కొందరు అద్భుతమైన వ్యక్తులను మనం ఎప్పటికీ కలుసుకోలేము.
వాళ్లు తమిళనాడులో ఉన్నా కేరళలో ఉన్నా, మనం తప్పకుండా కలిసి తీరాల్సిన అద్భుతమైన వ్యక్తులను మనం “నెమ్మి నీలం” పుస్తకంలో కలుసుకుంటాం. ఎలా వెతుకుతారో, ఎలా పుస్తకాలు కనిపెడతారో, ఎలా ఇంత అందంగా పుస్తకాలను తెస్తారో తెలియదు కానీ ఛాయా ప్రచురణాల నుండి వచ్చిన అద్భుతమైన పుస్తకాలలో ఈ పుస్తకం ఒకటి.432 పేజీలు ధర ₹450. పుస్తకం కొరకు ఛాయా రిసోర్సెస్ సెంటర్ ను సంప్రదించవచ్చు 7093165151.
అవినేని భాస్కర్ తమిళం నుండి అనువదించిన 12 కథలు. చాలామందికి జయ మోహన్ తెలిసే ఉంటాడు.
ఈ పుస్తకంలోనే రచయిత గురించి ఇలా చెప్పారు…
జయమోహన్ – 1962 ఏప్రిల్ 22న కేరళ- తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. తొలినాళ్ళలోనే ఆయన రాసిన రబ్బర్, విష్ణుపురం అనే నవలలు; నది, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. రబ్బర్ నవల అఖిలన్ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.
‘వెణ్మురసు’ పేరుతో మహాభారతాన్ని నవలా రూపంలో ప్రతిరోజూ తన వెబ్ సైట్ లో ప్రచురించారు. 2014వ సంవత్సరం మొదలు పెట్టిన ఈ రచన 2020 జూలైలో ముగిసింది. ప్రతిరోజూ ఒక యజ్ఞంలా కొనసాగిన ఈ రచన ఆధునిక సాహిత్యంలోనే అతి పెద్ద నవల అంటే అతిశయోక్తి కాదు. 22400 పుటలు, 1932 అధ్యాయాలు ఉన్న ఈ ‘వెణ్మురసు’ రచనను 26 సంపుటాలుగా ప్రచురించారు.
*
ఈ 12 కథలకు పేజీల పరిమితి లేకపోవడం ఒక విశేషం. పత్రికల్లో కాకుండా రచయిత తన వెబ్ సైట్ లో ఈ కథలను ప్రచురించడం మరో విశేషం. ఈ కథలన్నీ 45 రోజుల వ్యవధిలో రాసినవే కావటం ఒక అద్భుతం. రచయిత చెప్పినట్టు ధర్మం మూలాలకు సంబంధించిన ప్రశ్నలతో మొదలైన ఈ కథలన్నీ మానవత్వం గెలుపును చాటిచెబుతాయి ఈ కథలన్నీ ధర్మం అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని సంచరించేవే తన అంతరాంతరాల్లో
అనుభవించిన భావోద్వేగాకు తుఫాను తనను వదలక వెంటాడుతున్న తీవ్ర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఓ నలభై రోజులు వ్యవధిలో రాసినవి ఈ కథలు.
*
ఈ కథల గురించి మృణాళిని గారు ఇలా అన్నారు..
“….ఇందులోని ఒక్కొక్క కథా ఒక జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. ఒక్కొక్క కథా ఒక జీవన వాస్తవికతను చూపిస్తుంది. ఒక్కొక్క కథా ఒక మానవీయవిలువను గుర్తుచేస్తుంది. అన్ని కథలూ పాఠకుడిలో భావోద్వేగాన్ని, చింతనను, ఆశ్చర్యాన్ని ఒక్కోసారి అద్భుతాన్ని రేకెత్తిస్తాయి. సామాన్య పాఠకుడికి ఈ కథలిచ్చే ప్రతిఫలం ఇదయితే, తోటి కథకులు, విమర్శకులకు ఈ కథలు విశ్లేషించడానికే ఒక సవాలుగా అనిపిస్తాయి.”
….
