చైతన్య పల్సర్ మీద కాకినాడ నించి ఆళ్ళ అమ్మమ్మ గారూరు గేదెల్లంక వత్తంటే బండి ఎదుర్లంక దాటాక ఎనకాల నించి ఒక కియా సెల్టాస్ ఎరుపు కారు ఏగంగా పల్సర్ దాటుకుని ఎళ్ళింది. నడుపుతున్నదెవరో కానీ గుద్దినంత పక్కనించి నిర్లక్ష్యంగా ఎళ్ళిందా కారు. ‘‘ఎవడ్రా ఎదవ కొంచుముంటే గుద్దేద్దుడు’’ అని తిట్టుకుంటా కారొంక చూత్తే ఎర్రగా మెరిసిపోతా ఆకర్షణీయంగా ఉంది. అంతకంటే ఆకర్షణీయంగా ఉన్నదేంటంటే ఎనకాల నల్లని అద్దం మీద నరకాసురుడి బొమ్మ భయంకరంగా ఉంది. దాని కింద పెద్ద పెద్ద అక్షరాలతో ‘‘నరకాసురుడు’’ అని రాసిన స్టిక్కర్ అంటిచ్చి ఉంది.
ఆ బొమ్మ, ఆ పేరు చైతన్యకి చేలా ఇడ్డూరంగా అనిపిచ్చాయ్. సాధారణంగా పతి మనిషిలోనూ ఓ మంచోడు, ఓ సామాన్యుడు, ఓ దుర్మార్గుడు ఉంటాడు. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎవడు అవసరమైతే ఆడు బయటికొత్తాడు. ఎక్కువుగా మనిషి నైజం దుర్మార్గుడేపు మొగ్గు చూపినా అందరి ఎదర మంచోడని అనిపిచ్చు కోటానికే చూత్తాడు.
కానీ ఈడెవడో నేను నరకాసురుడంతటి దుర్మార్గుణ్ణి అని గొప్పగా చెప్పుకుంటన్నాడు. అంటే ఈడికి నటించటం కానీ, జెనాలతో మంచోడు అనిపించుకోవాలనీ కుతి లేనోడని అర్ధమైంది చైతూకి.
ఈడి గురించి తెలుసుకోవాలి అనుకుంటానే తన బండి మీద ఆ కార్ని ఎంబడిరచాడు. ఆ కారు మురమళ్ళలో ఆగింది. అందులోంచి లావుగా, ఎత్తుగా పెద్ద పొట్టతో ఓ మనిషి దిగాడు. లెనిన్ చొక్కా, ఫేంట్ ఏసుకున్నాడు. ఆ భారీ మనిషి చింతనిప్పుల్లాంటి కళ్ళు, గిరజాల జుట్టుతో భయిపెట్టీలాగున్నాడు. బుర్ర మీసాలతో, చేతి పది ఏళ్ళకి పెద్ద పెద్ద ఉంగరాలతో, మెడలో మోకు తాడు లాంటి లావాటి చైన్లుతో దిగాడు. రాజస్థాన్ టీ స్టాల్ అని ఉన్న టీ బడ్డి దగ్గిర సిగరెట్ ఎలిగిచ్చుకుని టీ తాగాడు. చైతన్య కూడా అక్కడ బాదం టీ తాగాడు. టీ తాగుతా అతన్ని పరిశీలించి చూసి ఈడెవడో నిజంగానే నరకాసురుడిలాగున్నాడు అనుకున్నాడు.
ఆ తర్వాత అతని కారు మురమళ్ళ మీంచి అన్నంపల్లి మీదగా కొమానపెల్లి దాటి గేదిల్లంక ఎళ్తంటే హమ్మయ్యా! ఈ ఊరే వొచ్చింది కారు. లేపోతే దీన్ని ఎంబడిత్తా ఎక్కడి దాకా ఎళ్ళాల్సి వొచ్చునో! ఈడి గురించి తెలుసుకోవాలి. ఈ ఊరు అమ్మమ్మదే కనక అమ్మమ్మనో, తనతో జతగాడిగా ఉండీ మావయ్యనో అడిగి తెలుసుకోవాల అనుకున్నాడు.
చైతు ఆళ్ళ అమ్మమ్మ వోళ్ళుండే కుమ్మర్ల సందు కెళ్ళాలంటే ఆకెళ్ళోరి ఈది, గవర్లపేట, హనుమాన్ నగర్ దాటెళ్ళాలి. కానీ ఆ కారు అయ్యన్నీ దాటి అంబేద్కర్ నగర్, జీవన్ నగర్ దాటుకుని ఎళ్ళింది. అప్పడెప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నగారి హయాంలో బడుగు బలహీన వర్గాలకిచ్చిన కోలనీ అది. దానికి గవర్నమెంటోళ్ళు ‘‘పూలే నగర్’’ అని పేరెట్టినా అందరూ పిలిచీ పేరు కొత్తకొంపలు. ఆ కోలనీ కూడా దాటుకుని ఊరి చివర చుట్టూ చేల మజ్జిన ఏకాకిలా కట్టిన రెండంతస్థుల డాబా ముందాగింది. అక్కడి దాకా ఆ కారును ఎంబడిచ్చి ఎనక్కి వొచ్చీసాడు చైతు ఆళ్ళ అమ్మమ్మ ఇంటికి!
చైతుని చూడగానే ఆళ్ళ అమ్మమ్మ రాజ్యలక్ష్మి ఆత్రంగా ఎదురొచ్చింది. ‘‘ఏరా చైతూ ఎలా వున్నావ్?, అమ్మ నాన్న బాగున్నారా? అమ్మను కూడా తీసుకు రాపోయావా?’’ అనడిగింది. నూతి దగ్గిరికెళ్ళి చేదతో బాల్చాలోకి నీళ్ళు తోడిచ్చి కాళ్ళు కడుక్కోమంది. ‘‘నీకెందుకే అమ్మమ్మా నేను తోడుకోలేనా? ఎదుటోళ్ళని అస్సలు కష్టపడనివ్వవు ఇంత వయిసొచ్చినా’’ అంటా చిరుకోపం నటిచ్చాడు గారంగా.
ఇంతలో ఇంట్లోంచి ఆళ్ళ మావయ్య లుంగీ సర్దుకుంటా నవ్వుకుంటా వొచ్చి ‘‘ఏరా చైతూ ఇన్నాళ్ళకి మావయ్య, అమ్మమ్మ గుర్తొచ్చారా? ఉంకో నెల రోజుల్లో ఐద్రాబాద్ ఎళ్ళిపోతన్నావట కదా, ఉప్పుడా రాటం?’’ అంటా చైతు దగ్గిరికొచ్చి కావిలిచ్చుకున్నాడు. అందరూ ఇంట్లోకెళ్ళారు. ఎంటనే కొట్టు గదిలో దాసిన కొబ్బరి బొండాలు కొట్టి చైతుకిచ్చాడు తాగమని. రొండు తాగీసరికి కడుపు నిండిపోయింది. అయినా ఆళ్ళ మావయ్య కేశవస్వామి బలవంతపెడితే ఇంకోటి తాగాడు. ఆ లేత కొబ్బరి కోరి బెల్లం కలిపి ఇత్తే తిన్నాడు. ఇద్దరూ ఆళ్ళ అమ్మమ్మ చేసిన వేడి వేడి పొట్టిక్కలు, మావిడికాయ కొబ్బరికాయతో చేసిన పచ్చడేసుకుని తిన్నారు. దాల్చిన చెక్కేసిన బెల్లం టీ తాగి ఏటిగట్టుకెళ్ళారు. చైతు కిష్టమైన గౌతమీ నదిలో తనివితీరా ఈతకొట్టారు. అలసట తీరీదాకా గౌతమీనించి పిల్లగాలులు పీల్చుకున్నారు. చైతు తన ప్రియురాలు చాందిని గురించి, కేశవ తను ప్రేమిస్తున్న రాఘవరాజు గారి అమ్మాయి సుభద్ర గురించి మాటాడుకుంటా ఇంటికొచ్చారు.
