ఇచ్ఛామతి

పొరిగింటి పరిమళం -1

చీనా కవయిత్రులలో పేరొందిన కవయిత్రి త్సు యెఁ. ఈమె క్రీ.శ.3-4 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు.ఈమె ఒక పానశాలలో మద్యం విక్రయించే వృత్తిలో పని చేసింది.ఆ రోజుల్లో చైనాలో మద్య విక్రయశాలల్లో పని చేసే యువతులు సహజంగా వేశ్యలుగా వుంటారు.కళలలో నిపుణులుగా వుంటారు.త్సు యెఁ తన వృత్తిలో భాగంగా కళాత్మకంగా వుండే సొగగసైన చేతిరాతలో శిక్షణ పొందింది. అంతేగాక నాట్యం,చరిత్ర, సంగీతం,మర్యాద,కథలు చెప్పడం మొదలయిన వాటిలో కూడా కఠిన శిక్షణ పొందింది.వృత్తిలో భాగంగా ఆమె చలాకీగా,తెలివిగా,ఎవరినైనా రంజింపచేసే విధంగా వుండాలి.దేనినైనా కవితగా మలచగలగాలి.

త్సు యెఁ కవిత్వాన్ని బట్టి చూస్తే ఆమె వివిధ సమయాలలో వివిధ పురుషుల ప్రేమలో పడుండాలి లేదా వారందరినీ ఒకే ఒక ఊహాత్మక రూపంగా ‘ అతడు ‘ లేదా ‘ నువ్వు’ అని సంభోదిస్తూ ఆమె కవిత్వం రాసి వుండాలి.ఆమె కవిత్వంలో ఉత్సాహం, విరహం, ఎడబాటు, ఆశనిపాతం, నిరాశ, శృంగారం కనిపిస్తూ వుంటాయి.బహుశా ఆమె తన ఊహాత్మక ప్రియుని పొందలేకపోయిన ప్రతిఫలనం ఆమె కవిత్వంలో కానవస్తుంది కావచ్చు.ఆమె రాసిన కవితలు / గీతాలు 115 వరకు లభ్యమవుతున్నాయి.

Kenneth Rexroth సంకలనం చేసిన Women Poets of China లోనూ, Sam Hamill సంకలనం చేసిన Crossing the Yellow River, The Lotus Lover లోనూ త్సు యెఁ కవితలు చోటు చేసుకున్నాయి.

చీనా కవిత్వంలో మరో సుప్రసిద్ధ కవయిత్రి లి చింగ్ చావోతో సరిసమానంగా త్సు యెఁ ను పరిశోధకులు భావిస్తున్నారు.

1972 లో Lenore Mayhew & William McNaughton లు చీనా లోంచి ఇంగ్లిషు లోకి అనువదించిన The Love Poems of Tzu Yeh – ‘ The Gold Orchid ‘ పుస్తకంలో త్సు యెఁ కవిత్వం లభ్యమవుతున్నది.

1.పంకజ ప్రియుడు

—--------------------


స్వచ్ఛ నీలికెటాల మీద పచ్చని పంకజ పుష్పం :

పూలు తాజాగా, ఎర్రగా ఎదుగుతాయి.


ఈ అందమైన పూలని నీకు ఏరుకోవాలని వుందా ?

అయితే, నా పంకజ పూమొగ్గని నీకిస్తాను.



2.రాత్రంతా

—----------


చంద్రుని తెల్లని వెన్నెలలో

రాత్రంతా నిదురలేదు.


ఒంటరిగా ఆమె.

ఏదో అలికిడి వినొస్తోంది.

అతడు గాని పిలుస్తున్నాడా..?


ఆమె శూన్యంలో

బదులిచ్చింది.



3.వసంతానికి ముగింపు

—------------------------


నీ నిష్క్రమణ

వసంతాన్ని ముగింపుకు తెచ్చింది.


ఎదురుచూపు

ఎండాకాలపు వడగాలులలో కాలిపోతుంది.


నీకోసం ఇంకెప్పుడైనా నా దుస్తులు జారవిడుస్తానా?

ఇంక నా తలగడ నీ సుందర వదనాన్ని మోపగలదా?



