తనను తొలిసారి చూసినప్పుడే
నాలో తొలకరి ప్రేమ చిగురించింది.
ఒకసారి వరిసేను కొత కోయడానికి
కూలీ పిలవడానికి తన ఇంటికెళ్తే
పెళ్లి చూపులు అనుకొని
తలుపు చాటుకు ఉండి తొంగి తొంగి చూడబట్టే
వరిసేను కొస్తున్నప్పుడు
వేలు తెగితే నలిపి పసురు పెట్టితే
గోరింటాకు అనుకొని మురిసిపోయింది.
వరిమోపు ఎత్తుతుంటే
తన తలపై రాలిన వడ్ల గింజలను
చూసి తలంబ్రాలు అనుకొని
సిగ్గుతో తల దించుకుంది
నన్ను యాది చేసుకుంటూ
వరికల్లంలో వెయ్యాల్సిన మోపు
కంది కల్లంలో వేసింది
పాపం పిచ్చిది
నన్ను ఇంకా తలుచుకుంటూ
కూరలో చిటికెడు వెయ్యాల్సిన ఉప్పుకి
దోశెడు ఉప్పు వేసి వాళ్ల అమ్మతో
ఎన్ని సార్లు చివాట్లు తిన్నదో..!
తను
వాకిట్లో ముగ్గులు వేస్తుంటే
నింగిలోని చుక్కలన్నీ నేలకు దిగిరావాల్సిందే
తను బోనం కుండ ఎత్తుకోని
నిలబడిందంటే
చందమామ ఏ వైపు ఉన్నా
తన వైపు తిరగాల్సిందే
తను మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని నడిచొస్తుంటే
అచ్చం చందమామ నడిసొచ్చినట్టే ఉంటది.
తను
నడిచే పాదాల కింద మట్టిని తీసుకుని
ఒళ్లంతా పూసుకోవాలనిపిస్తది
తన నడుమున ఉన్న నీళ్లబిందె
తన తనువును తాకుతూ
ఎన్నిసార్లు పరవశించిపోయిందో
తన కురుల వాసన
మా ఇంటి ముందుల ఉన్న
సాయిబు తాత అత్తరు సువాసన కంటే
పదింతలు గుమ్ముమంటది.
రెండేళ్ల పసిబిడ్డని ఇంటికాడ వదిలేసి
కూలికి పోయిన తల్లి సాయంకాలం తిరిగి వస్తుంటే తల్లిని చూసిన ఆ బిడ్డ కేరింతలతో
ఎంత సంతోష పడతాడో
నిన్ను చూసినప్పుడు
నాకు కూడా అంతే సంతోషం అయితది
నువ్వంటే నాకు ఎంత ఇష్టమో
నీకు తెలిసినంత ఇంకెవరికి తెలియకపోవచ్చు!
ఒకరికి ఒకరం చేయి పట్టుకుని
అలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్లినా
అలసట అనేది మా దరిదాపునకు రాదు
ఒకరిని విడిచి ఒకరం ఉండలేని వాళ్లం
విడిపోతాం అని కూడా ఊహించలేని పిచ్చి ప్రేమికులం
జానప నరాల తడుల పెనవేసుకున్న
మన బంధాలే
మనం బాగా నమ్ముకున్న మన వాళ్లే
మనల్ని దూరం చేశారు
అంతే కాదు..!
నీకు జ్వరం వచ్చినప్పుడు
నీవు మంచాన పడితే
నిన్ను ఏదో మంత్రాలు చేశాను అని
అందరికీ ప్రచారం చేసి సుట్టాలందరి ముందల
నన్ను బదనాం చేసిండ్రు.
అవ్వతోడు
నా మనసు బాగోలేకున్నప్పుడు
నా మనసుకి నీ పేరే ఒక మంత్రం తప్ప
నాకు ఏ మంత్రాలు తెలియవు అంటే నమ్ము
నీవు నా నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు
కన్నీళ్లతో తడిచిన నా గుండె
ఇప్పటికీ ఇంకా తడిగానే ఉంది
నీ పెదాలతో నా పెదాలపై పెట్టిన సంతకం
ఇంకా చెక్కు చెదరలేదు!
ఊపిరి ఆడకుండా నువ్వు పెట్టిన ముద్దులు
నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నవి
మనల్ని విడదీసిన వాళ్లు
అంబరానికి అందెంత సంబరాలు చేసుకోని
ప్రేమికులను విడదీసిన వాళ్లు
చరిత్రలో సుఖపడినట్టు
ఏ దాఖలాలు లేవంట సుమీ..!








వ్యాక్యాన్ని జతచేయండి