ఇచ్ఛామతి

కలిసి ఉన్న మనుషుల మధ్య, కొలవలేనంత దూరం వస్తుంది.

ప్రాణం హాయిగా అనిపిస్తుంది, ఆ హాయికి కారణమెవరో తెలియదు. కదిలే కాలం మీద ఇష్టం పుడుతుంది, ఆ ఇష్టం ఎవరి వల్ల వచ్చిందో బోధపడదు. క్షణంలోనే ఎంత పెద్ద సమస్యకైనా సమాధానం దొరుకుతుంది అంతటి తెలివి వెనక ఎవరి హస్తం ఉందో తేల్చుకోలేం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎవరో మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనిపిస్తుంది, అది ఎవరనేది గుర్తుపట్టలేం.

రోజులు గడిచాక వీటన్నీటికీ కారణమైన మనిషిని గుర్తుపడతాం. ప్రేమిస్తాం, అభిమానిస్తాం, ఇష్టపడతాం. హృదయంలోకి తీసుకుంటాం,లాలిస్తాం, అల్లరి చేస్తాం, ఆడుకుంటాం. కబుర్లు చెప్పుకుంటాం, దూరాల్ని చెరిపేస్తాం.

ప్రయాణం బావుంటుంది. గమ్యం లేదనుకుంటాం. మంచి కథని షార్ట్ గా ఫినిష్ చెయ్యడంలో expert దేవుడు. కథ ముగుస్తుంది. దూరం పెరుగుతుంది.

అప్పటివరకూ వాళ్ళకి దూరంగా ఉంటూ ఇదే లోకంలో బ్రతకగలమా అని భయపడిందంతా ఉట్టి భ్రమనీ, సోదనీ, సుత్తనీ తెలుస్తుంది.

అయితే కథ ముగిసిందనే అనుకుంటాం. ఇంకో కథ మొదలవుతుంది. విచిత్రంగా అది కూడా ముగుస్తుంది. మళ్ళీ ఇంకోటి . కథ మొదలవ్వకుండా, కథ పూర్తవ్వకుండా ఏం చెయ్యాలో అన్నీ చేస్తాం. కానీ ఏదీ వర్కౌట్ అవ్వదు.

సంవత్సరాలు గడిచాక. ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో గుర్తొస్తుంటారు. వారి ఆలోచనల నుండి దాక్కోడానికి ఎక్కడా చోటుండదు. కనిపిస్తూ మాయమవుతూ, కనిపిస్తూ మాయమవుతూ వాళ్ళే దాగుడుమూతలు ఆడుతుంటారు.

హాస్పిటల్లో జ్వరంతోనో ఇంకోదాంతోనో బాధపడుతున్నప్పుడు మాత్రం వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం.
మనకి కష్టమొస్తే తల్లడిల్లిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? మన దుఃఖాన్ని మనకంటే ఎక్కువ మోసినవాళ్ళు కనిపించరెందుకు?. ఆలోచిస్తాం. భయపడతాం. బాధపడతాం.

మన నవ్వు కోసం వెతుకుతూ వెతుకుతూ దారితప్పిపోయారా? వందల ఊహలు, వందల ప్రశ్నలు. వాళ్ళ జాడ కోసం వాళ్ళు వెళ్ళిపోయిన దారులవైపు అడుగులు వేయాలనిపిస్తుంది. కానీ అంతా బాగై ఇంటికి తిరిగొచ్చాక మాత్రం వాళ్ళని మర్చిపోతాం.

మళ్ళీ తీవ్రమైన సంతోషమెప్పుడో కలిగినప్పుడు వాళ్ళ జాడ కోసం ఆలోచిస్తాం.

ఒకానొక కాలంలో మనల్ని చూసుకున్న వాళ్ళూ, protect చేసినవాళ్ళూ, ప్రేమించిన వాళ్ళూ, మన నవ్వుకోసం మన రాక కోసం ఎదురుచూసినవాళ్ళూ, మనమే ప్రపంచంగా బ్రతికినవాళ్ళూ, మనతోటే జీవితమని నమ్మినవాళ్ళూ ఈ లోకం నుండి నిష్క్రమించినా మనకి తెలియకపోవచ్చు, మన మరణ వార్తా వారికి చేరకపోవచ్చు. ఎంత విషాదం.
Spread the love

Ravindra Ravella

కృష్ణనగర్ వీధుల్లో, నాన్న వచ్చిన వేళావిశేషం పుస్తక రచయిత. సామాజిక అంశాల మీద వివిరిగా కవిత్వం రాస్తుంటారు.  జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!