్చి వెళ్తూ ఉండేవారు. నాకు తరచూ అనారోగ్యం, అశ్రద్ధలవల్ల చదువుతప్పి ఇంటికి చేరాను. ఆ సమయంలో మా తండ్రిగారు భాషా ప్రవీణ ప్రవేశపరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేవారు. నేను వారితో కూర్చుని రఘువంశం మొదలైనవి ఆసక్తిగా వినేవాడిని. క్రమేణా సంస్కృత సాహిత్యం, తెలుగు సాహిత్యం పట్ల ఉత్సుకత పెరిగింది. ఆ విద్యార్థులతో పాటు నేను పరీక్ష కట్టి పాసయ్యాను. దానితో ఆంగ్ల విద్య పక్కకి తప్పుకొని భాషా ప్రవీణ విద్యార్థిని అయ్యాను కాకినాడలో. అక్కడ రెక్కలు విచ్చుకుని భాష, సంస్కృతి, సంప్రదాయం, ఛందో వ్యాకరణాలు నా ముంగిట వాలాయి. ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేకపోవడం వల్ల ఆడుతూ, పాడుతూ చదువుకున్న. అటు అభ్యుదయ సాహిత్యం ఇటు సంస్కృత వాజ్ఞ్మయం పరిచయమయ్యాయి.

జ. చదువుకోవటం ఎంత ఇష్టమో రాయడం కూడా నాకంటే ఇష్టం. డెభై వ దశకంలో మొదటి కవిత నీలిమ అనే పత్రిక లో ప్రచురింపబడింది. అది మొదలు భారతి,ప్రభ, జ్యోతి మొదలైన అనేక పత్రికలో కవిత్వం, వ్యాసాలు రాసాను.అవన్నీ నాకు తృప్తినిచ్చిన రచనలే.భారతిలో మఱ్ఱి చెట్టు అనే రెండు పేజీల కవిత ప్రచురించారు.అలాగే జ్యోతి వారపత్రిక లో ఈవారం కవిత గా పందిరి మంచం ప్రచురించ బడింది.ఈ రెండు కవితలు కవిత్వ ప్రేమికుల, విమర్శకుల ప్రశంసలు పొందాయి.

 ఎనభై వ దశకం ఉత్తరార్ధంలో నేను నాకు గల మగబిడ్డ ను పోగొట్టుకున్నాను.ఇద్దరమ్మాయిలకు నడుమ వాడు.దాన్నించి తేరుకోలేని తనం నన్ను, రచనలకూ, సభలకూ దూరం చేసింది.

 తొంభై ఆరు దాకా నేను సుప్తావస్ధ లో ఉండగా మా పెద్ద నాన్న గారి పెద్ద కొడుకు పల్లి పాలెం వచ్చి, నన్ను ఓదార్చి, మందలించి అప్పటిదాకా ప్రచురించిన కవితలన్నీ ఒక చోట చేర్చి “పరంపర” పుస్తకం రావడానికి కారణం అయ్యాడు. దాదాపు పదేళ్ల పాటు కవిత్వం దూరం కావడం నాకు తీరని నష్టం కలిగించింది.

‘పరంపర’ తరువాత ‘నాన్న కుర్చీ’ ‘రిక్తాంజలి’ కవితా సంపుటాలు, ‘సుజలాం’ దీర్ఘ కవిత ని, ”ఝాన్సీ’ మజిలీ కథలు. యాత్రాసాహిత్యాన్ని ఆంధ్రీకుటీరం తరఫున  ప్రచురించాం. ఇందులో ‘పరంపరకు’ సరసం అవార్డు లభించింది.

ఇక వృత్తి విషయానికి వస్తే భాషా ప్రవీణ,పండిత శిక్షణ కాగానే ఒకటి రెండు చోట్ల పత్రికారంగ లో అవకాశాలు వచ్చాయి.అవన్నీ మా తండ్రి కి ఇ‌ష్టంలేదు . ఆయన కు ఉద్యోగం సమీపంలో నే చేయాలి అనే కోరిక.నా విద్య అంతా కోలంక దంతులూరి వేంకట రాయప రాజా ఎయిడెడ్ ఉన్నత పాఠశాల లో జరిగింది.అక్కడే ఉద్యోగం దొరికింది.ఎయిడెడ్ వ్యవస్థ కావడంతో మా తండ్రి గారి మాట చెల్లుబాటు కావడం వల్ల అలా ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడు గా చేసాను. ఆ సమయంలో ప్రభుత్వం వారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి గౌరవించారు. తర్వాత మరే అవార్డు లకు దరఖాస్తు చేయలేదు.

నాకు పాఠం చెప్పిన ఉపాధ్యాయులతో సహోద్యోగి కావడం, నా దగ్గర చదువు కున్న విద్యార్థులు నాకు సహోద్యోగులు కావడం జరిగింది.

రెండు వేల ఒకటి లో మా పాఠశాల స్వర్ణోత్సవ సంవత్సరం ఆ సందర్భంలో స్వర్ణ భారతి అనే ప్రత్యేకత సంచిక సంపాదకత్వం మరచి పోలేని జ్ఞాపకం. కోలంక పాఠశాల లోనే ఉద్యోగ విరమణ జరిగింది.