“ఈ కథలు ప్రధానంగా రూపచిత్రణలు (portraits). ప్రతి కథా ఒక విలక్షణమైన వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఆ మనుషులందరూ మన చుట్టూ ఉన్నవారే. ఉన్నా మనం గమనించని వారే. గమనించినా సంపూర్ణంగా అర్ధం చేసుకోలేనివారే. దానికి కారణం పాత్రల్లో కల్పన ఎక్కువవడం కాదు. అసలు కల్పన ఎక్కడ మొదలైందో, వాస్తవం ఎక్కడ ఆగిందో అర్థం కాకుండా, ఆ రెండిటినీ అసాధారణమైన రీతిలో రంగరించే రచనా నైపుణ్యం వల్ల.”
*
ఈ కథలను చదువుతున్నప్పుడు ఆ సంఘటనలను చూస్తున్నట్టు ఆ మనుషులని చూస్తున్నట్లు నా కళ్ళ ముందరే ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
ఇవి కదా జీవితాలు, వీటి గురించి కదా మనం మనం రాయాల్సింది, వీళ్ళు కదా మనుషులు, వీళ్ళ గురించి కదా మనం మాట్లాడాల్సింది,ఈ పరాభవాలు ఈ కన్నీళ్లు ఈ అణచివేతలు ఎక్కడ లేవు? ఈ దుఃఖం మనది కాదా మనం ఎందుకు ఈ దుఃఖాన్ని గురించి రాయలేకపోతున్నాం, మన ఎందుకు మనుషుల లోపలి కథలను చూడలేకపోతున్నాము, ఇంత పదునైన వాక్యాలను ఎందుకు మనం కథల్లో రాసే ప్రయత్నం చేయడం లేదు- అని కథకులు అనుకునేలా ఈ కథలు ఉంటాయి.
*
ఇందులోని ప్రతి కథా ఒక నవలతో సమానం. ఈ పుస్తకంలో కథలతో పాటు కథల్లోని వాస్తవవిషయాలను వివరంగా తెలుసుకోవటానికి, నిజమైన వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి అంతర్జాల వివరాలను ఇచ్చారు.
*
రచయిత గురించి పూర్తిగా తెలుసుకోవటానికి వెబ్ సైట్ చిరునామా ఇచ్చారు.
*
ఈ కథల గురించి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు.
ధర్మం,ఒగ్గనివాడు,అమ్మవారి పాదం,ఏనుగు డాక్టర్,కూటి ఋణం,వంద కుర్చీలు,యాత్ర,తాటాకు శిలువ,నెమ్మి నీలం,చిలుకంబడు దధికైవడి,
పిచ్చిమాలోకం,ఎల్ల లోకములు ఒక్కటై… ఈ కథలలోకి నిస్సందేహంగా ప్రవేశించండి.
మీ ప్రయాణం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రతి కథలో మీకు నిజ జీవితంలోని వ్యక్తులు తారసపడతారు. సత్యం ధర్మం గురించిన వివేచన కలుగుతుంది.
నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ఉదాత్తత , ఆర్ద్రత అంటే ఏమిటో తెలుస్తుంది.
ఈ కథలు తెలుగు కథల్లాగే ఉన్నాయంటే ఈ కథల్లోని జీవితం తెలుగు వారి జీవితమే అని అనిపిస్తుంది అంటే ఆ కృషి అవినేని భాస్కర్ అనువాద నైపుణ్యానికి చెందుతుంది.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో తమిళనాడులోని, పళ్ళిపట్టు మండలంలో 1979లో తెలుగు కుటుంబంలో జన్మించారు అవినేని భాస్కర్ .అయితే తెలుగు బళ్ళు ఆ ఊళ్ళో అందుబాటులో లేకపోవడంతో తమిళ మాధ్యమంలో చదువు సాగించారు. సాహిత్యాభిరుచి ఉన్న ఇంట పెరగడం వల్ల, ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యానికి దగ్గరయ్యారు. తల్లిదండ్రుల దగ్గర తెలుగులో ఓనమాలు దిద్దినా, తెలుగు పుస్తక పఠనం మొదలెట్టింది మాత్రం ఇరవైరెండో ఏట ఇంటర్నెట్లో తెలుగు బ్లాగర్ల పరిచయంతోనే. ఇది ఒక అద్భుతమైన విషయం. తెలుగు భాష పట్ల వారికి గల ఇష్టానికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం.
