ఇచ్ఛామతి

స్త్రీ

1937లో విజయనగరంలో జన్మించారు. ‘కాలాతీత వ్యక్తులు’ రచయిత్రి పి.శ్రీదేవి స్నేహ, ప్రోత్సాహాలతో రచనావ్యాసంగం చేపట్టి, స్త్రీ కుటుంబ జీవనంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని అరవయ్యవ దశకంలో కథలు, గేయాలు రాశారు. 1962లో తొలి ముద్రణగా వెలువడిన ఈ ‘కుంకుమ రేఖలు’ తో పాటు 1978లో ‘సరళాదేవి కథలు’ వెలువరించారు. ప్రముఖ రచయిత్రులు ఆరుగురితో కలిసి ‘సప్తపది’, ‘షణ్ముఖప్రియ’ గొలుసు నవలలు రాశారు. ‘కొమ్మా-బొమ్మా’ పేరున ‘యువ’లో సీరియల్ నవల రాశారు. తెలుగువారి కుటుంబజీవనంలో వినవచ్చే సామెతలకు సంబంధించి ‘సామెత’ అనే గ్రంథాన్ని ప్రచురించారు.

పెళ్ళయిన మర్నాడు శాంత వ్యక్తురాలయింది. శారీరకంగా కాదు… మానసికంగా…. నిజానికి శాంత మరీ బాలాకుమారి కాదు. పెళ్ళినాటికి రెండవ పది దగ్గరపడిన యువతి అని చెప్పాలి.

అలాగని బేలా కుమారి కాదు.

ఇటువంటి అవసరం వొకటుంటుందని ఇన్నాళ్లుగా శాంతకు తెలియలేదు.

అనుకోకుండా పెళ్ళి కుదరడం జరిగిపోవడం వెంట వెంటనే జరిగాయి. గోవిందుని కళ్ళారా శాంత చూడనే లేదు. ఓ సాయంత్రం వేళ పెళ్ళి చూపులని శాంతకు తల్లి చెప్పింది. ఓ మంచి చీర కట్టుకోమంది. గోవిందు, అతని తల్లి అక్కగారట ఆవిడా, మేనమావట ఇంకో మనిషి వచ్చారు. గోవిందుకి తండ్రి లేడట. చూసిచూడగానే పిల్లనచ్చినదన్నారు. తండ్రితో ఏవేవో మాట్లాడారు. పదిహేను రోజుల్లో ముహూర్తం అన్నారు. వో పది నిముషాలు కూర్చుని లోపలికి వెళ్ళిపోయిన శాంత చెవిన పడ్డ వాళ్ల మాటలను బట్టి అర్థం చేసుకుందేగాని, తల్లిగాని తండ్రిగాని ఆమెకేమీ చెప్పలేదు. ఆమె నేమీ అడగలేదు. పెళ్ళి చూపులలో గోవిందు నోరిప్పలేదు. శాంత నోరు విప్పవలసిన అవసరం కలగలేదు. శాంత సగటు ఆడపిల్ల.

పెళ్ళి ముహుర్తం వుదయం పడడం చేత తెల్లవారుజామునే శాంతను నిద్రలేపి స్నానం చేయించి ముస్తాబుకు కూర్చోబెట్టారు. ఆ తంతు జరిగిన తరువాత పెళ్ళి, ఆ రాత్రే వాళ్ళిద్దర్నీ కలపాలన్నారు. ఎవరూ నోరిప్పకుండానే పెళ్ళి తంతు ముగిసి పోయింది. ఆ తరువాత వచ్చేపోయే జనాలతో భోజనాలతో హడావుడిగా వుండడంతో శాంత అలసిపోయింది.

ఆ సాయంత్రం మళ్ళీ స్నానం చేయించి, తెల్ల చీర కట్టబెట్టి ముస్తాబు చేశారు. భోజనాలు అయినాక పాలగ్లాసు చేతిలో పెట్టి గదిలోకి పంపారు. గదిలోకి వెళ్తూనే, ఎటూ చూడకుండా తలుపు గడియపెట్టి, పాలగ్లాసు బల్లమీద పెట్టేసి మంచం మీద వాలిపోయింది శాంత. అప్పుడు మూసుకున్న కళ్ళు బాగా తెల్లారితేగాని తెరుపుడు పడలేదు. అప్పటికి గాని గోవిందు ఏమయాడా అన్న ఆలోచనలేదు. చూస్తే గోవిందు కింద చాపవేసుకుని నిద్రపోతున్నాడు.

