ఇచ్ఛామతి

జజ్జనక.. డెంకుపునం

నీ నుదుటిపై ఎర్రటి తిలకం
నా పాలిట పొద్దు పొడుపు

వాకిట్ల ముగ్గు లేస్తున్న
నీ కాళ్ల పట్టిల సప్పుడు
నా చెవులకు సన్నాయి స్వరం.

నీళ్ల బిందె నెత్తినెట్టుకునీ
నువ్ నడిచొస్తుంటే
నా గుండె గతుకుల రోడ్డు మీద సైకిలై
ఎగిరెగిరి పడుతుండే

లంగావోణీ కట్టుకున్న నిన్ను
చూస్తే
పచ్చ నరాల వరి చేను
పానం బోసుకుని నిలబడ్డట్టుండే..

నుగ్గులు ఏరాడానికో
వట్టి కందికట్టెల మోపూకో నీలిరంగు చీర కట్టుకుని బాయికాడికి వోతున్న నిన్ను చూస్తే
ఆ ఎండ పొద్దు
వాన చినుకులై సల్లబడింది యాదుందా?

సోమారం
సాయంకాలపు సంతలో
నేను కొనిచ్చిన పచ్చగాజులే నీ రెండు చేతులకిచ్చిన తరిపొలాలంటుంటివి
మర్చిపోలేగా?

నీ జడలో పెట్టుకొమ్మని ఇయ్యానికే
ఈ పల్లె ప్రేమికుడికి గులాబీ లెక్కడివి?
గీ ఎర్రటి రిబ్బన్ తప్ప

పుష్పవతి అయినపుడు, నీవు పూసుకున్న పసుపు కాంతి
నా ముఖంలో నీకు కనిపించంది కాదు

నీవూ నా దానివి అని తల్సుకున్నప్పుడల్లా
నా యవ్వనపు గుండె
గంగిరెద్దులా చిందులేసేది
వెయ్యి సీతాకోక చిలుకల్లా ఎగిరేది

నా ఎండిపోని స్వచ్ఛమైన సెలయేరా !
నువ్వు నా పక్కనుంటే
నా బతుకంతా జజ్జనక జజ్జనక....
అనుకుంటే
మీ కులపొల్లు కడుతున్న అడ్డు గోడల కోసం
నన్నో ఇటుకబట్టిలా
నిత్యం కాల్చుతూ డెంకుపునం పునం.
Spread the love

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!