జ.  మా తాత ముత్తాతల నుండి అన్నదమ్ముల మధ్య అనురాగం, ఆప్యాయతలు మెండు. ఆస్తుల పంపకాలలో గాని, ఇతర వ్యవహారాలలో గాని అన్నదమ్ముల మధ్య విరోధాలు, వైరాలు ఉన్నట్టు నాకు తెలియదు. కళా ప్రపూర్ణ మధునాపంతుల ఆంధ్రపురాణం అవతారికలో తన తమ్ముడు, మా తండ్రి అయిన సూరయ్య శాస్త్రి గారితో గల అనుబంధాన్ని ఒక పద్యం లో చెప్పారు.

తొలి మేల్ త్రోవలు నేటి సంస్కృతులరీతుల్ లెస్స గుర్తించి, నాతలలో దీయని నాల్కగా మెలగు సోదర్యుండు ‘సూరయ్య శాస్త్రులు’ నా తీర్చెడి సర్వ బంధములయందుం గొంత చేదోడుగా జెలగున్, వాని కానమయాయువు మదాశీ రక్షత ల్వోయుతన్! ఈ పద్యం సత్యనారాణ శాస్త్రి గారికి, సూరయ్య శాస్త్రి గారికి గల అనుబంధాన్ని చాటుతుంది.

మేము నలుగురు అన్నదమ్ములం నేను పెద్దవాడిని. భాషా ప్రవీణ M A చేసి తెలుగు పండితుడుగా  ఉద్యోగించి విశ్రాంతి పొందుతున్నాను. నా తరువాతి వాడు చలపతి డిగ్రీ చదివి ఆర్ ఎం పి శిక్షణ పొంది వైద్యుడిగా పల్లిపాలెంలోనే స్థిరపడ్డాడు. చలపతి మంచి చదువరి కవిత్వ ప్రేమికుడు. కొన్ని కవితలు రాశాడు కూడా. తర్వాత వాడు శ్రీనివాస రామచంద్ర ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ యానంలో స్థిరపడ్డాడు. చిన్నవాడు కామేశ్వర శర్మ యానంలో ఆయుర్వేద మందుల షాపు నిర్వహిస్తూ స్థిరపడ్డాడు. వీరందరూ ఆంధ్రీ కుటీరం నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వీరు’ కాక కిరణ్ మధునాపంతుల మరో తమ్ముడి కింద లెక్క. కిరణ్ తాతగారు పల్లెపాలెం గ్రామ సర్పంచ్ గా రెండు దశాబ్దాలు పనిచేశారు. ఈ ఊరికి దారి, తెన్ను ఏర్పరిచారు. తాతగారి స్ఫూర్తి, ప్రభావం కిరణ్ మీద ఉంది. అలాగే మా తండ్రిగారు సూరయ్య శాస్త్రి గారి ప్రభావం అతడి పై ఉంది. పీజీ కాగానే ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారస్తుడిగా ఎదిగాడు. తండ్రి, మాతామహుడు, మాతామహి (అమ్మమ్మ తాతయ్య) సాహిత్య నేపథ్యం కలిగిన వాళ్లు, సృజన చేసిన వారు ఇలాగ మధునాపంతుల కుటుంబం ఒక బలమైన సాంస్కృతిక సాహిత్య నేపథ్యం కలిగి పల్లిపాలెంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబం.

జ. నాలుగేళ్ల క్రితం మధుశ్రీ కథా గౌరవ సభ జరిపి కథా రచయితలను గౌరవిస్తున్నాం. ఇరవై వేల రూపాయలు చొప్పున ఇద్దరికి పది వేల రూపాయలు కొత్తగా కథల పుస్తకం రచించిన వారికి ఇచ్చి సభ జరుపుతున్నాం. ఇది ఏటా ఫిబ్రవరి తొమ్మిదిన జరుగుతుంది. నిరుటి నుంచి ప్రభా గౌరవ సభ జరిపి సాహిత్య సామాజిక రంగాల్లో సేవ చేస్తున్న వారికి ఒక పురస్కారం, కవి సమ్మేళనం, కావ్య పఠనం లాంటివి చేయడం మొదలుపెట్టాము. ఈ సభలకు పరిసర గ్రామాల,నుండి దూర ప్రాంతాల నుండి ఎందరో సాహిత్యాఅభిమానులు హాజరవుతారు. 

                    –  పల్లిపాలెం గురించి ఇక్కడ  సాహిత్య విషయాల్ని ‘ఇచ్చామతి’ తో  పంచుకున్నందకు హృదయ పూర్వక  కృతజ్ఞతలు.   

                                                                                                         ***

Spread the love

2 వ్యాక్యలు

Leave a Reply to మధునాపంతుల సత్యనారాయణ మూర్తి స్పందనను రద్దుచేయండి

  • మధునాపంతుల సత్యనారాయణ మూర్తి says:

    ధన్యవాదాలు.పల్లిపాలెంలో నాకు తోచిన విధంగా సాహిత్య సేవ చేస్తున్న నన్ను ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.మీకు ఇచ్ఛామతి బృందానికి కృతజ్ఞతలు.

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!