మెల్లిగా లేచి తలుపుతీసి బయట కెళ్ళిపోయింది. అలా బయటపడిన శాంతను అందరూ అదోలా చూడడం మొదలు పెట్టారు.

అలా చూసిన మొదటి వ్యక్తి గోవిందు పెద్ద అన్నగారు. ఆమె బయటపడిన దగ్గర్నుండి పళ్ళుతోముతున్నా, కాఫీ తాగుతున్నా చూపుకందేంత దూరంలో తిరిగాడు. కాఫీగ్లాసు పుచ్చుకుని వరండాలో కూర్చున్న శాంత దగ్గరకు అత్తగారు వచ్చింది. పక్కనే కూర్చుంది. అతి ఆప్యాయంగా వీపు నిమురుతూ-

“నువ్వేమీ విచారించకు శాంతా! ఎలాంటి ఆడదానికయినా వో పందిరి కావాలి. నీతోడు కోసం పొందుకోసం నీ ఏర్పాటు నువ్వు చేసుకోవచ్చు.” అంది.

శాంత అయోమయంగా చూసింది. పెళ్ళయిన మర్నాడు విచారించడమా! పైగా నాకు ఏర్పాట్లా!

ఆ తరువాత గోవిందు స్నేహితుడట, అలాగని చెప్పుకుని వచ్చాడు. “వీడింకా లేవలేదా పిన్నీ! రాత్రంతా ఏమి నిర్వాకం చేశాడు! వదినగారిని చూస్తే సగం అర్థమయిపోతుంది” అంటూ వో జోక్ వదిలాడు. శాంత ఇంకా అయోమయంలో పడిపోయింది.

ఇంతలో గోవిందు అక్కగారు వస్తూ “అప్పుడే పిల్లను బెదరగొట్టకండి. వుప్పుకారం తింటూ చీమూ నెత్తురూ పట్టినపిల్ల. తనంతటతనుక ఆలోచించుకోనివ్వండి. అల్లరి పడడం అంత మంచిది కాదని చెప్పండి” అంది.

శాంత బిక్కచచ్చిపోయింది. ఈలోగా పెళ్ళి పనులకని కుదిర్చిన రంగి శాంతను స్నానానికి తీసుకు వెళ్లింది. వీపు తోముతూ “అమ్మాయిగారూ వీళ్ళందరూ చెప్పిన మాటలు వినకండి బ్రతుకు రహస్యం చేసుకోకండి!” అని చెప్పింది.

స్నానం చేసివచ్చి తలదువ్వుకుంటూంటే శాంతకు తల్లి కనిపించింది. “వీళ్లందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలేమిటమ్మా ఇదంతా” అని అడిగింది. ఆవిడ కూతుర్ని నొక్క చూపు చూసి చెంగునోటి కడ్డం పెట్టుకుని బావురు మంటూ పెరట్లోకి పరుగెత్తింది.

ఇంతలో పిన్ని కూతురు రమ వచ్చింది –

“ఇంకా బ్రతికే వున్నావా?” అంది.

“ఏమిటే నువ్వు కూడా…”

“నంగనాచి తుంగబుర్ర ఏమెరుగదు పాపాయి!

“నిజంగా నాకేమీ తెలియదే…”

“నిజం…”

“నీతోడు…”

“గోవిందుకు బ్రహ్మచెముడటకదా!”

“ఆఁ…”

“దానికితోడు నత్తికూడానట…!”

“ఆఁ…”

దానికి తోడు మందబుద్ధిట…”

“ఆఁ…”

“ఆఁ…” అంటూ పారిపోయింది.

ఆ షాకు నుండి తేరుకోడానికి శాంతకు వో పూట పట్టింది. ఏడుపు తన్నుకోస్తోంది.

ఆ రాత్రి మళ్ళీ గదిలోకి పంపించారు. శాంత వెళ్ళే సరికి గోవిందు మంచం మీద కూర్చుని జాంపండు తింటున్నాడు. గోవిందుని చూస్తూనే వుప్పెనలా ఏడుపు ముంచుకొచ్చింది. శాంతను రెండు చేతులతో పట్టుకు మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు.