బాగా ఈత కొట్టారేమో సాయంత్రం తిన్న పొట్టిక్కలు కడుపులోనే భస్మమైపోయాయి. ఆ సాయంత్రం ఆళ్ళ అమ్మమ్మని, గంగాద్రి ‘‘అమ్మగారూ వొంజిరాలు, పాలసొరలు తాజాగా ఉన్నాయి. వొంజిరాలైతే ఇంకా బతికే ఉన్నాయ్ తీసుకోండి’’ అంటా ఇచ్చాడు. పుల్లల పొయ్యి మీద మట్టిదాకలో అసలు ముళ్ళే ఉండని ఒంజిరాలు ఇగురెట్టింది. ఆ చేతిలో ఏం మాయ ఉందో కానీ ఒంజిరుం మావూలుగానే సముద్రం చేపలన్నిటి లోకి రుచిగా ఉంటది. దాన్ని రాజ్యలక్ష్మి వొండితే దాని రుచి రాతలో చెప్పలేం. తెల్లగా కోమలంగా ఉండీ పాలసొర్రలతో పిడిపి చేసింది. అది వేడి వేడి అన్నంలో తింటంటే అబ్బా ఆ రుచి ఎలా చెప్పాలి. ఆ సొర్ర పిడిపిలో దుమ్ముల్లాగుండీ ముళ్ళు నవుల్తుంటే ఆ కమ్మదనం అమ్మతనమంత బాగుంటాది.
ఇందాక యానాం మీంచి వొచ్చీటప్పుడు చైతు యానాం బైపాస్‌లో దుర్గా బార్ కాణ్ణించి స్మిర్నాఫ్ గ్రీన్ఏపిల్ ఫ్లేవర్ ఓడ్కా తెచ్చాడు. మావ, మేనల్లుడు కొబ్బరినీళ్ళలో కలుపుకుని చెరో క్వార్టర్ తాగుతా, మేడ మీద కబుర్లాడుకుంటా సొర్ర పిడిపి, ఒంజరుం ముక్కలు నంజుకుని తినీసారు. కిందకి దిగి అందరూ భోజనం చేసారు. చైతూ ఒంజరుం ఇగురుతో, పాల సొర పిడిపితో ఇష్టంగా తింటంటే ఆళ్ళ అమ్మమ్మ ముళ్ళు ఏరి ఏరి ఏసింది. ఆటిని ఆత్రంగా, ఇంత రుచిగా మళ్ళీ దొరకవేమో అన్నంత ఆబగా తిన్నాడు. అందరి అన్నాలయ్యాక మేడ మీద పరుపులేసుకుని వెన్నెలని, తారలని చూత్తా పడుకున్నారు.
ఇంతలో చైతూకి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినోడిలాగ ‘‘మాయా ఇందాక నేను వొచ్చీటపుడు ఎరుపు రంగు కియా సెల్టాస్ ఒకటి నన్ను గుద్దేయబోయింది. చేలా రేష్ డ్రైవింగ్ ఎవడో కానీ, ఆ కార్ ఎనకాల గ్లాస్ మీద నరకాసురుడు అని స్టిక్కరంటిచ్చి ఉంది, నరకాసురుడి బొమ్మ కింద. ఆ కారు ఈ ఊరే వొచ్చింది. ఎనకాలే ఎళ్ళాను. ఊరు చివర సొశానాల దగ్గిరిలో ఓ డాబాలో కెళ్లింది. ఎవడు మాయా ఆడు, ఆ పేరేంటి అలా రాయించుకున్నాడు? ఆడి గురించి తెలుసు కోవాలనుంది. చెప్పు’’ అన్నాడు. దానికి ఆళ్ళ మావయ్య కేశవ ‘‘ఆడి గురించి చెప్తే జడుసు కుంటావ్ మనుషుల్లో ఇలాంటోళ్ళు కూడా ఉంటారా? అనుకుంటావ్. ఆడి ఇంటికి రేత్రిళ్ళు దేవుడెరుగు, పగలే ఎవరు ఎళ్ళరు. అంత ధైర్నం ఎవరికీ లేదు’’ అన్నాడు. ‘‘అదేంటి మాయా అతనేవన్నా చేతబడి చేత్తాడా? అందుకనేనా ఊరి చివర చేల్లో, సొశానానికి దగ్గిరిలో కట్టుకున్నాడు ఇల్లు?’’ అనడిగాడు.
‘‘నీకు చెప్పటం కాదు రోపు చీబిత్తాను. ఆ ఇంట్లో పనిచేసీ మీరాసాహేబ్ మనకి బాగా తెలుసు. అతనికి ఫోను చేసి నరకాసురుడు లేనప్పుడు ఎల్దాం’’ అన్నాడు. ‘‘సరే మాయా, ఇంతకీ అతని పేరు నరకాసురుడేనా అసలు పేరు ఇంకేవైనా ఉందా?’’ అనడిగాడు. ‘‘అతని అసలు పేరు నాగభూషణం. కానీ ఎవరూ అతన్ని ఆ పేరుతో పిలరు. అసలు ఊళ్ళో చేలామందికి ఆపేరే తెల్దు. అందరూ ‘‘నరకాసురుడు’’ అనే పిలుత్తారు. అసలు ఊళ్ళో అతన్ని పిలవాల్సిన అవసరమే రాదు. ఎవరూ ఏ కారిక్రమాలకి పిలిచీ ధైర్నం లేదు. పిలిచినా రాడు. సరే పడుకో రోపు మీరియ్యికి ఫోన్ చేసి రమ్మంటే ఎల్దాం’’ అన్నాడు.
ఇంతలో రాజ్యలక్ష్మి కూడా దిండు దుప్పటి, మంచినీళ్ళు సీసాలు అట్టుకుని వొచ్చింది పడుకోడానికి.
పొద్దున్నే చైతు, కేశవ ఏపపుల్లతో పళ్ళు తోముకునీ సరికి రాజ్యలక్ష్మి ఏడేడిగా గార్లు, ఉల్లిపాయ పచ్చడి చేసింది. అయ్యి తిని, బాదం టీ తాగారు. ఊరి చివరనున్న ఆ ఇంటికి ఎళ్ళటానికి మీరాసాహెబ్కి ఫోన్ చేత్తే ‘‘ఓ పావుగంటలో రండి. ఆ యముడు ఊరెళ్తన్నాడు సందాలదాకా రాడు’’ అన్నాడు.
‘‘సరే చైతు ఆడు బైటికి ఎళ్తన్నాడంట. మనం ఆ ఇంటికెళ్ళినప్పుడికి మీరియ్య చెప్పిన పావుగంట అవుద్దిలే’’ అన్నాడు. కేశవ, చైతు ఆళ్ళ కాలేజీ గురించి మాటాడుకుంటా చెరో గులకరాయిని తన్నుకుంటా ఆ ఇంటికెళ్ళీసరికి రోడ్డు మీంచి చూత్తే కారు కనబళ్ళేదు. అందుకే ధైర్నంగా ఎళ్ళారు. కంకర రోడ్డు ఎడమేపు సొశేనం, కుడేపు గవర్నమెంటోళ్ళు మాలమాదిగలకిచ్చిన బాడవ ఉన్నాయ్. ఉప్పుడయ్యి ఆళ్ళెవరి పేరా లేవనకోండి. ఉప్పుకి పప్పుకి చవగ్గా ఊళ్ళో రైతులు కొనీసుకున్నారు. అది దాటాక మాలమాదిగల సొశేనం. అందులో ఓ ఇరవై సెంట్లు ఆక్రమించుకుని కట్టిన డాబా ఇల్లది. సొశేనానికి కూడా బాట లేదు. కానీ ఆ డాబా ఇంటికి పంచాయితీ వోళ్ళని భయపెట్టి కారు ఎళ్ళి వొచ్చీలాగ ఎర్ర కంకర రోడ్డు ఏయించుకున్నాడు! ఇయ్యన్నీ కేశవ చైతుకి చెప్తుంటే ఆశ్చర్యంగా ఇంటన్నాడు.
రోడ్డు మీంచి పదిహేను మీటర్లు నడిత్తే కానీ ఆ ఇంటికి చేరలేం. అక్కడ ఒక పెద్ద గేటుంది.
