ఇచ్ఛామతి

బహుముఖ ప్రజ్ఞాశాలిఅవధానుల మణిబాబు గారితో’ఇచ్చామతి’ యింటర్వ్యూ

నేను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను. నాన్నగారి ఉద్యోగరీత్యా మూలపేట (ఉప్పాడ దగ్గరలో), శివకోడు (కోనసీమ), మండపేటలలో  చదువుకున్నాను. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో బి.ఇడి., చేశాను. ఉద్యోగంలో చేరాక దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం) పూర్తిచేశాను. 2004 నుంచి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కాకినాడలో ఉంటున్నాను.

        మండపేటలో నేను హైస్కూల్ విద్యార్థిగా ఉన్నపుడు తరచుగా సాహిత్య కార్యక్రమాలు ముఖ్యంగా ‘అవధానాలు’, ‘భువన విజయాలు’; ఆ ప్రక్కనే ఉన్న ‘అర్తమూరు’లో  కవి సమ్మేళనాలు జరిగేవి. అలాగే, శాఖా గ్రంథాలయంలో కూడా మంచిమంచి పుస్తకాలు ఉండేవి. అవన్నీ చూస్తూ, చదువుతూ భాష,సాహిత్యాల పట్ల  అభిరుచి ఏర్పడింది. యూనివర్శిటీ స్థాయి వక్తృత్వపోటీలో పాల్గొన్నపుడు న్యాయనిర్ణేతగా వచ్చిన ఓ పెద్దాయన పిలిచి “అబ్బాయ్, నీ మాటలు కేవలం ఉపన్యాసంలా కాదు, వచన కవిత్వం వింటున్నట్టు ఉన్నాయ్. ఆ రంగంలో కృషిచెయ్యి” అని సలహా ఇచ్చారు. అప్పటినుంచీ చదవడం, రాయడం మొదలుపెట్టాను.

        ఇంటర్మీడియట్ నుంచీ కవితలు రాస్తూ స్నేహితులకు వినిపించేవాణ్ణి. 2001లో ట్విన్ టవర్స్ కూలినపుడు రాసిన కవిత “నవోదయం” అనే సాయంకాలపు పత్రికలో వచ్చింది. చూడగానే గొప్ప సంబరంగా అనిపించింది. ఆ ఉత్సాహంతో అంతకు ముందు రాసినవన్నీ జాగృతి పత్రికకు పంపితే వారు ప్రచురించారు. ఇక వ్యాసాల విషయానికి వస్తే, ప్రజాకవి అద్దేపల్లి “తెరలు” దీర్ఘకవితపై సమీక్ష ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలోనూ, వజ్రాయుధ కవి సోమసుందర్ పై “కళాకేళిలో కాసేపు” సాహితీ ప్రస్థానంలోనూ వచ్చినపుడు చెప్పలేనంత సంతోషం కలిగింది. వారి అభిమానులు, సాహితీ ప్రముఖులు చాలామంది ఫోన్ చేసి ప్రశంసించడంతో ఆనందం రెట్టింపయింది.

2013లో అప్పటివరకూ వ్రాసిన 23 కవితలతో ఈ పుస్తకం ప్రచురించాను. అందులో “ముద్ర” అనే కవితలో “బాటే తన బ్రతుకంతా నువ్వు నడిచెళ్ళావని చెప్పుకుంటుoది” అనే పంక్తిలోని భాగాన్ని పుస్తకానికి శీర్షికగా చేశాను. ఇందులో ఒక జోలపాట, మూడు అనువాద కవితలూ ఉన్నాయ్. అప్పటి నా పరిణతి, అవగాహన మేరకు గ్రాంథిక పదాలు, అంత్య ప్రాసలు, చదివేప్పుడు లయబద్ధంగా ఉండడం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేది. ఆధ్యాత్మికవేత్త శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు, కవి మిత్రులు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారు, డా. ఎల్.కె.సుధాకర్ గారు రాసిన అభినందనలు నా తర్వాత ప్రయాణానికి స్ఫూర్తినిచ్చాయి.

