ఇచ్ఛామతి

కన్నీళ్ళు

రాప్తాడు గోపాలకృష్ణ కర్నూలు జిల్లా రచయిత. 
తుమ్మల రామకృష్ణ, శ్రీనివాస మూర్తి వంటి రచయితలతో పల్లె మంగలి కథలుసంకలనం తీసుకువచ్చాడు. "అతడు బయలుదేరాడు" అతని కథాసంపుటి.. చాలా చిన్న వయసులోనే మరణించాడు.

ఎండలు!

అగ్గి కురిసే ఎండలు!!

వర్షాలు లేక పొయ్యిమీద పెనంలా కాలిపోయే నేల.

జొన్నగింజ పడితే పేలగింజ అయ్యేంత వేడి.

కొన్నాళ్లు ఇట్లే సాగితే “రాజస్తాన్‌లో థార్ ఎడారి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం ఎడారి వుంది.” అని పాఠాలు చదువుకుంటారు పిల్లలు.

తాగడానికి కూడా కరువయ్యాయి నీళ్ళు పంటల సంగతి సరేసరి. పాతాళంలోనే తడి ఆరిపోయింది. బోరింగులకి కూడా నీళ్ళు అందటం లేదు.

ప్రతి వీధిలోనూ కొళాయిల ముందు పాత బిందెలు, పగిలిన బకెట్లు, డబ్బాలు వరుసగా వుండి పురావస్తు ప్రదర్శనలా దర్శనమిస్తాయి. ఈ ప్రదర్శన ఏర్పాటు చేయటానికి జనాలు నానాతంటాలు పడుతుంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి అరువు తెచ్చుకుంటారు. లేకపోతే పాత సామాన్లు అమ్మేవాడి దగ్గరికి పరుగులు పెడతారు. పెట్టక ఏం చేస్తారు మరి ?

కొళాయి వచ్చిన రోజు వున్న బిందెలూ, బకెట్లూ, డబ్బాలు కూడా నీళ్ళతో నింపుకుంటారు. తరువాత మూడు నాలుగు రోజులదాకా కొళాయిరాదు. వంతుకి పెట్టడానికి బిందెలు లేక పాత బిందెల సేకరణ మొదలు పెడతారు.

కొళాయి వచ్చినరోజు మా వీధిలోనే కాదు, ఏ వీధిలో చూసినా తిరునాళ్ళలా వుంటుంది.

పాల సముద్రాన్ని చిలికిన తరువాత అమృతం వెలువడినప్పటికంటే రెండు రెట్లు కోలాహలంగా వుంటుంది కొళాయిలో నీళ్ళు వస్తున్నప్పుడు.

ఆనాడు అమృతాన్ని దేవతలే మింగేశారు కానీ, రాక్షసులకి దక్కనివ్వలేదు. కొళాయిల దగ్గర మాత్రం రాక్షసులే నీళ్ళు పట్టగలుగుతారు. దేవతలు మాత్రం బిందెలనిండా నిరాశను నింపుకొని బరువుగా వెళ్తారు.

కొళాయిలకి ఒక టైమూ, పాడూ వుండదు. ఏ అర్థరాత్రయినా రావచ్చు. తెల్లవారి రావచ్చు. మిట్ట మధ్యాహ్నం రావచ్చు. ఎప్పుడొచ్చినా పరుగెత్తాల్సిందే.

రాత్రిపూట రోజూ జాగరణే నీళ్ళ కోసం. కొందరైతే ఏకంగా కొళాయి దగ్గరే మంచాలు వేసుకొని పడుకుంటారు.

ఉన్నట్లుండి ఏ మధ్యాహ్నమో, అర్ధరాత్రో కొళాయి దగ్గర కలకలం రేగుతుంది. నిద్రపోతున్నవాళ్ళం గబగబా లేచి బిందెలు తీసుకొని పరుగెత్తుతాం. నీళ్ళు వస్తుండవు అక్కడ. వంతుకి పెట్టిన బిందె కనబడలేదనో, వెనక్కు జరిపినారనో కొట్లాడుతుంటారు. ఉస్సూరంటూ వెనక్కు తిరిగివస్తాం.

పిల్లలు నీళ్ళు బుడబుడా పోసేస్తే, చాలా కఠిన శిక్షలు విధిస్తుంది మా ఆవిడ. ఆమె కోపం అర్థం చేసుకొని నేను కూడా చాలా జాగ్రత్తగా వాడుతుంటాను. ఎసట్లోకి నీళ్ళు ఎక్కువ పోస్తే గంజి రూపంలో వృథా అవుతాయని సరిఎసరు పెడుతుందామె. పిల్లలు తాగి పారేస్తారని తానే టానిక్కులా జాగ్రత్తగా తాపుతుంది. స్నానానికి పిల్లలకి అరబకెట్టు, పెద్దలకి ముక్కాలు బకెట్టు, తలకయితే పూర్తి బకెట్టు రేషన్ పద్ధతిలో కేటాయిస్తుంది.