కేశవ అతని గురించి చెప్తా ‘‘ఇతనికి మా చెడ్డ పొగరు, అతన్ని ఎదిరించీవోళ్ళు బయపెట్టీవోళ్ళు ఏం చేసినా అడిగీవోళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరూ లేరు. ఊరికి చివరన ఉన్నా, ఊరిని, చుట్టుపక్కల ఊళ్ళ వోళ్ళందరినీ ఉచ్చ పోయిత్తన్న, అంటా కారు ఎనకాల ‘‘నరకాసురుడు’’ అని రాయించుకున్నాడు. అందరూ ఈడంటే భయంతో నరకాసురుడు అనే మాటాడుకుంటారు. అలా పిలుత్తారో లేదో తెలవదు. ఎందుకంటే ఊళ్ళో ఎవరూ ఆణ్ణి పిలవరు, మాటాడరు. తలారిగా ఉజ్జోగం చేత్తన్నాడు. ఆడికి తగ్గా ఉజ్జోగం’’ అన్నాడు.
ఇలా మాటాడుకుంటా ఆ డాబా దగ్గిరి కెళ్ళారు. ఆ డాబాకి నల్ల రంగులో పెద్ద పెద్ద అక్షరాలతో నాగులకోట అని రాసుంది. ఆ డాబాకి ఏసిన రంగులు ఉప్పుడుదాకా ఆళ్ళు ఎక్కడా చూళ్ళేదు.
కమ్యూనిస్టోళ్ళు కూడా ఇష్ట పడనంత ఎర్రని ఎరుపు, పచ్చ, నలుపు ఏసిన డాబా అది. ఎంత దూరం నించి చూసినా జిగేల్మమని కనిపిచ్చటమే కాదు. చూడలేక కళ్ళు మూసుకునీ లాంటి రంగు. అలా నడుచుకుంటా ముందుకెళ్ళీసరికి చిన్న షెడ్డుల్లా వున్నాయ్. ఆటికి ఇనుప చట్రాలు ఏసున్నాయ్. ఒక్కోదాంట్లో ఒక్కో జాతి కుక్కలున్నాయ్. చూడబోతే కుక్కల్లా కాకండా, మాంచి బలంగా, దిట్టంగా , చూత్తేనే భయమేసీలాగా పులుల్లా ఉన్నాయ్! కుక్కల తర్వాత ఒక దాంట్లో పంది కూడా ఉంది. దాని కాలుకి దెబ్బ తగిలినట్టుంది. కట్టు కట్టి ఉంది. అలా ముందుకెళ్తే గోని సంచుల నిండా బడ్విజర్ బీర్ ఖాళీ సీసాలున్నాయ్. కుక్కలు ఆళ్ళని చూసి పెద్దగా మొరగటం మొదలెట్టాయ్. ఆటి అరుపులు, అరిచీటపుడు ఆటి ఆకారాలు చూత్తే దడొచ్చింది. నిజానికి ఆటిల్లో ఏ ఒకటి బయట ఉన్నా లేకా ఆ ఇనుపచట్రాల గొళ్ళాలు తీసి ఉన్నా ఆళ్ళు బతికీవోళ్ళు కాదు. ఇంతలో ఆళ్ళ చూపులు పెద్ద గేటు, గేటు పక్కన గోడకి తగిలిచ్చిన బోర్డు మీద పడ్డాయి. ఆ బోర్డు మీద ‘‘ఇది యమలోకం ఇక్కడ యమ ధర్మరాజుంటాడు. యముడి రూల్సన్ని వేరుగా ఉంటాయి. ఇక్కడ యముడు చెప్పిందే వేదం తీర్చిందే తీర్పు, నిర్ణయించిందే న్యాయం. లోపలికి రావాలంటే నరకానికెళ్ళటానికి సిద్దపడితేనే బెల్ కొట్టండి ` ఇట్లు నరకాసురుడు’’ అని రాసుంది.
ఈలోగా కుక్కల మొరుగులకి లోపలినించి ఓ నడి వొయస్సు మనిషి నిక్కరేసుకుని ఖద్దరు బనీనుతో లంక పుగాకు చుట్ట కాలుత్తా వొచ్చాడు. అతన్ని చూడగానే కేశవ ‘‘మీరియ్య బాగున్నావా?’’ అనడిగాడు. ‘‘నరకంలో ఉన్నోడికి ఏం బాగుంటాది బాబయ్య? ఇంతకీ నువ్వెలా ఉన్నావ్, అమ్మగారి ఒంట్లో బాగుందా? మొన్న ఒళ్ళు నొప్పులకి ఇచ్చిన బిళ్ళలు బాగా పనిచేసాయని చెప్పు’’ అన్నాడు, చైతూని చూసి ‘‘ఈ అబ్బాయిగారెవరూ?’’ అనడిగాడు. ‘‘అక్కకొడుకు మీరియ్య, మా మేనల్లుడు, కాకినాడలో ఉంటాడు’’. ‘‘ఏదైనా ఉజ్జోగమా బాబుకి?’’ ‘‘లేదు ఇంకా చదువుతన్నాడు, ఉంకో ఏడాదిలో పూర్తవుద్ది, అప్పుడు లాయరౌతాడు’’ అని చెప్పాడు కేశవ. ‘‘పోన్లేబాబ బాగా చదువుకో మీయమ్మ నేను ఒకే ఈడోళ్ళం’’ అని చెప్పాడు.
‘‘అది సరే కానీ మీరియ్య మీ ఓనర్ గురించట చెప్పు, ఈడికి మా గొప్ప సరదాగా ఉంది. రేత్రి అడిగితే ఉప్పుడు తీసుకొచ్చాను’’ అన్నాడు కేశవ. ‘‘ఈడా, ఈడు నాకు ఓనరా నా తలకాయా? నా ఖర్మ కాలి మా చిన్నోడికి ఇరవై నాలుగ్గంటల నొప్పొత్తే ఊళ్ళో రైతులెవరూ అప్పివ్వా పోయీసరికి ఇక గచ్చంతరం లేక ఈడి దగ్గిర ముప్పై ఏలు, పది రూపాయల వొడ్డీకీ తీసుకున్నాను.
నెలదిరిగీటప్పుడికి మూడువేలు కట్టాల్సొచ్చీది. మూడు నెలలు కట్టాపోతే ఇంటికొచ్చి నాలుగు తన్నీసి పోయాడు, మరసటి రోజుకి కట్టమని. కట్టలే పోయాను. ముందు మా ఆవిడి బతిమాలుకుందామని ఇక్కడకొచ్చింది. దాన్ని ఇంట్లో ఎట్టి తాళవెట్టాడు. రొండు రోజుల తర్వాత తీసి నెల రోజులు ఇంటిపని, వొంటపని, పెంటపని చేయించుకున్నాడు. బతిమాలితే దాన్నొదిలి నన్నెట్టుకున్నాడు. మొత్తం బకాయన్నా తీర్చు లేదా ఆరు నెలలు పనిచెయ్యి నీ అప్పు కొట్టేత్తాను అన్నాడు.
ఇది ఐదో నెల, ఉంకో నెల పన్జేసి ఈ నరకం లోంచి బయటడాల! ఈడు చేసీ పాపాలు చూత్తా పాపం మూటకట్టుకోలేను. ఇలాంటోణ్ణి నేను సినిమాల్లో కూడా చూళ్లేదు’’ అని చెప్తా గేటులోంచి ఒకతను రాటం చూసి మాట మార్చీసాడు. అతను కుక్కలికి పెడిగ్రీ పెడతా ఉంటే అతనికి ఇనిపించకండా ‘‘ఈడో పిచ్చోడు, పెపంచంలో ఎవడికి నచ్చని ఆ నరకాసురుణ్ణి ఈడొక్కడే మంచోడంటాడు. ఏవన్నా అంటే ఆడి గురించి నీకేం తెల్సు అంటాడు.’’ అని ఆ వొచ్చినతను గురించి చెప్పాడు మీరియ్య.
నరకాసురుడు సంగతి చెప్తా ‘‘మడుషుల్ని మడుషుల్లా చూడ్డు గానీ కుక్కలకి అమలాపురం నించి ఏలు ఏలు తగలేసి మేత తెత్తాడు. ఇన్ని రోజుల్నించి ఆడికి అన్నీ టైముకి అందిత్తానా, నన్ను ఏ రోజూ తిన్నావా అని అడగడు. రోజూ ఆటికి మేతేసావా, అన్నీ బాగా తిన్నాయా? అనడుగుతాడు. ఆటికి రోజు తానం చేయిత్తాడు. ఆడికి ఎలా తెలుత్తాదో కానీ ఆటిని టైయానికి దాటిచ్చటానికి కూడా తీస్కెళ్తాడు. ఆటికి చిన్న దెబ్బ తగిలినా ఆస్పటల్కి తీస్కుపోతాడు. ఖరీదైన మందులేయిత్తాడు.