“ఏం… దుకేడు…స్తున్నావు… శాంతా!” అని అడిగాడు. దానికి శాంత ఇంకా ఏడుస్తూ మంచం మీద పడిపోయింది. అలా ఏడుస్తూనే ఎప్పటికో నిద్రపోయింది శాంత. ఆ పక్కనే పడుకుని గోవిందు ఆమె వీపు నిమురుతూ నిద్రపోయాడు.

ఆ మర్నాడు పొద్దున్నే ముఖం కడుక్కుని తను కాఫీ తాగి గోవిందుకు కాఫీ తెచ్చి ఇచ్చిన శాంతను నిలబెట్టేశాడు. గోవిందు వేలువిడిచిన మేనమావకొడుకట…

గదిలోకి జొరబడి, వో కుర్చీలో కూలబడి, “ఎలా వున్నావు శాంతా!…” అని ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తూ ఏవోవో సూచనలిస్తూ… దేనికయినా సిద్ధపడేందుకు తనున్నాడని చెప్పాడు. అవేవీ గోవిందుకు వినిపించలేదని తెలుసుకుంది శాంత.

అప్పుడు శాంతకు తనేమిటో తన పరిస్థితేమిటో అర్థమవసాగింది. మగవాడి పొందుకోసం తను తహతహలాడుతుందని వీళ్లందరూ ఎందుకనుకుంటున్నారో తెలియలేదు. ఇతర విధాల ఆ పొందును ఆమె అనుభవించాలని వారి ఆరాటం! అయితే అది అంత ముఖ్యమా? అది లేకపోతే బ్రతకలేమా! అదే నిజమయితే ప్రమాదవశాత్తూ భర్తలు పోయిన అనేక మంది ఆడవాళ్ళు ఎలా బ్రతుకు తున్నారు. అవిటి వారయిన అనేక మంది భర్తలకు భార్యలు లేరా? వుంటే వాళ్ళందరూ వేరే ఏర్పాట్లు చేసుకున్నారా?

గోవిందు చెవిటివాడే గాని మగవాడు కాడా!

నత్తివాడేగాని పొందుకు సరిపోడా!

మందబుద్ధేగాని మనిషికాడా…

తనని తను అర్థం చేసుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవలసిన అవసరం తనకే వుందని అనుకుంది శాంత. వీరందరూ ఎవరు తన జీవితాన్ని శాసించడానికి!

అయితే బాహాటంగా ఛాలెంజిలు కొట్టడం. సవాళ్ళు విసరడం శాంతకు తెలియదు.

మూడోరోజు రాత్రి శాంత ఆడది అయింది.

లోకానికి కాదు…

గోవిందులోని మగతనానికి.

* * *

నిజానికి గోవిందు ఆ వూరి వాడే. పుట్టుకతో బధిరుడవడంవల్ల, నాలుక సాయం చేయక పోవడం వల్ల చదువుకోడానికి అవకాశం లేకపోయింది. అందుచేత అతడి తండ్రి బతికున్న కాలంలోనే కొడుక్కి వొక సైకిలు షాపు పెట్టించాడు. వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి పనిలో సాయం చేయడానికి వొక కుర్ర వాడిని నియమించాడు. అది బాగానే నడుస్తుందని చెప్పేడు గోవిందు.

తనను దుమ్మెత్తి పోస్తుందనుకున్న శాంత తండ్రి, శాంత శాంతంగానే కోరిన కోరికలు కాదన లేకపోయాడు. ప్రాథమికోపాధ్యాయుడయిన తండ్రి, తన తరువాత ఇంకా ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళి చేయాల్సిన తండ్రి తనకింత కంటే మంచి సంబంధం తేలేడని సమాధాన పడింది శాంత! తనకు ఒక కుట్టుమిషను కొనివ్వమని తండ్రిని కోరింది. సైకిలు షాపు దగ్గరలోనే రెండు గదుల వాటా అద్దెకు తీసుకుంది.

పెళ్ళయిన రెండు నెలలకు శాంత అందరికీ అర్థమయింది. నోరిప్పకుండా వూళ్ళేలుతుంది అన్నారు. పన్నెత్తి వొక్కమాట ఎవరినీ అనలేదు శాంత. ఎవరితోనూ ఛాలెంజిలు కొట్టలేదు. గానీ బ్రతకడానికేగాక, వొళ్ళు చల్లబడడానికి కూడా ఎవరో వొక మగాడ్ని ఎంచుకోకపోతుందా అని అందరూ అనుకున్నారు. ఆమె పరిస్థితుల లాంటివి మరి.

గోవిందు చాతగాక మాట్లాడడు.