* * *

ఎండల భారతంలో, నీళ్ళ భాగోతంలో ప్రజలు వుక్కిరి బిక్కిరి అవుతుంటే మధ్యంతర ఎన్నికల రామాయణం కూడా తోడయ్యింది – ప్రాణాలు తీయటానికి.

పెద్ద పెద్ద నాయకులు, సినీ స్టార్లూ ప్రచారం సాగిస్తున్నా సభలకి ప్రజలు వెళ్ళటం లేదు. చెప్పిన టైముకి వస్తున్న నాయకుల సభలకి టైము చెప్పకుండా వచ్చే కొళాయిలను విడిచిపెట్టి ఎవరు వెళ్తారు!

ఎన్నికల ఆకర్షణలో భాగంగా మా ఇంటి ముందున్న ఇక్ష్వాకుల కాలంలో వేసిన రోడ్డు రిపేరికి నోచుకుంది. మా సాయినగర్ వీధి మొత్తం తార్రోడ్డు వేస్తున్నారు. వీధి చివర మొదలుపెట్టిన రోడ్డు పని ఒక మూడు రోజులకి మా ఇంటి ముందుకొచ్చింది.

తెచ్చుకున్న సద్దిమూటల్ని, అంగీలు, పంచెలు అనబడే చినిగిన గుడ్డపేలికల్ని చిన్నపిల్లల్ని మాయింటి ముందున్న వేపచెట్టుకింద భద్రపరిచారు కూలీలు.

రోడ్డులోకెళ్ళి బట్టలకి తారుపూసుకోకుండా ముందుగానే పిల్లలకి వార్నింగ్ ఇచ్చింది మా ఆవిడ. పిల్లలిద్దరూ కిటికీ చువ్వల్ని పట్టుకొని చూస్తున్నారు రోడ్డు పని. ఆదివారం కావటంతో నేను కూడా ఏదో రాసుకుంటున్నాను.

వీధిలోకెళ్ళొచ్చిన మా ఆవిడ “ఏమండి ఇలా రండి” అంది.

“ఏం?” అంటూ వెళ్ళాను.

“ఎండకి కాళ్ళు కాల్తుంటే వాళ్లెంత అవస్థపడుతున్నారో చూడండి” అంది.

కూలీలు దిబ్బలో పడిన పాత చెప్పులు వెతుక్కుంటున్నారు. తెగిపోయిన వాటికి దారాలు కట్టుకొని వేసుకుంటున్నారు.

కడుపులో కెలికినట్లయింది నాకు.

గొడుగు కింద నిలబడి “ఆ …….. కంకర బిరింగ అందుకోండి” ఆజ్ఞాపిస్తున్నాడు కాంట్రాక్టరు.

రోడ్డుకి ఒక పక్క పొయ్యి తవ్వి పెద్ద పెనంలో తారు వుడికిస్తున్నారు. నల్లటి బుడగల్తో కుతకుతమని వుడుకుతోంది.

కొంతమంది వుడికిన తారుని, కంకరని రోలరులో తిప్పి ఆ మిశ్రమాన్ని తట్టలకెత్తుతున్నారు. మరికొంత మంది ఆ కాలుతున్న మిశ్రమాన్ని పరుగెత్తి మోసుకొంటూ రోడ్డు వేస్తున్నారు. ఆ కూలీల్లో స్త్రీలు సైతం పని చేస్తున్నారు.

ఎర్రటెండలో వాళ్ళు పని చేస్తుంటే నరకాన్ని కళ్ళ ముందు చూస్తున్నట్లు ఉంది.

“ఎంత కర్మజీవులండీ” పెదవి విరిచింది. మా ఆవిడ ఎలా గమనించిందో చెప్పులు లేకుండా పని చేస్తున్న ఒక అమ్మాయిని పిలిచి లెట్రిన్ కెళ్ళే చెప్పులు ఇచ్చింది.

ఆ అమ్మాయి చెప్పులు తీసుకుంటూ “మామ్మ దేవతలట్లాటిదీ” అని కృతజ్ఞతగా చూసి వెళ్లింది.

రోడ్డు దుమ్ము, తారు వాసనా ఇంట్లోకి వస్తుంటే తలుపు వేశాము.

మధ్యాహ్నం ఒక గంట అయింది.

మా ఆవిడ కూరలు తరుగుతోంది.

నేను నవల చదువుతున్నాను.

తలుపుకొట్టిన శబ్దమయితే మా ఆవిడ చూసింది. ఎదురుగా రోడ్డు పని చేసే అమ్మాయి పొద్దున మా ఆవిడ చెప్పులిచ్చిన అమ్మాయి అప్యాయతతో కృతజ్ఞతతో చూస్తు కడపలో ఉంది.

“ఏమ్మా” అంది మా ఆవిడ

సంగటి తినేదానికి కుచ్చొన్నామమ్మా తాగేదానికి అరకడవ నీళ్ళు ఇయ్యమ్మ. బోరింగ్ పోయింది. వేరే బోరింగ్ చానా దూరంలో ఉంది. వేరే అంది ఆ అమ్మాయి.

ఎదురుగా చెట్టుకింద చద్దిమూటలు తింటున్న కూలీలు కనిపిస్తున్నారు.