మొన్న ఓ ఊరపంది కాలు రత్తం కార్చుకుంటా వొచ్చింది. దాన్ని ఎత్తుకుని తానం చేయించమన్నాడు. తప్పక, కొడతాడేమోనని భయమేసి చేయిచ్చాను. ఆడు, నేను యానాం పశువులాస్పటల్కెళ్ళి డాట్టర్కి చీబెడితే ఆ దెబ్బకి మందు రాసి కట్టుకట్టారు. అప్పుణ్ణించి ఆ ఊరపంది అదిగో ఆ బోనులో ఉంది. మేం తిన్నా తినాపోయినా ఆటికి టైయ్యానికి మేతెట్టాల్సిందే, లేపోతే ఆరోజు నాకు దరువే! ఆడికంటే నేను పదేళ్ళు పెద్దోణ్ణి. అయినా నన్ను పచ్చి బూతులు తిడతాడు. తాగినప్పుడు మరీనీ! ఆడు తాగుతంటే నేను కాళ్ళు నొక్కాల. సరిగా నొక్కాపోతే చేతికందిన దాంతో కొడతాడు. పచ్చి బూతులు తిడతాడు’’ అంటా పైకి ఇనిపిచ్చకండా ఆణ్ణి బూతులు తిట్టుకున్నాడు మీరియ్య.
‘‘మరి ఇతనికి పెళ్ళాం పిల్లలు లేరా? ఇంత ఇంట్లో ఒక్కడే ఉంటాడా? అదీ ఊరి చివర సొశేనాల మజ్జిన, అయ్య బాబోయ్! ఇలాంటోణ్ణి నేనుప్పుడు దాకా చూళ్ళేదు’’ అన్నాడు చైతు. ‘‘లేకేం బాబా ఈడి పెళ్ళాం మాతల్లి చేనా అందగత్తి గిల్లితే పాలుగారినట్టుండీది. ఒక కొడుకు, కూతురు పుట్టారు. పిల్ల పిల్లోడు కూడా అచ్చం ఆళ్ళమ్మ పోలికే అందగాళ్ళు, మంచోళ్ళు.
ఓరోజు ఈడొచ్చీపాటికి ఆవిడిగారి ఊరి కుర్రోడు ఇక్కడ కేబుల్ దాంట్లో పన్చేత్తన్నాడు. ఆ కేబుల్ కుర్రోడు కనిక్షన్ బాగు చేయటానికొచ్చాడంట. ఆడి మీద ఈడికి అనుమాన మొచ్చింది. ఆ రేత్రే పిల్లలు పడుకున్నాక ఆ మాతల్లిని ఉరేసి చంపీసాడు. అది తెలిసి ఆ కేబుల్ కుర్రోడు ఊరుదిలి పారిపోయాడు. ఎక్కడికెళ్ళాడో ఇన్నేళ్ళైనా ఉప్పుడుకీ ఆ కుర్రోడి అజపజ లేదు. మూడేళ్ళు తర్వాత కూతురెవణ్ణో పేమించిందని కూతుర్ని కూడా ఉరేసి చంపీసాడు. శెవాన్ని కూడా కనిపిచ్చకండా మాయం చేసీసాడు. ఆ పిల్ల శెవాన్ని ఎవరిదో శెవం కాలుతన్న దాంట్లో పాడీసాడని అందరూ చెప్పుకుంటారు. ఇయ్యన్నీ చూసి కొడుకు ఆణ్ణి ఎదిరిచ్చలేక ఇంట్లోంచి పోయి ఆళ్ళ అమ్మమ్మ ఇంట్లో తల దాచుకుంటన్నాడు’’ అని చెప్పాడు.
‘‘మరి ఇన్ని దుర్మార్గాలు, హత్యలు చేత్తంటే ఎవరూ అతని మీద కేసెట్టలేదా?’’ అంటే ‘‘అదా ఆడు ఇంతమందిని బాగా ఉరేసాడని కాబోలు ఆడికి ‘‘తలారి’’ ఉజ్జోగం ఇచ్చారు. ఆడికి ఆ ఉజ్జోగం ఆడి పెళ్ళాన్ని చంపక ముందే ఉందిలే. అందుకే పోలీసులందరితో ఆడికి చనువే. పెద్ద పెద్ద ఆతికార్లుతో సహా! అందుకే ఆడిమీద ఏకేసిచ్చినా తీసుకోరు. అయినా ఆడిమీద కేసిచ్చీ అంత ధైర్నం ఎవలికి లేదు. ఊళ్ళో పెద్ద మోతుబరి రాగవరాజు గోరుకి కూడా ఈడంటే ఉచ్ఛే! ఆరికున్న పరపతికి ఈణ్ణి ఊళ్ళో లేకండా చేసీయ్యాల! ఆరు ఈడి ఊసెత్తరు. ఈడు కూడా ఆరి జోలికెల్లడు. ఆడి బతుకెట్టుకుని, బయపడ్డం కానీ, ఏడుత్తుం కానీ, నవ్వుతుం కానీ ఒక్కపాలి చూల్లేదు బాబా నేను. అలాంటోడీ రాచ్చసుడు. ఎలాంటి చావొత్తదో కానీ! లం….కొడుక్కీ!’’ అని తిట్టుకున్నాడు.
కేశవ చెప్పాడు ‘‘అవునొరే ఊళ్ళో ఓ జోక్ చెప్పుకుంటారు. ఈణ్ణి నవ్విచ్చినా, ఏడిపిచ్చినా, భయిపెట్టినా ఈ మూడాటిల్లో ఏది చేసినా ఆడికి రాఘవరాజు గారు అరెకరం ఇత్తారంట. ఎవరైనా పయత్నం చెయ్యండి’’ అని. ‘‘కానీ ఊళ్ళో అంత సీనెవరికీ లేదు. ఆడు లేనపుడు ఎనకాలే ఆడు ఈడు అని చెప్పుకోటం ఎదురు పడితే తలెత్తి చూసీ అంత ధైర్నం కూడా లేదెవడికి! ఆడితో అందుకే ఏ రకమైన సమ్మందాలు ఎట్టుకోరు. ఆడు కూడా ఎవరితోటీ సమ్మందం పట్టుకోడు. ఆడు ఇలా అందర్నీ భయపెడతా దౌర్జన్యంగా బతకటాన్నే గొప్పగా చెప్పుకుంటాడు.
ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్నా కరెంటు, రోడ్డు, నీళ్ళు ఎలా వొచ్చాయో తెలుసా? పంచాయితీ వోళ్ళని భయపెట్టి ఏయించుకున్నాడు. కేబుల్ తీయించీసి డిష్ ఏయించుకున్నాడు. ఆడికి మాత్రమే బిల్ కడతాడు. మిగతా ఆటికి దేనికీ బిల్ కట్టడు. అసలు బిల్లే రాదు. ఆ కరెంటు, పంచాయితీ ఎకౌంటే. ఇక నీటి పన్ను, ఇంటి పన్ను సరేసరి.
యానాం బైపాస్‌లో రాజుల బార్ నించి నెలకి సరిపడా బడ్విజర్ బీర్లు 5 కేసులు తెచ్చుకుంటాడు. కొనుక్కుని కాదు. ఆళ్ళనీ భయింపెట్టే! ఈడితో ఎందుకొచ్చిన తలపోటు అనుకుని చేలామంది ఆళ్ళ పెశాంతత పోగొట్టుకోటం ఇష్టం లేక, ఇలా ఆడు ఆడమన్నట్టు ఆడతన్నారు’’. ‘‘మీరియ్యా! ఈడు నీకు ఎన్నాళ్ళ నించి తెల్సు?’’ అంటే ‘‘ఓ పదేళ్ళు నించి తెల్సు బాబా అప్పుడు కొంచుం బాగానే ఉండీవోడు. రాను రాను రాచ్చసుడి కంటే దుర్మార్గంగా తయారయ్యాడు.