4.నవ్వు

—-------


కొండ మీద

గోడలు లేని ఈ ఇంటిలో

గాలి నలువైపుల నుండి తాకుతుంది.


అవి నీ అంగీ ఊడేలా ఎగరగొడితే

నేను నవ్వును బిగబట్టుకుంటాను.



5.భ్రమలు

—---------

ఉజ్వల వెన్నెల కాంతిలో

అంతులేని రాత్రి.


ఎదురుచూసే నిదుర

ఎంతకీ రాదు.


అకస్మాత్తుగా అలికిడి.

నీ స్వరమేమోనని అనుకొని

నిను పిలుస్తాను.


నా గుండె

గొంతుకలోకి వస్తుంది.


నా ప్రతిధ్వని మాత్రమే

బదులిస్తుంది.


నా ప్రతిధ్వనే రాత్రి అంతటా వినపడతా

నన్ను ఎగతాళి పట్టిస్తుంది.



6.వసంతం మాయమయింది

—------------------------------


నన్ను నా హృదయవేదనకు వదిలేసి

వసంతం మాయమైంది.


ఇంతకంటే ఏ గ్రీష్మమూ

ఎక్కువ బాధకు గురిచెయ్యదు.


నా పడక పక్కన

ఎందుకీ పట్టుపరదాలు?


ఈ మెత్తని తలమెత్తలు

అలసిన శిరసులకు సాంత్వన ఇవ్వగలవా?



7.రొదన

—-------


సాగర సమీరాలకు

విల్లోచెట్లు వంగుతున్నాయి.

ఎంత వేగంగా కాలం కదిలిపోయింది!


ఎండాకాలానికి కొండకాటి పిట్టలు

స్వాగతం పలుకుతుంటే

చెట్లలో కీచురాళ్ళ రొదన.



8.మూడు గ్రీష్మ మాసాలు

—-----------------


ఈదురు గాలులతో

వడగళ్ళ వానతో

చలికాల ఆకాశం చల్లగా

కిందకి దిగింది.


కానీ ఈ మెత్తని బొంత కింద

మేము శృంగారం సలిపితే -

మూడు గ్రీష్మ మాసాల వేడిమి పుట్టిస్తాము.



9.మందలింపు

—--------------


ఆమె వీధిలో నీ వద్దకు వచ్చినప్పుడు

బహుశా వద్దని చెప్పలేవు.


కానీ నువ్వు నన్ను

నిర్లక్ష్యం చేయడం కొత్తేం కాదు.


ఖాళీ తలుపుల బందులు ఊడిపోతే

అవి మరలా ముందులా సరిగా అమరవు.



10.వసంతంలో ఒంటరిగా

—--------------------------


తరువుల గుండా ప్రజ్వలిస్తూ

వెన్నెల.

మేలిమి జిలుగు వస్త్రం మీద

పూలు వెలుగులీనుతున్నాయి.


ఒంటరిగా ఏకాంతంగా

మగ్గం పని చేసుకుంటూ

నీ గురించి ఆలోచించకుండా

ఎలా వుండగలను ?



11.చెప్పగలవా..?

—-----------------


మరలా రాత్రయింది.

నా శిరోజాలను

భుజాల మీదుగా విరబోసి

ప్రియునికెదురుగా

ఊరువులు బారచాపి

“నాలో ప్రేమాస్పదం కాని భాగం

ఏదో చెప్పగలవా?”అంటాను.



12.యవ్వన సౌందర్యం

—-----------------------


అదాటున వీచిన గాలికి

ఎండుకొమ్మలు సడిచేస్తాయి.

సంధ్య చిక్కబడుతుంది.

నా ప్రియుడు నన్ను ప్రేమిస్తాడు.

నా యవ్వన సౌందర్యం పట్ల

నేను గర్వపడతాను.



13.ఉత్తర దక్షిణాలు

—--------------------


వేల సంవత్సరాలుగా

స్థిరంగా వున్న ఉత్తర ధ్రువాన్ని నేను.

నువ్వు సూరీడులా చంచల మనస్కుడవు.

ఉదయం తూర్పున వుంటావు.

సాయంత్రం పడమరన వుంటావు.
Spread the love

శ్రీనివాస్ గౌడ్

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!