నా వ్యాసాలు ఎక్కువగా ప్రసంగాలే. పుస్తకం చదివేటప్పుడు మనసుకు హత్తుకున్న విషయాలన్నీ రాసిపెట్టుకుంటాను. అలాగే, గతంలో చదివిన కథలో, కవితలో గుర్తుకు వచ్చినవన్నీ నమోదు చేసుకుంటాను. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నేను ఉపన్యాసానికి సిద్ధం అవుతాను. ఒక పూర్తి ప్రసంగపాఠం ‘ప్రింట్ అవుట్’తోనే నేను పోడియం దగ్గర నించుటాను. మాట్లాడే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులు అదనపు అంశాల ప్రస్తావన ఉంటుంది, కదా!. ఆ సాయంత్రం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అవసరంలేనివి తొలగించి వ్యాసంగా మార్చి పత్రికలకు పంపుతాను. ఐతే, శీర్షికను నిర్ణయించడం ఒక్కోసారి రోజులు పట్టేస్తుంది. అలాంటి వ్యాసాలన్నీ కలిపి ముద్రించినవే “అన్నవి.. అనుకొన్నవి..”; “స్ఫురణ .. స్మరణ..”; “లోనారసి”.

        సోమసుందర్ గారితో పరిచయం ఏర్పడడానికి ప్రధాన కారణం వారికి  అత్యంత ఆప్తులయిన     డా. సీతారామస్వామిగారు, మన్మథరావుగారు. వీరిద్దరూ కాకినాడలో జరిగిన సభల్లో ‘మునిమాణిక్యం నరసింహారావు కథలు’, ‘కరుణశ్రీ సాహిత్యం’పై నా ఉపన్యాసాలు విని సోమసుందర్ గారికి “ఓ కొత్త కుర్రాడు ఈ మధ్య చాలాబాగా మాట్లాడుతున్నాడు” అని చెప్పారట. ఆయన ఓసారి అతన్ని వచ్చి కలవమనండి అన్నార్ట. అలా వారిని కలిసి మాట్లాడాక “నా పుస్తకాలు ఒక్కొక్కటీ చదివి నీ అభిప్రాయం చెప్పు” అని సూచించారు. అలా ఒక్కో పుస్తకం చదవడం, సమీక్ష వ్రాసి పిఠాపురం వెళ్ళి, వారికి వినపించడం – ఇలా ఒక ఏడాది గడిచింది. ఏడు వ్యాసాలు పూర్తయ్యాక వారు అభిప్రాయం వ్రాశారు. ఇంతలో వారు మరణించడంతో, వాటికి ఒక ఎలిజీని కలిపి “అందినంత చందమామ” పేరిట పుస్తకంగా తెచ్చాను. వారి అభిప్రాయాన్ని ముందుమాటగా ఉంచాను.

          ఇక వారితో సాన్నిహిత్యం విషయానికి వస్తే వెళ్ళిన ప్రతిసారీ ఎన్నెన్నో సంగతులు చెప్పేవారు. కవిత్వం, విమర్శ రెండూ కొనసాగించాలని, అప్పుడే ఒకదాని వలన మరొకటి మెరుగుపడతాయనేవారు. నా మొదటి పుస్తకం మీద “తూర్పు వాకిలిలో నవ కవితా తరంగం” శీర్షికతో (చినుకు పత్రిక జూన్-ఆగస్టు 2015)లో ఒక వాత్సల్యపూరితమైన సమీక్ష రాశారు. అది నేను జీవన పర్యంతం పదిల పరుచుకోవలసిన వ్యాసం.

        చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. వారి మాటలు, చేష్టలు పరిశీలిస్తూ ఉంటాను. మా పెద్దమ్మాయ్ “సాహితీ సాలంకృత” 2014లో పుట్టింది. పాపాయి ఆశ్చర్యపరిచిన సంగతులన్నీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకుని వాటిని చిన్నచిన్న కవితలుగా మార్చి “నాన్న … పాప ..” పేరుతో పుస్తకంగా తెచ్చాను. ఒక్కో కవితనూ ఫేస్ బుక్ లో పెట్టినపుడు చాలా మంచి స్పందన వచ్చింది. ఇది రెండు ముద్రణలు పొందింది. మా అమ్మాయి నాకు ప్రెజెంట్ చేసింది అనో, మా నాన్నగారు ప్రెజెంట్ చేశారానో ఇప్పటికీ ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు. అలాగే, సాహిత్య రంగంలోని పెద్దలు నేను కలిసినపుడు ఈ పుస్తకం ద్వారానే నన్ను పోల్చుకుంటారు. ఆ విధంగా ఇది విజయవంతమైన ప్రయత్నం.

సోమసుందర్ గారు ఎప్పుడూ ఒక దీర్ఘ కవిత వ్రాయి. ఒక వస్తువును అన్ని కోణాలలో దర్శించి సమగ్రంగా వ్యక్తపరిచే అవకాశం అందులో ఉంటుంది అనేవారు. మొదట తెలియజేసినట్లు చిన్నప్పుడు మూలపేట, ఇప్పుడు కాకినాడ సముద్ర తీరంలోనివే. నెలకోసారైనా సముద్రం దగ్గరకు వెళ్ళడం నాకు అలవాటు. ఒడ్డున కూర్చున్నపుడు నాలో కలిగే స్పందనలు అన్నీ గుదిగుచ్చి, వాటన్నిటినీ చిన్న అధ్యాయాలుగా విభజించి చివరిలో పర్యావరణ ప్రస్తావనతో ముగించి ఒక సంభాషణాత్మక కవితగా దీనిని రాసాను. నేను అంటే కవి – ఇల; తాను అంటే సముద్రం – అల. ‘నేనిలా అన్నాను, తానలా అంది’ అని ధ్వనించేలా ‘నేనిలా…తానలా…’ శీర్షిక పెట్టాను. పెద్దగా గుర్తింపు రాకపోయినా నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పుస్తకం ఇది. చెన్నై ‘వేద విజ్ఞాన వేదిక’లో ఈ దీర్ఘకవితాలాపన చేశాను. అది యూ-ట్యూబ్లో అందుబాటులో ఉంది.

సంక్షిప్త కవితలు ఒక ఆలోచనతో పాటు ఎత్తుగడ, ముగింపు అన్నీ ఒకేసారి కలిసి మనల్ని రాసేవరకూ ఉక్కిరిబిక్కిరి చేస్తాయ్. అంటే దాదాపు కవిత మొదటి ప్రయత్నంలోనే పూర్తవుతుంది. తర్వాత ఒకటి రెండు రోజుల పాటు మరలా మరలా చదువుకుని చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటాను. కానీ దీర్ఘకవిత విషయంలో అలా జరగలేదు. ఏ ఏ అంశాలను ఏ అధ్యాయంలో ప్రస్తావించాలి? అని ప్రణాళిక వేసుకుని, వాటికి సంబంధించిన విషయాలను చదివి, Merchant Navyలో పనిచేసిన మిత్రులద్వారా కొన్ని సంగతులు తెలుసుకుని అపుడు రాయడం మొదలుపెట్టాను.