ఈడి చావు కోసం చూసీ ఓళ్ళలో నేను మొదటోణ్ణి, రొండోవోడు అదిగో ఆ ఆవుకి దాణా ఎడతన్నాడూ ఆడు. ఆణ్ణి కూడా పెళ్ళానికి బాగోపోతే ఓ లచ్చిచ్చి అది తీర్చాపోతే ఆడి పెళ్ళాన్ని మొన్నటి దాకా ఉంచుకున్నాడు. ఓ నెల కితమే ఆ మడిషి కదల్లేనంత జబ్బుదైపోతే అంపీసాడు. ఆ ఆవుని తోలుకొచ్చి కట్టీసి, అది సూడిది అది ఈనీ దాకా దాన్ని మేపమంటే ఆడు ఒప్పుకుని పన్చేత్తన్నాడు. ఆడికి ఓపికలేక కానీ లేపోతే ఆడే సంపెద్దుడు ఈణ్ణి. అంత కసుంది ఆడికి. ఈ లం..కొడుకు మీద’’ అని చెప్పాడు.
ఈలోగా ఇందాక కుక్కలకి పెడిగ్రీ ఎట్టినతను వొచ్చాడు ఆళ్ళ దగ్గిరికి. అతని పేరు సుందర్రావు. ‘‘ఎవరు మీరు ఈడికేమౌతారు?’’ అనడిగాడు. ‘‘మాదీవూరే, మీరియ్య మా మేనమావే అవుతాడు. మా మేనల్లుడు ఊరునించి వొత్తే మీరియ్యని పలకరిందామని తీసుకొచ్చా’’ అని చెప్పాడు కేశవ.
‘‘మరి మీ ఇసయాలు మాటాడుకోకండా మావోడు గురించి ఎందుకు మాటాడుకుంటన్నారు?’’ అనడిగాడు. ‘‘ఓ అదా మావోడు ఈ బోర్డు చదివి ఆశ్చర్యంగా అడుగుతంటే మీరియ్య మాయ తనకి తెల్సిందేదో చెప్తన్నాడు అంతేనండి’’ అన్నాడు కేశవ.
‘‘ఆడు చెప్పిందంతా ఇన్నాను. మావోడి గురించి ఈడికేం తెలుసని చెప్తున్నాడు? మా భూషణంగాడు నాకు చిన్నప్పుణ్ణించి తెలుసు. ఆళ్ళది కొమరాజులంక. ఆళ్ళ నాన్న రాజుల దగ్గిర పాలేరుతనం చేసీవోడు. ఆడికి ఆళ్ళమ్మన్నా, ఆడి చెల్లెలన్నా చేలా ఇది. ఆడి చెల్లెలు పిచ్చిది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా నయిం కాలేదు. ఆఖిరికి రాయిమండ్రి దానవాయిపేటలో ఉండీ మానస ఆసుపత్రిలో మందులాడిచ్చినా తగ్గలేదు.
ఓ ఏసంగి సెలవుల్లో ఈడు ఆళ్ళ మేనమామ గారూరు దేవరపల్లి ఎల్లాడు. ఆడొచ్చీసరికి ఆళ్ళ చెల్లి ముందురోజు రేత్రినించి కనబడట్లేదని చెప్పింది ఆళ్ళమ్మ. ఆడు, ఆళ్ళ నాన్న, ఆళ్ళ అమ్మ చెరో పక్కకి ఎళ్ళి ఎతికారు దొరకలేదు. పోలీటేషన్లో ఫిర్యాదు చేసారు. అన్ని బస్టాండుల్లో పోస్టర్లంటిచ్చారు. ఎన్ని చేసినా పిల్ల దొరకలేదు. వోరం రోజుల తర్వాత ఓ ఆడపిల్ల శెవం ముక్తేశ్వరం రేవులోకి కొట్టుకొచ్చింది.
ఆ శెవం బాగా ఉబ్బి పోయి బట్టలు చిరిగిపోయి ఒళ్ళంతా నాచట్టీసి మొఖం చేపలు కొరికేయటం వొల్ల గుర్తుపట్ట లేనంతగా మారిపోయింది. ఆ శెవాన్ని తీస్కుని ఇంటికొచ్చీసరికి పోలీసోల్లొచ్చారు. ఆ శెవాన్ని పోస్టుమార్టమ్ చేయించారు. చేసిన డాట్టర్ ఆ అమ్మాయిని ఎవరో వికృతంగా మానభంగం చేసి, హింసించి చంపీసి గౌతమిలో పడీసారని చెప్పాడు. అది ఇని ఆళ్ళమ్మ గుండాగి సచ్చిపోయింది. ఆళ్ళ నాన్న పిచ్చోడై పోయాడు.
ఆ సంఘటన ఆడిలో ఎంత మార్పు తెచ్చిదంటే ఆడికి మొత్తం మడుసులన్నా ప్రేమలన్నా అసహ్యం. ఆళ్ళ నాన్న ఆ సంఘటన జరిగాక ఐదేళ్ళు బతికి సచ్చిపోయాడు ఆ బెంగతోటే. ఆ తర్వాత ఆడు, నేను ఆ ఊరొదిలి ఈ ఊరొచ్చీసాం. ఆడు నన్నూ కూడా మడిసిలా చూడ్డు. కానీ నేనూ వొదిలేత్తే ఆడెంత మందికి పెమాదకరమో నాకు తెలుసు. అందుకే నేను ఆడి కూడానే ఉంటన్నాను’’ అని చెప్పాడు.
‘‘మరి మీరు కూడా ఉంటే ఆళ్ళావిణ్ణి, కూతుర్ని ఎందుకు చంపాడు?’’ అనడిగాడు కేశవ. ‘‘ఓ అదా! నేను ఆడి కూడా జీవితాంతం ఉంటానేంటి అనుకుని, సమ్మందం చూసి పెళ్ళి జేసాను. భార్యని కూడా బాగానే చూస్కునీవోడు. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు గందా! ఇంక బాగానే ఉంటాడనుకున్నాను.
నాకు డక్కన్ సిమెంట్ పేట్రీలో ఉజ్జోగం వొత్తే పెళ్ళాం, పిల్లల్ని తీసుకుని మిర్యాలగూడ దగ్గిరున్న దాచేపల్లి ఎళ్ళిపోయాను. అలా నేను దగ్గిర లేనప్పుడు ఇదంతా జరిగింది. పోయినేడే మా ఇంటిది జబ్బుజేసి సచ్చిపోతే పిల్లలిద్దర్నీ ఆస్టల్లో జామిన్ చేసి ఈణ్ణి కనిపెట్టుకుంటా నేనిక్కడ ఉంటన్నాను.’’ అని చెప్పాడు. ఇంత దుర్మార్గుణ్ణి చూడ్డమే ఇడ్డూరం అనుకుంటే ఇలాంటోడి కోసం ఇంత త్యాగం చేసీ జెతగాణ్ణి చూడ్డమూ మహా ఇడ్డూరంగా ఉంది ఆళ్ళకి. మరి మీకో?
ఇలా అనుకుంటుండగా కేశవ అతన్ని చూసి ‘‘బాబాయ్ పెద్దాడ రాజు గారని ఊళ్ళో ఓ మోతుబరి రాజుగారున్నారు. పంచాయితీ కచేరి కాడ రోజూ పందాలేసుకుంటా వుంటారు. ఓరోజు ఆయిన ‘‘ఊరి చివరుంటాడే నరకాసురుడు ఆణ్ణి ఊళ్ళో ఎవరైనా ఏడిపిచ్చినా లేదా నవ్విచ్చినా, భయింపెట్టినా పదేలిత్తాను అదే పందుం అన్నాడు. అక్కడ కూచున్న మిగిలినోళ్ళతో.
