ప్రియురాలా...
నీవీవేలా ప్రేమగా పలికిన ఆ నాలుగు మాటలు
నాలో వసంతాన్ని పూయించింది కోయిల పాటలు పాడింది
వసంతం వచ్చిందని కోయిల కూస్తుందో
కోయిల కూతలు వినడానికే వసంతం పూస్తుందో తెలియదు కానీ
నీవు నా జీవితంలోకి వస్తే నీవే వసంతం నీవే కోయిల
ఎడారిలో కూడా పూలు పూయించగల నేర్పు ప్రేమది
బీడుబడ్డ నా హృదయాన్ని పచ్చని పైరుగా చేసే ప్రేమ నీది
హృదయం పచ్చి పుండై సలుపుతున్నపుడు
ప్రేమగా నీవెట్టే ముద్దే నల్లాలం ఆకుపసరై గాయాన్ని తగ్గిస్తే
నీ కౌగిలే నొప్పి తేల్వనియ్యని మత్తుమందైతది
ఎన్నెన్ని ముళ్ళను దాటొస్తే ఈ ప్రేమ దీవిని చేరుకున్నాం
లెక్కలేనన్ని సార్లు హృదయాలు చీలి నెత్తురు కారుతున్నా
హృదయాలకు హృదయాలను ఒత్తుకుని ప్రాణాన్ని నిలుపుకున్నాం
ప్రాణాలనే పణంగా పెట్టీ కాపాడుకున్న జీవం కదా మన ప్రేమ
ఆ జీవమే లేకుండా జీవిస్తానని ఎట్లా అనుకున్నావు
హృదయమెక్కడా స్వేచ్ఛగా విహరిస్తుందో
హృదయమెక్కడా సహజంగా వికసిస్తుందో
ఆ ప్రేమకోసమే కదా ఎన్నెన్ని త్యాగాలకైనా సిద్ధమవ్వాల్సింది
త్యాగమంటే దేనినో వదులుకోవడమనే కాదు ప్రియా
మనల్ని మనం కోల్పోకుండా కాపాడుకోవడం కూడా
నీవు నేను వేరువేరని ఎవరన్నారు చెప్పు
నాకోసం నీవు పెరుగన్నం కలిపితెచ్చిన సద్ది యాదుందా
పెరుగేదో అన్నమేదో గుర్తుపట్టలేనంత కలిపేవు కదా అదే మనం
వెలుగులోనే మనం వేరువేరుగా కనపడే నీడలం
చీకట్లో ఎవరు ఎవరమో ఎవరూ కనిపెట్టలేని ఒకే దేహలం.








వ్యాక్యాన్ని జతచేయండి