అన్నమయ్య కీర్తనల్లోని జాను తెలుగుకి ఆకర్షితుడై అతని కీర్తనలను విస్తారంగా పఠించి, విస్తృతంగా అధ్యయనం చేసి, యాభైకి పైగా కీర్తనలకు ఇష్టంగా వివరణలు రాసి బ్లాగ్ లోనూ, సారంగ వెబ్ పత్రికలోనూ ప్రచురించారు.
2013లో తెలుగు అనువాద రంగంలో కాలూనిన భాస్కర్, ఇప్పటివరకు వంద కథలు, నూట ఇరవై కవితలు, మూడు నవలలు అనువదించారు. అనువాదానికి లోతైన భావాలు, హేతుబద్ధమైన ఆలోచనలతో కూడిన కథలను వీరు అనువాదానికి ఎంచుకుంటారు. వైవిధ్యభరితమైన ఉత్తమ తమిళ కథా సాహిత్యాన్ని ఎక్కడా కృతకంగా అనిపించకుండా అనుసృజన చేస్తూ తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. తమిళ మాతృకలోని సహజత్వం చెడకుండా తెలుగులోకి సూటిగా, స్పష్టంగా సృజనాత్మకంగా అనువాదం చెయ్యగలగడం భాస్కర్ బలం.
ఆసక్తిని కలుగజేసే మరొక అంశం ఏమిటంటే తెలుగులోంచి ఎంపిక చేసిన అత్యుత్తమ సాహిత్యాన్ని తమిళులకు చేరువచేసే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. తమిళ-తెలుగు భాషలకు మధ్య అత్యధిక సంఖ్యలో అనువాదకుల అవసరం ఉందని గ్రహించి, అనువాదకులను తయారు చేసే శిక్షణా పథకాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తున్నారు. అనువాదకుడు మరికొందరు అనువాదకుల్ని ఇలా తయారు చేయడం, వారికి తోడ్పాటు అందించడం అనేది భారతీయ భాషా సాహిత్యాలకు ఎంతో మేలు చేసే విషయం.
చదవడం, సంగీతం వినడం తన హాబీలు. ఉద్యోగరీత్యా ఎలక్ట్రానిక్స్ చిప్ డిజైన్ ఇంజనీర్ గా బెంగుళూరులో స్థిరపడ్డారు.
నిరంతర అధ్యయనం, సాహిత్య, సంగీత రంగాలలో వారికి గల ఇష్టం
మానవ సంబంధాల పట్ల మానవీయ విలువల పట్ల వారికి గల గౌరవం, వారి అనువాదాలకు మరింత శోభను చేకూర్చాయి.
యువతరానికి సాహిత్యాన్ని, సాహిత్యానికి యువతరాన్ని చేరువ చేయాల్సిన తరుణంలో ఇలాంటి యువ అనువాదకులు ఇంతటి మహత్తరమైన పనులను చేపట్టడం భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగించే విషయం.
*
వ్యక్తిత్వాన్ని హత్య చేయడమో వ్యక్తిత్వం ఆత్మహత్య చేసుకోవటం జరుగుతున్న రోజుల్లో, వ్యక్తిత్వాన్ని చివరి వరకు నిలుపుకున్న వ్యక్తులు అలా వ్యక్తిత్వాన్ని చివరి వరకు నిలుపుకోవడానికి చేసిన పోరాటాలు ఎంత గొప్పవో, ఒక వ్యక్తి తన స్వతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలు ఎంత గొప్పవో చెబుతూ,కులంలో ఎవరు తక్కువ కారని, కులం కారణంగా ఎవరు ఎవర్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదని చెబుతూ, కులాధిపత్యం పై కొనసాగాల్సిన పోరాటాలని, సత్యమార్గంలో కొనసాగుతూ అందరినీ సమానంగా చూడాల్సిన మానవ సంస్కారాన్ని గుర్తుచేస్తుంది ఈ పుస్తకం.
సమాజంలో నిజమైన కథానాయకులు ఎవరో ఈ పుస్తకంలో తెలుసుకుంటాం.
ఈ పుస్తకం చదివిన క్షణం నుండి నా దృష్టిలో రచయిత జయ మోహన్ ఒక గొప్ప హీరో.





వ్యాక్యాన్ని జతచేయండి