అప్పుడక్కడున్న ఉంకో రాజుగారు అవునొరే నేనీవూరొచ్చి పాతికేళ్ళైంది. ఆడు పరిచయమైయ్యి పదిహేనేళ్ళైంది. ఇన్నేళ్ళలో ఆడు నవ్వుతుంగానీ, ఏడుత్తుంగానీ, భయపడతం కానీ చూళ్ళేదు. నిజంగా ఆణ్ణి ఏడిపిచ్చినా, నవ్విచ్చినా పదేలేంటి పాతికేలియ్యొచ్చు అంటంటే రాఘవరాజుగారైతే గెలిసినోడికి అరెకరం ఇత్తానన్నాడంట. అక్కడున్నోళ్ళందరూ ‘‘అవునొరే ఈ పందుం నెగ్గినోడు మటుకు నిజంగా మొగోడే’’ అన్నారు. ఎవరూ ముందుకి రాలేదు కానీ ఈ పందెం గొడవ ఆడు నవ్వడని, ఏడవడని ఊరంతా ఇలాంటి మడిసిని ఇంక చూడం అని ఇచిత్రంగా చెప్పుకుంటన్నారు బాబాయ్. నేననుకుంటన్నాను ఎవరైనా పదేలిత్తాను నవ్వమంటే నవ్వడా, ఏడమంటే ఏడవడా? అన్నాడు కేశవ. అప్పుడు సుందర్రావు చెప్పాడు ‘‘ఆడు ఎవరో సెప్పారని ఏదీ చెయ్యడు. డూటీలో తప్ప ఇంకెక్కడా ఎవరి మాటా ఇనడు. నిజమే ఆడు నవ్వతం, ఏడుత్తం, భయిపడతం నేను కూడా చూల్లేదు. ఎప్పుడో ఆడి చెల్లి సచ్చిపోయినపుడు చూసాను. చివరిసారి ఆడు ఏడుత్తుం. ఆ తర్వాత ఆళ్ళమ్మ పోయినపుడూ, నాన్న పోయినపుడూ కూడా ఏడుత్తుం చూల్లేదు. ఇక నవ్వటం అంటావా పెళ్ళపుడో, ఆడి పిల్లలు పుట్టినపుడో సూద్దామనుకున్నాను. అప్పుడు కూడా కనబల్లేదు. ఆడి జీవితంలో అన్ని యాంత్రికమే ఆడి గుండి రాjైుపోయింది’’ అని చెప్పాడు సుందర్రావు.
‘‘ఆడికి తినాలనిపిత్తే తింటాడు, తాగాలనిపిత్తే తాగుతాడు, పడుకోవాలనిపిత్తే పడుకుంటాడు, కొట్టాలనిపిత్తే కొడతాడు. ఎదుటోడు ఎంత పెద్దోడైనా, పేదోడైనా, పెద్దోడనీ భయిం కానీ, పేదోడనీ జాలి కానీ చూల్లేదు ఉప్పుడిదాకా. ఏ పనికీ ఇష్టం, అయిష్టం లాంటి ఇశేషాలేమీ ఉండవు ఆడికి’’ అన్నాడు మీరియ్య.
‘‘ఇంత కడుపు మంటెట్టుకుని పైకి ఏమీ లేనట్టు ఎలా నటిత్తున్నావురా మీరిగా’’ అనడిగాడు సుందర్రావు కోపంగా! ‘‘ఎంతమంటున్నా ఆణ్ణెదిరించి బతగ్గలమా? జాలి దయ అంటే ఏంటో తెలీనోడు. ఆడి డబ్బు ఆడి మొఖం మీద కొట్టి అప్పుడు పోతాను. ఆడప్పు తీరిందాకానే ఈ తిప్పలు’’ అన్నాడు మీరియ్య.
‘‘నేనో ఇసయమడుగుతాను నిజం జెప్పు, నువ్వు అప్పు అడిగినప్పుడు ఎలా అడిగావ్, ఏమనడిగావో చెప్పు’’ అన్నాడు. ‘‘అన్న మా అబ్బిగాడికి బాలేదు, డబ్బులవసరం ఓ ముప్పై ఏలు కావాలి’’ అనడిగాను అని చెప్పాడు మీరియ్య. ‘‘దానికి ఆడేమి చెప్పాడు’’ అనడిగాడు సుందరియ్య. ‘‘ఇత్తాను వడ్డి నూటికి పది రూపాయలు, అసలు ఆరు నెలల్లో తీర్చాలి. నెలనెలా వడ్డి ఐదో తారీఖు కల్లా కట్టాలి. ఐదు దాటితే ఇంట్లో ఏదుంటే అదట్టుకొచ్చెత్తాను’’ అన్నాడు. ‘‘ఏదో మాట వరసకి అన్నాడనుకున్నాను. కానీ నిజంగా అట్టుకెల్లటానికి ఏమీ లేపోతే మా యావిడిని తీసుకొచ్చి నెల రోజులుంచుకుని, ఇంటిపని, వంటపని, పెంటపని చేబిచ్చుకునీవోడు. అది చూసి తట్టుకోలేక దాన్ని అంపీసి దాని బదులు నేనొచ్చాను. ఆ పనులన్నీ నాతో చేబిచ్చుకుంటున్నాడు దొంగనాకొడుకు. ఉంకో నెల రోజులు చేత్తే అప్పు తీరిపోద్ది’’ అని చెప్పాడు మీరియ్య. అప్పుడు సుందర్రావు ‘‘ఇన్నారా బాబా ఆడు ఏ ఇసయం అబద్దం చెప్పడు. అన్నీ ముందే చెప్పాడు. అప్పుడీడికి అప్పు తీసుకోటమే కానీ తీర్చటం గురించి ఆలోచన లేదు. అందుకే ఆడు చెప్పిన అన్నీట్లికి తలాడిరచి
ఉప్పుడిలా శాపనాకారాలెడతన్నాడు ఎదవ’’ అంటా రుసరుసలాడాడు. ‘‘మరి ఆళ్ళావిడ సచ్చిపోయినపుడో, కూతురు సచ్చిపోయినపుడో ఎవరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా?’’ ధైర్యం చేసి అడిగాడు చైతన్య. ‘‘ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో ఓళ్ళకి కూడా ఆడంటే ఉచ్ఛే. మామూలోల్లకేంటి పోలీసోల్లకి కూడా ఈడితో ఎందుకొచ్చిన తంటా అనుకుంటారు. ఎవరూ కంప్లైంట్ ఇయ్యరు. ఇచ్చినా ఆళ్ళు తీసుకోరు. అయినా ఆడు కూడా పోలీసోడే కదా! ఆడికి జిల్లా కోర్టులో తలారి ఉజ్జోగం’’ చెప్పాడు మీరియ్య. ‘‘ఆ ఉజ్జోగం ఇయ్యన్నీ చేసాక వొచ్చిందా, వొచ్చాక చేసాడా?’’ అడిగాడు చైతు. ‘‘ఉజ్జోగమొచ్చాకే’’ చెప్పాడు మీరియ్య.
‘‘ఆడి గురించి అంత దారుణంగా మాటాడుకుంటన్నారు. ఆడికి కుక్కలన్నా, పిల్లులన్నా, పక్షులన్నా ఆఖిరికి పందులన్నా కూడా ఇట్టమే. ఈ కుక్కలూ అని అక్కడ బోనులో ఉన్న ఆల్షేషన్ని చూపిత్తా, దీన్ని ముఫ్పై ఏలకి కొన్నాడు. డాబర్మెన్ని చూపిత్తా దీన్ని యాభై ఏలకి కొన్నాడు అంటా బయటికొదిలితే మనిషిని చీల్చేసీ లాగున్న పులుల్లాంటి కుక్కల్ని చీబిచ్చాడు. ఆ పక్క బోనుల్లో ఉన్న కాకి, నెమలి, డేగ, రసంగి రకాల పందుం పుంజుల్ని, కొమ్ములు తిరిగిన ఎర్రబట్టు గొర్రెల్ని చీబిచ్చాడు. ఇయ్యన్ని మేపటానికి నెలకి లచ్చపైనే ఖర్చు చేత్తాడు. ఆటికి సిన్న రోగమొచ్చినా ఎంటనే పశువుల డాట్టర్ కాకర చిన్నంరాజు గారికి కబురెట్టి వైజ్జిం చేయిత్తాడు. ఆడికి మడుసులంటేనే పగ, నోరు లేని జంతువుల మీద ఎంత మవకారమో’’ అని దీర్ఘాలు పోయాడు సుందర్రావు.
‘‘చేలా ఇడ్డూరమే మడుసులని మడుసుల్లాగ చూడ్డుకానీ జంతువుల్ని చూత్తాడంట’’ అంటా ఎటకారమాడాడు మీరియ్య.
‘‘అవున్రా ఆడి గుండెకి చిన్నప్పుడెప్పుడో గాయిమైంది. అది మాన్పీ మందు లేదు. అందుకే ఆడలా అయిపోయాడు. అంతే కానీ ఆడూ మడిసే కానీ, అందరిలా మంచోడనిపిచ్చుకోవాలనీ కుతి లేదు, నటనా లేదు.