ఒక పుస్తకాన్ని పాఠకుడిగా చదువుతాం. కానీ, దానిపై ప్రసంగం చెయ్యాలి అన్నపుడు ఒక అధ్యయనం జరుగుతుంది. సందేహాలుంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఆ రచయిత తాలూకు ఇతర గ్రంథాలన్నీ చదువుతాం. ఆయన అందుబాటులో ఉంటే మన అభిప్రాయాలను, అందుకోలేని విషయాలను పంచుకుంటాం.  నేర్చుకోడానికి ఇదంతా ఒక మంచి అవకాశం అని నేను భావిస్తాను.    ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి కథల గురించి, వరద రాజేశ్వర రావుగారి వరదకాలం, కవన కుతూహలం; జె.పి. వైద్య వేటకథల గురించి ప్రసంగాల కోసం నేను ఒక పరీక్ష రాసే విద్యార్థిలా సిద్దమయ్యాను. ఇదంతా ఒక ఎత్తయితే, అన్ని సంగతులూ వారిచ్చిన పావుగంటలో సంక్షిప్తం చేసి మాట్లాడడం అసలు సవాలు. ఇలాంటి వేదికలపై ప్రసంగించడం వలన పెద్దలతో పరిచయాలు, వారిచ్చే సూచనలు సలహాలు, ఇతర వక్తలు చెప్పిన విషయాల ద్వారా మనం మరెంతో నేర్చుకోవచ్చు.     

నిజానికి బోధనేతర వృత్తిలో ఉన్న నాకు కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం ఒకింత కష్టమే. ఐతే, విద్యార్థులతో మాట్లాడేటపుడు మనం పాండిత్య ప్రదర్శన చెయ్యకూడదు. Known to unknown అనే అభ్యసనా సిద్ధంతాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం తెలుసో మనం తెలుసుకుని, ఆపైన  ఏం చెప్పగలమో చెప్పాలి. వారికి బాగా పరిచయం ఉన్నది సినీ సాహిత్యం లేదా వారి టెక్స్ట్ బుక్స్ లోని విషయాలు. వీటిని పునాదిగా చేసుకుని, సందర్భాన్ని బట్టి మనం చెప్పదలచుకున్న కవి గురించో, పుస్తకం గురించో అల్లుకుంటూ వారికి అవగాహన కల్పించాలి. మనం ఆసక్తికరంగా చెప్పగలగాలే గానీ విద్యార్థులు శ్రద్ధగానే వింటున్నారు. పైగా మనం చెప్పిన అంశాలపై వారి అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా తెలియజేయగలుగుతున్నారు.

నా మొదటి పుస్తకం వచ్చిన పదేళ్ళ తర్వాత వచ్చిన కవితా సంపుటి ఇది. అప్పటితో పోలిస్తే భాష సరళం అయింది. ఈ దశాబ్దకాలంగా చదివిన ఎన్నో కవితాసంపుటాల  ప్రభావం తప్పనిసరిగా నా కవిత్వంపై ఉంటుంది. వేర్వేరు అంశాలపై రాసిన కవితలతో పాటు తాత్విక చింతనతో కూడినవి,  నాన్న..పాప పుస్తకం వచ్చాక పిల్లలపై వ్రాసినవీ ఇందులో ఉన్నాయ్. శవదర్శనం, దోబూచులాట, కల మెలకువ,మొలకెత్తే గింజలు, అక్షరం, వారికోసమే, నాన్న కథ, కరోనా నిర్బంధంలో, మూడు కాలాలు, సంగీత యానం, వంద అడుగుల వ్యాసపీఠం, కాలం ఒక చేపల తొట్టి – ఈ కవితలన్నీ శిల్పపరంగా ప్రత్యేకమైనవిగా నేను భావిస్తాను.

డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావుగారు తరచుగా చెప్పేటట్లు ఉపన్యాసం ఒక సాహిత్య ప్రక్రియ అని నేను నమ్ముతాను. నాకు ప్రసంగం పట్ల ప్రత్యేకమైన ఇష్టం. ప్రసంగానికి ఒప్పుకుంటే, తీరకలేదని పుస్తకం పక్కన పెట్టలేం. వీలు చేసుకుని ఐనా శ్రద్ధగా చదవాలి. మరో కారణం ఉంది. కవితలోనో, కథలోనో మనవైన భావాలను చెప్పగలం తప్ప మనం విన్న చదివిన కవితలలోనో, కథల్లోనో మంచి విషయాలను వాటి గొప్పతనాన్ని ఇతరులతో పంచుకోలేము. కానీ ప్రసంగంలో ఇది కుదురుతుంది. ప్రసంగ అంశం నుండి విచలనం లేకుండా సమన్వయం చేయదగ్గ సంగతులన్నీ సభాసదులకు అందజేయడంలో ఒక సంతృప్తి ఉంటుంది.