మా ఆవిడ గుటకలు మింగుతుంది. చెప్పలేక సతమతమౌతుంది.

నాకర్థం అయిపోయింది. ఇంట్లో ఉన్నదే అర బిందె నీళ్ళు. బాత్ రూమ్‌లో కూడా ఎక్కువ లేవు. రేపు కొళాయి వస్తుందో రాదో నమ్మకం లేదు.

ఉన్న నీళ్ళు ఇవ్వలేక, “నీళ్ళు లేవు అని చెప్పలేక ఉన్న స్థితిలో మా ఆవిడను చూస్తే జాలేసింది నాకు.

చివరికి ‘కొళాయి రాలేదు నీళ్ళు లేవు” అని చెప్పింది గబగబా.

చిన్నబుచ్చుకొన్న మొహంతో కడవను చంక బెట్టుకొని వెళ్ళింది ఆ అమ్మాయి.

వెళ్తూ వెళ్తూ లెట్రిన్ బయట మూలకు పెద్ద బానలోకి తొంగి చూసింది. ఆ అమ్మాయి ముఖం వికసించింది.

“అమ్మమ్మా ఈ బానలో నీళ్ళు తోడుకుందునా ?” అని అడిగింది.

“అయ్యో అవి లెట్రిన్ నీళ్ళు” అంది మా ఆవిడ.

“ఉన్నీలేమ్మా యావో ఒగటి తాగుతాము. నీళ్ళు లేనప్పుడు” అంది ఆ అమ్మాయి.

“వద్దు వద్దు దొడ్డి చెంబులు ముంచిన నీళ్ళు తాగకూడదు. రోగాలు వస్తాయి” అంది మా ఆవిడ.

“కన్నిగుండాయిలేమ్మా” అంది ఆ అమ్మాయి

“వద్దమ్మా అవి తాగకూడదు” అంది మా ఆవిడ అనునయంగా

“ఉన్నీలేమ్మా నీళ్ళు యాడా దొరకవు” అక్కడున్న చెంబును తీసుకొని నీళ్ళు తోడుకోటానికి సిద్ధమయింది ఆ అమ్మాయి.

“చెప్తుంటే వినపల్లేదా! నీళ్ళు లేవూ ఏమీ లేవు ఫో ఇక్కన్నుండి” ఈసారి కోపంగా అంది మా ఆవిడ.

ఆమె మొహంలో ఆప్యాయత స్థానంలో కఠినం చూసి మౌనంగా వెళ్ళింది ఆ అమ్మాయి. మా ఆవిడ కూడా మొహం తిప్పేసుకుని గబగబా లోపలికెళ్ళింది.

ఆమె కళ్ళకొనల్లో మెరుస్తున్న కన్నీటి తడి నా చూపుల నుండి తప్పించుకోలేకపోయింది.

(24-7-91 ఆంధ్రప్రభ, వారపత్రిక)

.

గోపాలకృష్ణ రాసిన కన్నీళ్లు కథలో  ఇతివృత్తం చాలా బలమైనది.. 

ప్రాణాపాయ స్థితిలో త్రాగునీరు, సాగునీరు, మురుగునీరు విభజనకు తావులేదు.

 నీళ్లు లేని ఎడారిలో కన్నీరైనా త్రాగి బతకాలి అన్నాడు కదా కవి. నాలుక పిడచకట్టుకుపోయి గొంతెండిచస్తున్నప్పుడు కాస్త తడి తగలడమే ఉపశమనం. 

నీళ్లని మినరల్ వాటర్ అని టాయిలెట్ వాటర్ అని నాగరికల విభజనని కూలి బాలిక తోసిపుచ్చే ప్రయత్నం చేసింది.

నీరు ప్రాణాధారం కదా. గుక్కెడు నీళ్ల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకు చచ్చే దుర్దినం ఎంతో దూరం లేదనిపిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీళ్ల కోసమే.. సందేహం లేదు
Spread the love

జి.ఎస్.చలం

పుట్టింది కొత్తపల్లిలో. పాఠశాల విద్య పార్వతీపురంలో. పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో కళాశాల విద్య, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య.
వృత్తి: విజయనగరం జిల్లాలో మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషా బోధన.
రచనలు:
రజకుల జీవిత నేపథ్యంలో" రేవు" నవల, కళింగాంధ్ర మాండలిక పదకోశం, మృచ్ఛకటికం (అనువాదం), కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు, భూషణం మోనోగ్రాఫ్, కళింగాంధ్ర కవితా సంకలనం "తిత్తవ"కు భూషణం సమగ్ర కథా సంపుటికి సంపాదకత్వం.

నటుడు, దర్శకుడు.
సంపూర్ణ కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు, సంక్షిప్త నాటకంలో రామప్ప పంతులు పాత్రలు ధరించి దర్శకత్వం వహించారు. కొన్ని వ్యాసాలు రాశారు. ప్రసంగాలు చేసారు.విద్యార్థుల్లో భాషా సాహిత్యాల పట్ల అభిరుచి కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!