మడుసులంతా ఎంత ఎలాటోళ్ళైనా మంచోళ్ళు కిందే నటిత్తారు. ఆడలా నటిచ్చడు. అందుకే ఆడి కారు మీదే నరకాసురుడిని అని రాపించుకున్నాడు. ఆడికి ఆణ్ణి చూసి పేమించీవోళ్ళు కంటే ఆణ్ణి చూసి భయపడీ వోళ్ళంటేనే ఇట్టం. ఏ నాటకాలు ఆడనోడాడు’’ అంటా ముక్తాయించాడు సుందర్రావు.
ఇలా మాటాడుకుంటా ఉండగానే మజ్జాన్నం ఒంటిగంటై పోయింది. ‘‘ఒరేయ్ అమ్మ మనకోసం తినకుండా ఎదురు చూత్తది. ఎళ్దాం పద’’ అంటా తొందరపెడితే ‘‘సరే బాబాయ్ ఎళ్తాం చేలా కొత్త కొత్త ఇసయాలు ఇన్నాం ఇతని గురించి. ఇలాంటి మనిషిని ఉప్పుడుదాకా ఎక్కడా చూళ్లేదు. ఇలాంటి మనిషి గురించి ఎక్కడా ఇనలేదు. సరే ఎళ్తన్నాం’’ అంటా చైతు, కేశవ అక్కణ్ణించి బయిదెల్లారు.
ఇంటికొచ్చీ వొరకూ చైతూ, కేశవని అడుగుతానే ఉన్నాడు ‘‘మాయా అతని గురించి ఆళ్ళు చెప్పినియ్యన్ని నిజాలేనా? అసలు నవ్వని మనిషంటూ ఉంటాడా? పోనీ నవ్వాపోయినా ఏదో దానికి జాలెయ్యని మనిషి, ఏడుపు రాని మనిషి, భయమెయ్యని మనిషి ఉంటాడా? ఆళ్ళు మరీ ఎక్కువ చేసి చెప్పినట్టున్నారు కదా?’’ అన్నాడు. ‘‘అలా ఏం కాదురా నేనూ ఆడి గురించి అలాగే ఇన్నాను. ఆడి దుర్మార్గాల గురించి ఊళ్ళో కొమ్ములు తిరిగిన వొత్తాదులు కూడా ఆడితో పెట్టుకోడానికి భయపడ్డం గురించి చిన్నప్పుణ్ణించి చేలానే ఇన్నాను. అయన్నీ నిజాలేరా!’’ అన్నాడు.
ఇంతలో ఇంటికొచ్చీసారు. రాజ్యలక్ష్మి ఈళ్ళని చూసి ‘‘ఏరా ఉప్పుడుదాకా ఎక్కడున్నార్రా అన్నం గొడవ మర్చిపోయినట్టున్నారు. కాళ్ళు చేతులు కడుక్కుని బేగారండి. అన్నాలు తిందిరిగాని’’ అంది. ‘‘అమ్మమ్మా మేము వాకిట్లోనే కూర్చుని తింటాం. అన్నం కూరలు ఇక్కడికే తెచ్చెయ్ అనీసరికి కేశవ ఏప చెట్టు కింద పట్టిమంచం వాల్చి లేపాక్షిలో కొన్న కళంకారి దుప్పటి పరిచాడు. రాజ్యలక్ష్మి పొద్దున్న బయ్యన్న సీరమేను ఇంటికి తెచ్చిత్తే, చింతకాయేసి ఇగురొండిరది. గుడ్డు పీతల్లో వంకాయేసి ఇగురెట్టింది. అయ్యి ఏడేడిగా వొడ్డిత్తంటే ఆకలిమీదున్నారామో కబుర్లాడుకుంటా ఆబగా తినీసారు. ఇద్దరికీ తిండెక్కువైపోయి నిద్దరొచ్చీసింది. ఆ ఏపచెట్టు నీడలోనే ఆ మంచం మీదే నిద్రోయారు.
ఆ తర్వాత చైతు రొండ్రోజులుండి ఎళ్ళిపోతంటే ఆళ్ళమ్మమ్మ బయ్యన్నకి చెప్పి రప్పించిన సీరమేనుతో గారిలేసి ఇంటికి పట్టుకెళ్ళ మనిచ్చింది. అయ్యట్టుకుని బయిదెల్లాడు చైతన్య! ఎళ్ళీటప్పుడు ‘‘కాలేజీకి ఎళ్ళీ ముందోసారి కనిపించి ఎళ్ళరా’’ అని ఆళ్ళమ్మమ్మ అంటే సరేనన్నాడు.
లిలిలి
చైతన్య నల్సార్ యూనివర్శిటీలో ఫైనలియర్ చదూతున్నాడు. ఉంకో తొమ్మిది రోజుల్లో కాలేజి మొదలవ్వుద్ది. వోరం రోజుల్లో ఐద్రాబాద్ ఎల్లాల. ఆ ఇసయం చెప్పటానికి అమ్మమ్మ దగ్గిరికొచ్చాడు. ఆరోజు ఆఊరంతా గగ్గోలుగా ఉంది. ఊరంతా ఊరి చివర సొశానాల్లో నరకాసురుడి ఇంటి వైపు ఎళ్తన్నారు, అందరూ! ఇంటికొచ్చీసరికి కేశవ కూడా అక్కడే ఉన్నాడని ఆళ్ళమ్మమ్మ చెప్తే చైతూ కూడా అక్కడికే ఎళ్ళాడు. అప్పుడుకే జెనం గుంపులు గుంపులుగా ఉన్నారు.
చైతూని చూసి కేశవ ఎదురొచ్చి పలకరిచ్చాడు. ‘‘ఏవైంది మాయా ఊరంతా ఇక్కడున్నారు?’’ అనడిగాడు చైతు, ‘‘ఎవరూ నమ్మలేంది, ఊహించంది ఒకటి జరిగిందిరా చైతు. నరకాసరుడు సచ్చిపోయాడు’’ అని చెప్తుంటే ‘‘నిజమా మాయా? ఎటకారమాడకు నిజం చెప్పు, పాపం మీరియ్యని కానీ ఆడు చంపేశాడా? లేదా ఇంకేవైనా జరిగిందా నిజం చెప్పు మాయా’’ అని ఆత్రం తట్టుకోలేపోతన్నాను అన్నట్టు బతిమాలాడు.
‘‘నిజంరా నిజంగా చచ్చిపోయాడు’’ అని నమ్మకం కలిగీలా చెప్పాడు. ‘‘ఎలా చచ్చిపోయాడు, ఏక్సిడెంటా? లేదా ఎవరైనా ఏమైనా చేసారా?’’ అంటానే ‘‘ఆణ్ణెవరు ఏం చేయగలరులే! ఎవరైనా ఏవైనా చెయ్యటానికొచ్చినా పులుల్లాంటి కుక్కల్నొదిలేత్తాడు అయ్యి ఎలాంటోణ్ణైనా చంపి పాడేత్తాయ్!’’ అన్నాడు.
‘‘అసలెలా చచ్చిపోయాడు మాయా తొరగా చెప్పు’’ అని బతిమాలాడు. ‘‘కంగారు పడకరా అంత టెన్షన్ దేనికి ఆడు ఉరేసుకుని సచ్చిపోయాడు’’ అని నమ్మలేని మరో సంచలన ఇసయం చెప్పాడు. ‘‘అవునా?’’ అంటా గట్టిగా అరిచాడు చైతు నమ్మలేక! ‘‘అవును, ఆణ్ణి చంపాలంటే ఆడు తప్ప ఆణ్ణెవరూ చంపలేర్రా’’ అన్నాడు కేశవ.
‘‘మాయా, మీరియ్య దగ్గిరికెళ్దాం నడు అసలేం జరిగిందో తెలుసుకుందాం’’ అని తొందరెట్టాడు. ‘‘నాగులకోట’’ అని రాసున్న ఎరుపు పచ్చ నలుపు రంగుల ఆ ఇంటి ముందుకొచ్చారు. అక్కడ టెంట్లో కుర్చీలో కూచ్చుని బోరున ఏడుత్తున్న ఓ ఆడమనిషి, ఆవిడనోదారుత్తున్న సుందర్రావు కనిపిచ్చారు. ఊరంతా అక్కడే ఉన్నా ఆడి కోసం ఏడుత్తున్నది మాత్రం ఈళ్ళిద్దరే!