మధునాపంతుల పరమయ్యగారి ఆధ్యాత్మిక సాహిత్యం గురించి రాసిన దీర్ఘవ్యాసాన్ని “పరమమ్” అనే పుస్తకంగా, యాభై ఏళ్లక్రితం రాసిన ‘మధుశ్రీలు’ సంపుటిలోని కథలను తులనాత్మకంగా సమీక్షిస్తూ “మధుశ్రీలు చదివాక”, రామాయణం యుద్ధకాండపై వ్యాసం “అచ్యుతమీ రామకథ”  నేను రాసిన మరో మూడు పుస్తకాలు.

***

Author

Spread the love

3 వ్యాక్యలు

Leave a Reply to ప్రభు స్పందనను రద్దుచేయండి

  • ఈ భావుకుడి సాహితీ ప్రణయయాత్ర చాలా ఆహ్లాదకరంగా… సంస్కారవంతంగా… ఆత్మీయంగా చాలా రోజుల పాటు మనసును పట్టుకుని ఉంటుంది. అందమైన వచనం, విలక్షణమైన అభివ్యక్తి, హృదయానికి పట్టుకునే శైలి, లలితమైన పద ప్రయోగాల పోహళింపు… నిజానికి… కవిత్వాన్ని ఇంత మనస్ఫూర్తిగా స్వాగతించే… శ్వాసించే వ్యక్తి మరొకరు ఉండరేమో! చాలా బాగుంది… మణిబాబుతో.. ఈ ఆత్మీయ పలకరింపు, రచనా వ్యాసంగ పరామర్శ. ఎవరికోసమో…. ఏ ఇజాల కోసమో.. నిజాలకోసమో కాకుండా… తనతో తాను ముచ్చటించుకునేందుకు… తమలో తానొక ఏకాంత అన్వేషణ చేస్తూ… తన సాహితీ జీవికను ఎప్పటికప్పుడు పునర్జీవితం చేసేందుకే కవితా సాధన చేస్తున్న ఒక రసజీవి అంతరాన్ని మాకు అందించిన ఇచ్ఛామతికి నా అభినందనలు.

  • ఈ భావుకుడి సాహితీ ప్రణయయాత్ర చాలా ఆహ్లాదకరంగా.. చాలా రోజుల పాటు మనసును పట్టుకుని ఉంటుంది. అందమైన వచనం, విలక్షణమైన అభివ్యక్తి, హృదయానికి పట్టుకునే శైలి, లలితమైన పద ప్రయోగాల పోహళింపు, కవిత్వాన్ని ఇంత మనస్ఫూర్తిగా స్వాగతించే… శ్వాసించే వ్యక్తి మరొకరు ఉండరేమో! చాలా బాగుంది… మణిబాబుతో.. ఈ ఆత్మీయ పలకరింపు, రచనా వ్యాసంగ పరామర్శ. ఎవరికోసమో…. ఏ ఇజాల కోసమో.. నిజాలకోసమో కాకుండా… తనతో తాను ముచ్చటించుకునేందుకు.. తమలో తానొక ఏకాంత అన్వేషణ చేస్తూ… తన సాహితీ జీవికను ఎప్పటికప్పుడు పునర్జీవితం చేసేందుకే కవితా సాధన చేస్తున్న ఒక రసజీవి అంతరాన్ని మాకు అందించిన ఇచ్ఛామతికి నా
    అభినందనలు.

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!