శాంత చాతనయినా మాట్లాడదు.

వాళ్ల సంసారం అలా సాగుతూండగానే శాంత నెలతప్పింది. శాంతకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆమె కోసం అర్రులు చాచిన మగాళ్ళందరూ కిక్కురు మనలేదు. బావగారు చూడడానికి వచ్చి –

“ఎలాగయితేనేమి గోవిందును మగాడ్ని చేశావన్న మాట” అన్నారు. దానికీ శాంత ఏమీ అనలేదు.

కూతురు పుట్టిన రెండేళ్ళకు కొడుకును కన్నది శాంత, ఆ తరువాత తల్లిని తోడ్చుకుని వెళ్ళి గప్‌చుప్‌గా కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకున్నది.

సైకిలు షాపులో మరో ఇద్దరు కుర్రాళ్లు చేరారు. పదిహేనేళ్లలో పెద్ద మార్పేమీ లేదు. కుటుంబం ఖర్చులకు బొటాబొటిగా సరిపోతోంది. కూతుర్ని హైస్కూలు వరకు చదివింది ఆపించేసింది. వో పక్క చదువుకుంటూ సాయంత్రం వేళలో సైకిలు షాపులో పనిచేస్తున్న వో కుర్రవాడ్ని చూసి ముచ్చటపడి కూతుర్నిచ్చి పెళ్ళి చేసింది శాంత.

కూతురు పెళ్ళి చేసిన మర్నాడు శాంత మాతృమూర్తి అయింది. లోకానికి కాదు కన్నకూతురుకే! ఆడపిల్లకు పెళ్ళి తరువాత తల్లి అవసరం ఎక్కువవుతుంది.

కొడుకు చదువు మానడానికి వొప్పుకోలేదు. అలాగే జాగ్రత్తగా ఆర్థిక సాంఘిక పరిస్థితులు దిద్దుకొంటూ కొడుకుని డిగ్రీ పూర్తి చేయించింది. ఆ కుర్రవాడి ఆశను తెలుసుకున్న వొక వర్తకుడు, తను పై చదువు చదివిస్తానన్నాడు. ఎవరి దగ్గిరా చేయి చాపి ఎరుగని శాంత కొడుకు వుత్సాహంలో నీళ్ళు పొయ్యలేకపోయింది.

ఆ కుర్రవాడ్ని పోస్టుగ్రాడ్యుయేషన్ చేయించి, వుద్యోగం వేయించి, కూతుర్నిచ్చి పెళ్ళి చేసి అల్లుడ్ని చేసుకున్నాడు ఆ వర్తకుడు. పెళ్ళయిన తరువాత శాంతతో చెప్పేశాడు. కూతురు అత్తవారింటికి రాదనీ, భర్తతోపాటు రాజధానీ నగరానికి వెళ్ళిపోతుందనీ, చెప్పేశాడు. ఈ జీవన పోరాటంలో మౌన ప్రేక్షకుడు గోవిందు. అన్నింటికీ ప్రేక్షకుడే తప్ప నోరెత్తడు. ఈ మౌన పోరాటంలో అలసిపోయిన స్త్రీ శాంత,

కొడుకు పెళ్ళయిన మర్నాడు శాంత చచ్చిపోయింది. శారీరకంగా గాదు, మానసికంగా!

Spread the love

జి.ఎస్.చలం

పుట్టింది కొత్తపల్లిలో. పాఠశాల విద్య పార్వతీపురంలో. పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో కళాశాల విద్య, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య.
వృత్తి: విజయనగరం జిల్లాలో మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషా బోధన.
రచనలు:
రజకుల జీవిత నేపథ్యంలో" రేవు" నవల, కళింగాంధ్ర మాండలిక పదకోశం, మృచ్ఛకటికం (అనువాదం), కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు, భూషణం మోనోగ్రాఫ్, కళింగాంధ్ర కవితా సంకలనం "తిత్తవ"కు భూషణం సమగ్ర కథా సంపుటికి సంపాదకత్వం.

నటుడు, దర్శకుడు.
సంపూర్ణ కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు, సంక్షిప్త నాటకంలో రామప్ప పంతులు పాత్రలు ధరించి దర్శకత్వం వహించారు. కొన్ని వ్యాసాలు రాశారు. ప్రసంగాలు చేసారు.విద్యార్థుల్లో భాషా సాహిత్యాల పట్ల అభిరుచి కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!