మీరియ్య కోసం ఎదికితే అప్పుడే లోపల్నించొచ్చాడు. ఈళ్ళని చూసి దగ్గిరి కొచ్చాడు. మీరాసాహెబ్ చైతుని ‘‘ఎప్పుడొచ్చావ్ బాబా’’ అని అడగ్గా ‘‘ఉప్పుడే బాబాయ్’’ అని జెప్పి ‘‘అదేంటి బాబాయ్ అతనెలా చచ్చిపోయాడు. మాయ ఉరేసుకున్నాడంటన్నాడు నిజవేనా?’’ అంటే ‘‘నిజమే బాబా! ఉరేసుకునే సచ్చిపోయాడు’’ అన్నాడు. ‘‘అసలేమైంది?’’ అనడిగాడు చైతు.
‘‘ఊళ్ళోకి కొత్తగా కొబ్బరి కొట్టెట్టిన భూపాల్‌రెడ్డి తెల్సా నీకు?’’ అన్నాడు కేశవని చూసి! ‘‘అవును తెల్సు,’’ ‘‘అతని కూతురెవడో కుర్రోణ్ణి పేమించిందట. అతను ఈడికి ఆ గొడవ చూడమని చెప్పాడంట. ఈడు ఆ పిల్లని రేత్రికి రేత్రి బెంగాల్లో ఉన్న ఆళ్ళ తమ్ముడి గారింటికి అంపీసి గుండు చేయించేసారంట. ఈ కుర్రోణ్ణి ఈడు లచ్చ రూపాయలు తీసుకుని చంపీసి ఎదుర్లంక, కరవాగులంక, దాటాక భైరాలంకలో మూటకట్టి గౌతమి నదిలో పాడీసాడంట.
ఆ కుర్రోడి అమ్మ ఆడి కోసం ఎతుకుతా ఎతుకుతా మొన్న ఈడు కొత్తపేట పోలీటేషన్ కెళ్ళినపుడు ఆవిడి ఆళ్ళబ్బాయి ఫొటో చూపిత్తా బోరు బోరున ఏడుత్తా ‘‘అయ్యిగారూ ఈయబ్బాయి నా కొడుకు మూడు రోజుల్నించి కనపడతా లేదు. నిన్నొత్తే తవరు ఫొటో తెమ్మన్నారు అంటా ఎస్ఐకి చెప్తుంటే ఎదర కుర్చీలో కూర్చున్న ఈడు ఆ ఫొటో తీస్కుని చూత్తే అప్పుడు ఈడికి అర్ధవైందంట ఆ కుర్రోణ్ణి చంపీసినోడు ఈడేనని!
ఉంకో షాక్కొట్టిన ఇసయం ఏంటంటే ఆవిణ్ణి అప్పుడు చూసాడంట. ఆవిడి ఆళ్ళ చెల్లేనంట. చచ్చిపోయిందనుకున్న ఆ పిల్ల బతికే ఉందంట. అదిగో ఆవిడే అక్కడ కూచ్చుని ఏడుత్తున్నావిడ’’ అంటా చీబిచ్చాడు. ఆవిణ్ణి పట్టి పట్టి చూత్తే పోలికలు తెలుత్తున్నాయి. ఆ పక్కనున్న కుర్రోడు ఆవిణ్ణి ఓదారుత్తున్నాడు ఆ అబ్బాయి నరకాసురుడి కొడుకు కానీ ఒక్క చుక్క కూడా కార్చటంలేదతను.
మీరియ్య దగ్గిర్నించి సుందర్రావు దగ్గిరికెళ్ళారిద్దరూ. పలకరిచ్చి ‘‘ఈవిడి ఆయన చెల్లెలంట కదండీ ఈవిడి సచ్చిపోయిందన్నారు కదండీ? అని ఆశ్చర్యంగా నెమ్మదిగా అంటే అతను పక్కకొచ్చి ‘‘అదా? ఈవిడి ఆడి చెల్లిలే! ఈవిణ్ణి ఎవడో తీసుకుపోయి వాడీసుకుని మోజు తీరాక బైటికి గెంటీసాడంట. ఈవిణ్ణి చూసి ఎవరో మహానుభావుడు రామకృష్ణ మిషనోళ్ళ ఆస్పటల్లో జామిన్ చేసాడంట. ఆళ్ళు ఈవిడికి నయిమయ్యాక ఒకతనితో పెళ్ళి చేసి అంపారంట.
ఇదంతా జరిగాక ఈ పిల్ల ఆళ్ళూరెళ్లి ఆళ్ళ వోళ్ళ గురించి అడిగితే అమ్మ నాన్న సచ్చిపోయారని అన్నియ్య ఎక్కడికో ఎళ్లిపోయాడని ఎక్కడున్నాడో తెలవదని చెప్పారంట. ఈవిణ్ణి ఆళ్ళాయన చేలా బాగా చూసుకునీ వోడంట. అతను జబ్బు చేసి సచ్చిపోయాడంట. ఆళ్ళ కొడుకుని కూలీ నాలీ చేసి పేణంగా పెంచుకుంటా ఇంజనీరింగ్ చదివించిందంట. ఆ కాలేజీలో పరిచయమైన అమ్మాయి వల్లే ఆడి పేణం పోయింది. ఆ పేణం తీసింది ఈవిణ్ణి పేణానికి పేణంగా పేమించిన ఆళ్ళన్నియ్యేనంట. ఎవరి కోసం ఆడు ఇలా మృగంలా తయారయ్యాడో ఆవిడి సచ్చిపోలేదని సుఖంగా ఉందని తెలిసి ఎంతో సంతోషించాడంట. కానీ ఆవిడి కొడుకుని తన చేతుల్తోనే, కాళ్ళట్టుకుని బతిమాలుతన్నా, వదలకండా కర్కసంగా కొట్టి కొట్టి సంపీసాననీ పశ్చాత్తాపంతో రేత్రి ఎక్కెక్కి ఏడ్చాడు. ఆళ్ళ చెల్లి బతికే ఉందని చెప్తా ఎంత నవ్వాడో! ఆడు నవ్వటం, ఏడ్వటం రొండూ రేత్రే చూసాను. కానీ ఆళ్ళ చెల్లిని చూసి ఆ కుర్రోడు గేపకం వొచ్చి తట్టుకోలేక అపరాధ భావంతో తెల్లారగట్ల ఉరేసుకుని సచ్చిపోయాడు’’ అని ఏడుత్తా చెప్పాడు సుందర్రావు.
ఇంతలో పోలీసులొచ్చారు. శెవాన్ని దించి పోస్టుమార్టమ్‌కి అంపారు. ఆళ్ళు మాటాడుకుంటంటే ఇన్నారు చైతు, కేశవ, సి.ఐ. చెబుతున్నాడు ఎస్.ఐ.కి ‘‘జిల్లాలో వున్న ఒకే ఒక తలారి ఉరేసుకుని సచ్చిపోయాడు. ఈడికిలాంటి కృారంగా ఉండీవోడిరక దొరకడు’’ అని.
చైతు, కేశవ అక్కణ్ణించి వొత్తంటే దూరంగా సిలోన్ పెంతుకోస్తు చర్చిలోంచి ప్రసంగం లీలగా ఇన్పిత్తంది. పాస్టర్ జాకబ్ రాజు గారు చెబుతున్నాడు. ‘‘మనిషి ఏ ఆయుధం చేతబడితే దానితోటే నశించిపోతాడని ఏసు ప్రభువు తన శిష్యుడు పేతురుతో చెప్పారు’’ అని. అవును అది ఇతని ఇసయంలో నిజమైంది. అతను ఎంతోమందిని ఉరేసి చంపీసాడు. కూతురిని, భార్యని, ఆఖిరికి మేనల్లుడిని, చివరికి తను కూడా ఉరేసుకునే సచ్చిపోయాడు.
ఆ నరకాసుర వధకి దేవత దిగి రావాల్సొచ్చింది. ఈ నరకాసురుణ్ణి చంపటానికి ఆడిలో పుట్టిన మనిషే సరిపోయాడు.








వ్యాక్యాన్ని జతచేయండి